ఆ రోజు ఏం జరిగిందంటే... | Short Stories | Sakshi
Sakshi News home page

ఆ రోజు ఏం జరిగిందంటే...

Published Sat, Feb 11 2017 11:47 PM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM

ఆ రోజు ఏం జరిగిందంటే... - Sakshi

ఆ రోజు ఏం జరిగిందంటే...

1
ఒక ప్రసిద్ధ కంపెనీకి రమణ యజమాని.
ఆఫీసు నుంచి ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుతాడు రమణ. అందుకే... ఆఫీసు పరిసరాల్లోనే ఈవినింగ్‌ వాక్‌ చేయడం అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు  ఈవినింగ్‌ వాక్‌ చేస్తూ హత్యకు గురయ్యాడు.
రమణ హత్యకు గురయ్యాడనే వార్త సంచలనం సృష్టించింది.
ఉద్యోగుల రోదనలు మిన్ను ముట్టాయి.
‘‘రమణగారికి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎవరైనా శత్రువులు ఉన్నారా?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ నరసింహ.
‘‘వ్యక్తిగతంగా తెలియదుగానీ...వృత్తి పరంగా మాత్రం చాలా కంపెనీలతో పోటీ ఉంది. ఇక్కడికి దగ్గరిలో ఒక పోటీ కంపెనీ ఉంది. దాని యజమాని రవికి మా రమణగారికి ఈమధ్య తీవ్రమైన గొడవ జరిగింది’’ అని చెప్పాడు కంపెనీలో పనిచేస్తున్న సీనియర్‌ మేనేజర్‌.
పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రవి కుమార్‌ ఆఫీసుకు చేరుకున్నారు.
‘‘రమణ హత్యలో మీ ప్రమేయం  ఉందని అనుమానిస్తున్నాం. హత్య జరగడానికి ముందు రమణ వాకింగ్‌ చేసే ప్రాంతంలో మీరు కనిపించారని తెలిసింది’’ సూటిగా విషయంలోకి దిగాడు ఇన్‌స్పెక్టర్‌ నరసింహ.
‘‘నాకు రమణకు మధ్య గొడవలు జరిగిన విషయం నిజమేగానీ... అతడిని నేను హత్య చేసేంత గొడవలు ఏమీ కావు. హత్యలు చేసే స్వభావం నాకు లేదు. రమణ వాకింగ్‌ చేసే సమయంలో నేను కనిపించాననే వార్త... నా గురించి గిట్టని వాళ్లు పుట్టించింది. వ్యాపారం అన్నాక...సవాలక్ష మంది శత్రువులు ఉంటారు. అందరినీ చంపుకుంటూ వెళ్లలేము కదా!’’ అన్నాడు రవి.
‘‘అది సరేగానీ... మీరు వేసుకున్న షూస్‌  చూపండి’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.
ఇన్‌స్పెక్టర్‌కు తన  షూ చూపించాడు రవి.
‘‘ఓకే... ఒక్కసారి మీ కారు దగ్గరికి వెళదాం’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.
భయం భయంగానే ఇన్‌స్పెక్టర్‌ని  కారు దగ్గరికి తీసుకువెళ్లాడు రవి.
కారు డోర్‌ తెరిచి... మ్యాట్‌ను పరిశీలించాడు ఇన్‌స్పెక్టర్‌. ఆ తరువాత...
‘‘నిన్ను అరెస్ట్‌ చేస్తున్నాను’’ అన్నాడు రవితో.
ఇప్పుడు చెప్పండి... రవి హంతకుడని ఇన్‌స్పెక్టర్‌ ఎలా కనిపెట్టాడు?

2
అరవై రెండు సంవత్సరాల హరిప్రసాద్‌ చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. తన పరిధిలో వీలైనంత సహాయం చేస్తుంటాడు.  ఏదైనా మంచి పుస్తకం చదవాలనుకున్నప్పుడు ఇంటికి కాస్త దగ్గరలోని తన ఆఫీసుకు వెళ్లి, పుస్తకం చదువుకొని అక్కడే పడుకోవడం అనేది అతడి అలవాటు.
‘ఇంట్లోనే చదవచ్చు కదా’ అని అంటే–
‘ఆఫీసులో నేను ఒక్కడిని ఉంటాను. ఎలాంటి డిస్ట్రబెన్స్‌ ఉండదు’ అనేవాడు. అయితే ఇదే అతడి కొంప ముంచింది. ఆరోజు పుస్తకం చదువుకుంటూ ఆఫీసులోనే పడుకొని ఉన్న హరిప్రసాద్‌ హత్యకు గురయ్యాడు. ఆరాత్రి హత్య జరగడానికి ముందు కొంతసేపు వర్షం పడింది. మట్టి నేల చిత్తడయింది.
పోలీసులు ముగ్గురిని అనుమానించారు.
1. రంగయ్య...పాత రౌడీ. చుట్టలు విపరీతంగా కాలుస్తాడు.
2. శ్రీను... ఎప్పుడూ  ఎవరితో ఒకరితో తగాద పడుతుంటాడు. గుట్కాలు విపరీతంగా తింటాడు.
3. మోహన్‌... ఇతడిది కూడా నేరస్వభావం. చెప్పులు వేసుకునే అలవాటు లేదు.
 ఆఫీసు పరిసరాల్లో...  చుట్ట ముక్క ఒకటి కనిపించింది. మరో పక్క రెండు చించిన గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. వీటిని బట్టి రంగయ్య, శ్రీనులకు  హత్యతో సంబంధం ఉందనే అనుమానాలు వెల్లువెత్తాయి. కానీ ఇది నిజం కాదు. మోహన్‌ హంతకుడని పోలీసులు కనిపెట్టారు. అంత కరెక్ట్‌గా ఎలా కనిపెట్టారు?

 

ఆన్సర్‌

1. రమణ ఈవినింగ్‌ వాక్‌ చేసే ప్రదేశంలో..రోడ్డుకు కొత్తగా తారు వేశారు. రోడ్డు తొక్కకుండా తప్పించుకోవడం అక్కడ అసాధ్యం. అలా రవి షూకు తారు అంటింది. హత్య చేసి కారులోకి ఎక్కినప్పుడు మ్యాట్‌ మీద తారు మరకలు పడ్డాయి. ఆఫీసుకు వచ్చిన రవి షూ మార్చాడుగానీ.. మ్యాట్‌ విషయం మరచిపోయాడు.

2. ఆఫీసు ముందు చిత్తడి నేల మీద చెప్పులు లేని కాళ్ల అడుగులు మోహన్‌ ని పట్టించాయి. రంగయ్య, శ్రీనులపై అనుమానం రావడానికి పరిసరాల్లో చుట్ట ముక్క, గుట్కా ప్యాకెట్‌ వేశాడు మోహన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement