అమ్మ కావడమే నేరమా?
చేయని నేరం
పిల్లల కోసం తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది తల్లి. కానీ ఏంజెలా కానింగ్‌స విషయంలో ఆ మాట నిజం కాదు అంది న్యాయస్థానం. ఆమెకు తల్లి అనిపించుకునే అర్హతే లేదంటూ కటకటాల వెనుక్కు పంపించింది.
యూకేకి చెందిన ఏంజెలా తన ఫ్రెండ్ టెర్రీని పెళ్లి చేసుకుంది. సంవత్సరం తిరిగే లోపు ఓ పాపకు తల్లి అయ్యింది. కానీ పదమూడు నెలల వయసులో ఆ పాప హఠాత్తుగా అనారోగ్యంతో మరణించింది. విలవిల్లాడిపోయింది ఏంజెలా. తర్వాత కొన్నాళ్లకు మళ్లీ అమ్మయ్యింది. గుమ్మడి పండులాంటి మగబిడ్డను చూసుకుని మురిసిపోయింది. కానీ పద్దెనిమిది నెలల వయసులో ఆ బాబు కూడా కన్ను మూశాడు. తట్టుకోలేకపోయింది ఏంజెలా. గుండె పగిలేలా ఏడ్చింది.
అయితే సమాజం ఆమె మీద జాలి చూపించలేదు. వరుసగా పిల్లలు చనిపోవడాన్ని అనుమా నించింది. ఏంజెలాయే వాళ్లని ఏదో చేస్తోందని కొందరన్నారు. పోలీసులకు ఉప్పు అందడంతో ఏంజెలాని అరెస్ట్ చేశారు. తనకే పాపం తెలియదని ఎంత మొత్తుకున్నా కోర్టు నమ్మలేదు. ఆమెను దోషిగా ఎంచి జైలుకు పంపించింది. సుదీర్ఘ విచారణల అనంతరం 2002లో తీర్పు వెలువడే సమయానికి ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారిని వదల్లేక వదల్లేక వదిలి జైలుకు వెళ్లింది ఏంజెలా.
ప్రపంచమంతా ఏంజెలాను అనుమా నించినా, భర్త మాత్రం అనుమానించ లేదు. పిల్లలంటే ఆమెకెంత పిచ్చో అతనికి తెలుసు. అందుకే పిల్లల మరణానికి కారణాన్ని అన్వేషించాడు. వంశ పారం పర్యంగా వచ్చే ఓ వ్యాధి కారణంగా వాళ్లు మరణించారని తేలింది. ఆ విషయాన్ని కోర్టులో నిరూపించాడు. భార్యను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చాడు. కానీ అప్పటికే ఏంజెలా 49 నెలల జైలు జీవితాన్ని గడిపింది. ఆ బాధతో డిప్రెషన్‌కి గురై ఇప్పటికీ చికిత్స తీసుకుంటోంది!