తేగలు | short story | Sakshi
Sakshi News home page

తేగలు

Published Sun, Oct 16 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

తేగలు

తేగలు

 ‘ఎందుకూ.. తేగల్ని చూడగానే ఆగిపోతావూ’...
 ‘ఉండూ.. ఉండూ’...
 బండి మీద తేగలు ఉన్నాయి. కాల్చినవి. మూడేసి లెక్కన కట్టగట్టి పేర్చి ఉన్నాయి.
 వెళ్లి అడిగాడు.
 ‘ఎంత?’
 బండివాడు చెప్పాడు.
 మొదట రెండు కట్టలు కొందామనుకున్నాడు. తర్వాత నాలుగనుకున్నాడు. చివరకు ఆరు కొన్నాడు.
 ‘ఆరు కట్టలా?... ఇక అవి అలా డైనింగ్ టేబుల్ మీద పడి ఉండాల్సిందేగా’...
 కూరగాయల సంచిలో వేసుకున్నాడు.
 ‘వినవు కదా. పూనకం వస్తుంది నీకు. రెండ్రోజుల్లో తిన్నావా సరేసరి. లేదంటే
 ఇరుగమ్మకు పొరుగమ్మకు ఇచ్చేస్తాను’...
 బండి తీశాడు.
 ఇంటికి వచ్చేసరికి పిల్లలు గ్రిల్‌కి తాళం వేసుకుని లోపల టీవీ చూస్తున్నారు.
 ‘నాయనా.... ఇప్పుడు వాళ్ల ప్రాణం తీస్తావా ఏమిటి?’
 లోపలికి వచ్చాక కూరగాయల సంచి
 తీసుకెళ్లి కిచెన్‌లో పెడదామనుకుంది. ఆపి, సంచిలోని తేగల కట్టల్ని బయటకు తీశాడు.
 ‘రేయ్... ఇలా వచ్చి ఇద్దరూ తినండి’
 పిల్లలు అవస్థగా చూశారు. అప్పుడప్పుడు తేగల సీజన్ వస్తుంది. వచ్చినప్పుడల్లా ఇలా కొని తేవడం ఉంటుంది. తినమని బలవంతం చేయడమూ ఉంటుంది. ఈ పదార్థం ఏమిటో... వీటిని ఎవరు తింటారో... అసలు ఎందుకు తింటారో...
 ఒకసారి కొనితెచ్చి బెదిరింపుగా షటిల్ బ్యాట్ తీసుకుని నాలుగు తగిలిస్తాను
 అన్నట్టుగా కూచుంటే చెరో ముక్క నోట్లో
 వేసుకొని యాక్ అని సింక్‌లో ఊశారు. ఊస్తే పోవడానికి అదేమైనా ఐస్‌క్రీమా? అలాగే అడ్డం పడి ఉంటే తీసి బయట పడేశాడు.
 తేగలు తినని పిల్లల్ని కన్నాడు. అనుభవిస్తూ ఉండాలా? చూద్దాం... ఎందుకు తినరో.
 ‘తింటారా... తినరా’
 ‘తండ్రీ... ఈ తేగల్ని తెచ్చి ఎందుకు
 అసురునిగా మారుతావు. నేను తినింది లేదు. నా పిల్లలు కూడా తినేది లేదు’....
 న్యూస్‌పేపర్ నేల మీద
 పరిచింది.
 ‘ఇదిగో... దీని ముందు కూచుని ఎన్ని తింటావో తిను. చెత్త మాత్రం కింద పడటానికి లేదు’...
 పిల్లలు ఇదే అదనుగా వెంట పరిగెత్తి ఇంకో గదిలో దాక్కున్నారు. ఎప్పుడు స్మగుల్ చేసిందో క్షణాల్లో ఫోన్ స్మగుల్ చేసింది. రైతుబజార్‌లోనే కొన్న విజయా డైరీ కోవాబిళ్లలు స్మగుల్ చేసింది. అవి తింటూ ఫోన్‌లో గేమ్ ఆడుకుంటూ... ఇక ఈ తేగల వైపే రారు.
 వెళ్లి ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని హాల్లో డైనింగ్ ఏరియాలో లైట్లు వెలిగించాడు.
 కారిడార్లలో కూడా లైట్లు వెలిగాయి. టీవీ చూద్దామా పేపర్ తిరగేద్దామా అనుకుంటూ ఉంటే వచ్చి చెప్పింది.
 ‘మధ్యాహ్నం నీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు చేసినా తీయలేదటగా. ఎల్లుండి పిల్లల బర్త్‌డే పార్టీ ఉందట. అందరూ వచ్చి పెత్తనం చేసి
 వెళ్లమన్నాడు’
 ‘నేను రాను’
 చిర్రెత్తుకొచ్చినట్టు చూసింది.
 ‘ఎందుకలా చేస్తావు? చాలాసార్లు
 గమనించాను. అందరిళ్లకు పరిగెత్తుకుని ప్యాంటు లాక్కుని వెళుతుంటావు. మమ్మల్ని తీసుకెళుతుంటావు. వీళ్ల ఇంటికి మాత్రం
 రానంటావు. అన్నీ తిక్క పనులు. తిక్క చేష్టలు’
 ‘అవును. తిక్క పనులే. వెళ్లు’
 ఎగాదిగా చూసి వెళ్లిపోయింది.
 వాడంటే ఇష్టమే. ఫోన్‌లో గంటలు గంటలు మాట్లాడతాడు. ఏదైనా సహాయం కావాలంటే క్షణాల్లో చేసి పెడతాడు. కాని ఇంటికి మాత్రం వెళ్లడు.
 మళ్లీ వచ్చి తేగలు తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్లి టీ తెచ్చి ఇచ్చింది.
 ‘అరె... ఎంత బాగుంటుంది వాళ్ల ఇల్లు.
 కళకళలాడుతుంటుంది. మీ ఫ్రెండు... ఫ్రెండు భార్య... పిల్లలు...
 చాలనట్టు ఇంటి పెద్దలుగా ఉంటూ వాళ్లను కనిపెట్టుకుని ఉండే మీ ఫ్రెండు వాళ్ల నాన్న... అమ్మ... చాలా బాగుంటుంది. పైగా మనల్ని చూసి ఆ పెద్దాయన ఎంత ఆప్యాయంగా మాట్లాడతాడు. ఏమ్మా.. పాపా.. ఎలా ఉన్నావు.. పిల్లల్నేంటమ్మా ఇలా చేసి
 పెడుతున్నావు.. బలంగా ఏదైనా తినిపించవచ్చు కదా అని ఎంతో ఇది చేస్తాడు. ఆయనకు మనమన్నా పిల్లలన్నా’...
 ‘ఇంక ఆపుతావా’
 ‘నీకు చిర్రుబుర్రు ఎక్కువైంది’... వెళ్లి
 పోయింది.
 టీవీ ఆన్ చేశాడు. సీరియల్సు విజృంభించే సమయం. చాలామంది ఆడవాళ్లు శపథాలు చేస్తున్నారు. కొందరు హత్యలు చేస్తామని
 బెదిరిస్తున్నారు. ఆఫ్ చేశాడు. ఫోన్ తీసుకొని ఎవరికైనా ఫోన్ చేద్దామా అనుకున్నాడు. ఎవరికి చేస్తాడు? ఇళ్లకు చేరుకునే టైము. అందరూ ట్రాఫిక్‌లో ఉంటారు. హెల్మెట్లు పెట్టుకుని ఖాళీ చేసిన లంచ్ బాక్సులు వేలాడేసుకుని బండి మీద అటో కాలు ఇటో కాలు నేలకు దించి
 నెట్టుకుంటూ నెట్టుకుంటూ ఎప్పటికో చేరతారు. తనూ అలాగే చేరతాడు. ఇవాళ పర్మిషన్
 పెట్టబట్టి ట్రాఫిక్‌ని తప్పించుకుని తొందరగా రైతు బజారుకు వెళ్లి వచ్చేయగలిగాడు. లేకుంటే ఈసరికి ఏ ఫ్లైఓవర్ మీదో వేళాడుతూ ఉండేవాడు. పొద్దున చేద్దామన్నా అంతే. ట్రాఫిక్‌లోనే ఉంటారు. ఆఫీసుకు వెళుతూ... ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటూ.. సారీలు చెప్పుకుంటూ... నువ్వూ చిక్కుకున్నావా ఈ రొంపిలో అని
 పక్కవాడిని జాలిగా చూస్తూ.
 రెండు మూడు నెలలుగా ఫ్రెండ్స్‌ని కలుద్దామనుకుంటున్నాడు. ఊరు కూడా వెళ్లొద్దామనుకుంటున్నాడు. కుదరదు. లీవు పెట్టొచ్చు. సీఎల్సు అవీ ఉంటాయి కూడా. కాని పెట్టలేడు. ఆరోగ్యంగా ఉండాలి. రోజూ ఆఫీసుకు వచ్చి పోతుండాలి. రెండు వారాలకు ఒకసారి తప్పనిసరిగా కూరగాయలు తెచ్చుకుంటూ ఉండాలి.
 అసలు కొన్నాళ్లుగా ఏమీ రిజిస్టర్ కావడంలేదా అనిపిస్తూ ఉంది. క్రెటా, ఫోర్డ్
 టైటానియం, ఫర్ హైర్, ఓలా, ఫిర్ మిలేంగే, అర్షిత-అర్పిత, నాంపల్లి టు అపురూపా కాలనీ, మెట్రో పనులు జరుగుచున్నవి, రెడ్ సిగ్నల్, ఆగుము, యూ టర్న్ ముందు ఉన్నది...
 ట్రాఫిక్‌లో కనిపించేవే బుర్రంతా నిండుతున్నాయా అని.
 చిన్నప్పుడే అంతా బాగుండేది. తప్పనిసరిగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి టీ బంకు దగ్గర కూచునేవాడు. సిటీకి వచ్చిన కొత్తల్లో కూడా ఇరానీ కేఫుల్లో ఫ్రెండ్స్‌తో గంటల గంటల కబుర్లకు సమయం చిక్కేది. ఇప్పుడు? టైమ్ చచ్చిపోయిందా అనిపిస్తూ ఉంది. ఈ
 వర్తమానానికి ఏ జ్ఞాపకాన్నీ మిగల్చని
 మహమ్మరి చుట్టుకుందని భయం కలుగుతోంది.
 పిల్లలు దొంగల్లాగా వచ్చారు. ఇద్దరూ మహానటులు. చిన్నాణ్ణి ముందు పెట్టి పెద్దాడు అన్నాడు.
 ‘నాన్నా’
 ‘ఏంటి?’
 ‘రేపు బుధవారం’
 ‘అయితే?’
 ‘మర్చిపోయావా? కేఎఫ్‌సీలో హ్యాపీ
 వెన్స్‌డేస్. 199 రూపాయలకే ఎనిమిది బోన్‌లెస్ స్ట్రిప్స్. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక
 తీసుకెళ్లాలి’...
 ‘తీసుకెళ్లాలి’ చిన్నాడు అన్నాడు.
 రోడ్డు మీద ఫాస్ట్‌ఫుడ్డు బండి పెడితే
 అప్పుడప్పుడు చికెన్ మంచూరియా తెచ్చి పెట్టేవాడు. అయితే అందులో అజినోమోటో అనే చైనా ఉప్పును కుమ్మరిస్తారనీ అది గనక ఎక్కువ తింటే చెప్పాపెట్టకుండా నరాలు చచ్చుపడిపోతాయని ఎవరో భయపెడితే మానేశాడు. కేఎఫ్‌సీ బెస్టు కదా అంది ఒకరోజు. అప్పటి నుంచి
 తీసుకువెళ్లడం అలవాటు చేశాడు. నెలకు ఒకటి రెండుసార్లు. ఎప్పుడు వెళ్లినా ఒకేలాంటి
 ఆంబియన్స్... ఒకేలాంటి కౌంటర్... ఒకేలాంటి బోన్‌లెస్ స్ట్రిప్స్... ఒకేలాంటి చప్పటి వాసన.
 ‘ఇలా రండి’ ఇద్దర్నీ పిలిచాడు.
 ‘కూచోండి’... అటూ ఇటూ కూచోపెట్టు
 కున్నాడు.
 ‘లాస్ట్‌టైమ్ కేఎఫ్‌సీకి వెళ్లాం కదా. మీకేం గుర్తు ఉంది?’
 ‘వెళ్లాం. తిన్నాం. వచ్చాం’ చిన్నాడు అన్నాడు.
 ‘దానికి ముందు’
 ‘అప్పుడూ అంతే. వెళ్లాం. తిన్నాం. వచ్చాం’
 చూశాడు. పది, పన్నెండేళ్లున్న పిల్లలు. ఇక్కడే పుట్టి పెరిగారు. రోజూ స్కూల్‌కి వెళతారు. రోజూ టీవీ చూస్తారు. ఆదివారం ఇంట్లో
 ఆడుకుంటారు.
 ‘గుర్తుండాలి కదా’
 పెద్దాడు నవ్వాడు.
 ‘ఏం గుర్తుండాలి నాన్నా’...
 ఆ నవ్వుకు వచ్చి, చూసి వెళ్లింది. వంట పూర్తవడానికి ఇంకో ముప్పావు గంటైనా
 పడుతుంది. ఈలోపు కిచెన్‌లో ఉన్నా చెవులు ఇటే పారేసి ఉంటుంది.
 ‘సరే... మీ అమ్మకు మీకు ఏమీ గుర్తుండవు. నాకు గుర్తు ఉంటాయి. కావాలంటే అడగండి. తినే వస్తువు దేని గురించైనా సరే. ఏం గుర్తుండాలో చెబుతాను. ఇందాక మీరు కోవా తిన్నారు కదా. కోవా అనండి’
 ‘కోవా’ ఇద్దరూ హుషారుగా ఉన్నారు.
 ‘ఊ... కోవా... కోవా అనగానే నాకు ఏం గుర్తుకొస్తుందంటే చిన్నప్పడు మా ఇంటికి వచ్చి పాలుపోసే వనజమ్మ గుర్తుకు వస్తుంది. ఆమె ఎంత బక్కగా ఉండేదో తెలుసా? పెన్‌లో రీఫిల్ ఉంటుందే అలా ఉండేది. పాలు అమ్ముతుంది కదా. గుక్కెడు పాలు తాగొచ్చు కదా. ఊహూ. పిసినారి. పితికిన ప్రతి పాలచుక్కా అమ్ముదామనుకుంటుంది. పొద్దున పచ్చిపాలు అమ్ముతుంది. పాలు మిగిలిపోతే వాటిని వెచ్చబెట్టి సాయంత్రం తక్కువరేటుకి కాచిన పాలు అమ్ముతుంది. మా అమ్మ దగ్గర... అదే మీ నానమ్మ దగ్గర డబ్బులు ఉండేవి కాదు కదా. అందుకని రాత్రి పూట తక్కువ రేటుకు కాచినపాలు మాత్రమే కొనేది. ఒకసారి వనజమ్మ దగ్గర ఎందుకనో రెండు శేర్ల పాలు మిగిలిపోయాయి. రాత్రి ఎనిమిదింటికి ఇంటికి వచ్చి ఎంతోకొంత తర్వాత ఇద్దువు ఈ పాలు తీసుకో అని ఒకటే గోల. అన్ని పాలు
 ఎవరికి కావాలి. రూపాయిన్నరకిస్తావా అంది అమ్మ. రూపాయి ఇచ్చినా చాలు అంది
 వనజమ్మ. అప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే ఆ పాలు తీసుకొని మమ్మల్నందరినీ పిలిచి పొయ్యి దగ్గర కూచోబెట్టి ఆ మాటలూ ఈ మాటలూ చెప్తూ పాలను మరిగిస్తూ మరిగిస్తూ కొంచెం చక్కెర పోసి అంత రాత్రి పూట
 పాలకోవా చేసి, ఇంట్లో కొబ్బరి వొలిచాకా ఖాళీ చిప్పలను పొయ్యిలోకని దాచేది... ఆ చిప్పలను నాలుగు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి అక్కకి, నాకూ, తమ్ముడికి, చెల్లెలికి ఒక్కో చిప్పలో కొంచెం కొంచెం పాలకోవా వేసి చేతికి ఇచ్చింది. దేవుడా... పాలకోవా! ఆ రాత్రి అందరం చూపుడు వేలితో కొంచెం కొంచెం తింటూ ఎప్పుడు అయిపోతుందో అని భయపడుతూ ఆవలింతలు వచ్చేంత దాకా ఆ కొబ్బరి
 చిప్పలను గీరిగీరి తింటూనే ఉన్నాం. కోవా అంటే నాకు అది జ్ఞాపకం వస్తుంది.’
 ‘జామకాయలు’ పెద్దాడు అన్నాడు.
 ‘జామకాయలా... వో... మనింట్లోనే పెరట్లో జామచెట్టు ఉండేది. కూజా జామచెట్టు. అంటే దాని కాయలు కూజాల్లా ఉంటాయన్నమాట. మొదట తెల్లటి మొగ్గలేసి ఆ తర్వాత పూలయ్యి ఆ తర్వాత పిందెలయ్యి ఆ తర్వాత కాయలయ్యేవి. ఆ కాయలు కాస్త పెరిగి పెద్దవవగానే అక్కా, నేను, తమ్ముడు, చెల్లి ఒక ఉదయం పూట నిలబడి చెట్టంతా చూసి కొమ్మలన్నీ వొంచి సరిగ్గా పండడానికి రెడీ అవుతున్న కాయలను కొమ్మల మీదే పంచుకునేవాళ్లం. ఆ తర్వాత అందరం అమ్మ పాతచీర తెచ్చి చిన్న చిన్న గుడ్డముక్కలుగా చించి ఎవరి కాయలకు వాళ్లం గుడ్డ కట్టేసేవాళ్లం’...
 ‘ఎందుకు?’
 ‘అలా కడితే బాగా పండుతాయి. చిలకలు కొట్టవు. కోతులు కూడా తాకవు. అందుకని గుడ్డ కట్టి కాయలని చెట్టు మీదే దాచి రోజూ చూసుకుంటూ ఉండేవాళ్లం. అవి పెద్దవయ్యాక దోర
 కాయలుగా మారాక అప్పుడు అందరం ఒకేసారి కోసి తొట్టిలోని నీళ్లతో కడిగి ముక్కలుగా చేసి ఉప్పూ కారం రాసి వీధిలో గర్వంగా మా చెట్టుకాయలు అని తింటూ ఉంటే... ఠ్ఠ్ .... భలే ఉండేది. అదీ జామకాయ అనగానే నాకుండే జ్ఞాపకం’...
 ‘ఆపిల్’ చిన్నాడు అన్నాడు.
 ‘ఆపిల్.. అమ్మో... కాస్ట్‌లీ... ఒక్కసారి కూడా ఇంట్లో తెచ్చేవాళ్లు కాదు. అరటి పండ్లు.. ద్రాక్షపండ్లు... ఎప్పుడైనా కమలాపండ్లు... కాని ఆపిల్ మాత్రం కాని పని. కాని నేను మాత్రం కుమ్మరి వీధికి వెళ్లి పదిహేను పైసలకు ఒక మట్టి హుండీ కొనుక్కుని దానిని అటక మీద దాచి ఐదు పైసలూ పది పైసలూ అప్పుడప్పుడూ దాస్తూ ఉండేవాణ్ణి. ఆ డబ్బులు కూడా దొరికేవి కావు. అయినా సరే ఎలాగోలా దాచేవాణ్ణి. డిసెంబర్ 31 వస్తుంది కదా. ఆ రోజున ఆ హుండీని పగులగొట్టి చిల్లర మొత్తం చూసేవాణ్ణి. మరుసటి రోజు జనవరి ఒకటి కదా. ఆ డబ్బుతో
 ఉదయాన్నే బజారుకు వెళ్లి ఒక ఆపిల్ అడిగితే వచ్చేది. బండివాడు ఆపిల్‌ని రంగు కాగితంలో చుట్టి దారం కట్టి ఫ్యాషన్‌గా ఇచ్చేవాడు. దానిని తీసుకెళ్లి నాకు ఇష్టమైన రమాదేవి టీచర్‌కు ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ టీచర్ అని చెప్పేవాణ్ణి. ఆ టీచర్ నాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి భుజం పట్టుకుని దగ్గరకు తీసి తల నిమిరేది. ఆమే నాకు ఒకసారి లిఫ్కో టైనీ డిక్షనరీ ఇచ్చింది. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది’....
 ఇద్దరూ విన్నారు. పెదాలు రెండూ దగ్గరకు అదుముకుంటూ విన్నారు.
 పెద్దాడు తల పంకిస్తూ అన్నాడు.
 ‘మరి తేగలు’...
 ‘తేగలూ?’
 ‘అవును. తేగలు’...
 తాకినట్టుగా అయ్యింది. లేచి నిలబడ్డాడు. అడుగులు వేస్తూ డైనింగ్ టేబుల్ దాకా వెళ్లి వాటిని తీసుకొచ్చాడు. మళ్లీ ఇద్దరి మధ్య
 కూచున్నాడు.
 ‘చెప్పు నాన్నా’...
 ‘తేగలు అంటే మా నాన్నరా’...
 ‘అంటే తాత?’
 ‘ఊ’...
 ‘ఆయన చాలా చిన్న పల్లెటూళ్లో పుట్టాడు. ఒక్కడే కొడుకు. ఎంత ఒక్కడే కొడుకైనా ఇప్పటిలాగా అప్పుడు తినిపించడానికి పిజ్జాలు బర్గర్‌లు కెఎఫ్‌సీలు ఉండవు కదా. అసలు చాక్లెట్లు పిప్పరమెంట్లు కూడా ఉండవు. ఏమీ ఉండవు. ఏ
 సీజన్‌లో ఏ కాయ వస్తే ఆ సీజన్‌లో ఆ కాయను తినిపించడమే. మామిడికాయ, జాంకాయ, నేరేడు, ముంతమామిడి’...
 ‘ముంతమామిడి అంటే?’
 ‘క్యాషూ ఫ్రూట్’
 ‘ఓ’
 ‘కాని ఈయనకు తేగలంటే ఇష్టం. ఎందుకు ఇష్టమో మరి ఇష్టం. తేగలు దొరికినన్నాళ్లు ఇవే ఇమ్మని ఏడ్చేవాడంట. చాలా మొండివాడట ఆయన. ఒకసారి ఈ తేగల పిచ్చి మాన్పించాలని చాలారోజులు ఇంట్లో ఎవరూ తేగలు కొనివ్వలేదట. అప్పుడు మీ తాత ఏం చేశాడో తెలుసా?’
 ‘ఏం చేశాడు?’
 ‘ఒకరోజు సాయంత్రం వాళ్ల నాన్న చొక్కా తగిలించి ఉంటే జేబులో చేయి పెట్టేశాడట. ఏ పైసానో రెండు పైసలో దొరుకుతాయనుకుంటే పావలాకాసు దొరికిందంట. బాబోయ్. పావలా కాసే. దాంతో ఎన్ని తేగలు వస్తాయో తెలుసునా? కట్టలు కట్టలు వస్తాయి. చాలా భయపడిపోయాడట. ఒక పాత కాగితం తీసుకుని ఆ కాగితంలో కాసు పెట్టి దాంతో చుట్టీ చుట్టీ పెద్ద ఉండ చేసి దాచి పెట్టి ఆ రాత్రంతా నిద్ర పోలేదట. మరుసటి రోజు ఆ పావలాను మార్చి వారం రోజుల పాటు తేగలు తినడమే తినడం అట’...
 నవ్వారు.
 ‘ఇది మాకు ఎప్పుడూ చెప్తుండేవాడు. మేము పెద్దయ్యాక కూడా ఎప్పుడు తేగలు కనిపించినా తెచ్చి తినమని ఇచ్చి తను కూడా తింటూ మాతో కబుర్లు చెప్పేవాడు. తేగల్లో చందమామ ఉంటుంది కదా’...
 ‘చందమామా?’
 ‘అవును. నువ్వు పారేశావే నడిమి కాడ. అదే చందమామ. అది తింటే తెలివితేటలు వస్తాయి అని చెప్పేవాడు. ఆ
 చందమామ కడుపులో బుల్లి చందమామ కనిపిస్తే అదృష్టం అనేవాడు’...
 చూస్తూ ఉన్నారు.
 ‘అప్పట్నించి నాక్కూడా తేగలంటే ఇష్టం ఏర్పడింది. నిజంగా ఇష్టం కాదు. మా నాన్నకు ఇష్టం కనుక నాకు ఇష్టం. పెద్దయ్యాక బాగా డబ్బులు సంపాదించి నాన్నను నా దగ్గర పెట్టుకుని రోజూ కట్టలు కట్టలు తేగలు తెచ్చి ఆయన తింటూ సంతోషపడుతూ ఉంటే చూడాలని అనుకుంటూ ఉండేవాణ్ణి. అసలు ఆయన నాతోనే ఉండాలని అనుకుంటూ ఉండేవాణ్ణి. ఆయనతోనే నేను ఉండాలని అనుకునేవాణ్ణి’...
 ‘ఏమైంది?’
 ‘లేడే... నేను కాలేజ్‌లో ఉన్నప్పుడే దేవుడి దగ్గరకు వెళ్లిపోయాడు. మళ్లీ రాలేదు. అంత తొందరగా. ఏమీ చూళ్లేదు. అక్క పెళ్లి నా పెళ్లి చెల్లెలి పెళ్లి తమ్ముడి పెద్ద ఉద్యోగం... ఏమీ. చనిపోయినప్పుడు తెల్ల పంచె కట్టుకుని ఉన్నాడు. పొడవు చేతుల చొక్కా వేసుకొని ఉన్నాడు. బజారు నుంచి సంచి పట్టుకుని వచ్చి ఇంట్లో పడిపోతే.. అలానే పోవడం. ఆ తర్వాత ఎవరో సంచి చూసి చెప్పారు. అందులో తేగలు ఉన్నాయట’...
 వింటూ ఉన్నారు. కిచెన్‌ను వదిలిపెట్టి వచ్చి వింటూ ఉంది.
 ‘నేనంటే చాలా ఇష్టం మీ తాతకు. నన్ను నానమ్మ చిన్న దెబ్బ వేసినా ఊరుకునేవాడు కాదు. నేనంటేనే అంత ఇష్టమైతే నాకు పుట్టిన మీరంటే ఎంత ఇష్టంగా ఉండేవాడు? బతికి ఉంటే నా దగ్గర ఉండి ఉంటే మిమ్మల్ని స్కూలు బస్సు ఎక్కిస్తూ స్కూల్ నుంచి వస్తే తీసుకొస్తూ సాయంత్రం మీతో ఆడుకుంటూ... మీరు అల్లరి చేస్తారు కదా... ఆ అల్లరికి కోపం వచ్చి నేను నాలుగు దెబ్బలు కొట్టడానికి వస్తాను కదా... అప్పుడు అడ్డం వచ్చి... నేను ఎవరి మాట వింటాను చెప్పండి... ఎవరికీ భయపడను కదా... కాని ఆయన మాట వింటాను.. ఆయనకు భయపడతాను... ఏరా పిల్లల్ని కొడతావట్రా వెధవా... అని ఆయన పెద్దగా అరిస్తే అంతే... లోపలికి మీ అమ్మ కొంగు వెనుక దాక్కునేందుకు పరుగో పరుగో. అలా అని అనుకున్నాను. అలా చాలా అను
 కున్నాను’....
 ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత మాట్లాడటానికి రాలేదు.
 గమనించి అంది.
 ‘ఊ..ఊ.. ఇంక చాలు కబుర్లు.
 అన్నాలకు లేవండి’...
 పిల్లలు తినేసి ఇంకాసేపు టీవీ చూసి పడుకున్నారు.
 ‘నువ్వు తినవా?’
 ‘తింటాన్లే... నెమ్మదిగా’
 అంటే ఎప్పుడైనా కావచ్చు. పిల్లలతో ఉదయాన్నే లేవాలంటే ముందే పడుకోవాలి. వెళ్లి పడుకోబోయే ముందు
 అడిగింది-
 ‘అర్థమైందిలే. నువ్వు రావు బర్త్‌డేకి. ఆ పెద్దాయన్ని చూస్తే నీకు మీ నాన్న గుర్తొస్తాడు. అంతేగా’
 ‘ఊ’
 వెళ్లిపోయింది.
 పదై ఉంటుంది. ఆ టైములో ఒక
 ప్రశాంతమైన గాలికి వీలు లేనట్టుగా బాల్కనీ స్తబ్దంగా ఉంది.
 
 నిలబడి చూశాడు.
 దూరంగా రోడ్డు.
 అంత రాత్రి వేళ కూడా వాహనం వెనుక వాహనం... బండి వెనుక బండి... బైక్ వెనుక బైక్... ఈ టైమ్‌లో రోడ్డు మీద ఉన్నవాళ్లు ఎప్పటికి ఇళ్లు చేరతారో. ఉదయం మళ్లీ
 ఆఫీసుకు ఈ ఈదులాటలోనే దిగాలి కదా అని గుర్తుకు వచ్చింది.
 నగరం.
 
 మెట్రో.
 ఇంత పెద్ద సిటీలో నిభాయించుకుని రావడానికి ఎవరికి ఏ అల్పమైన విషయం, ఏ స్వల్పమైన జ్ఞాపకం ఊతం ఇస్తున్నదో
 తెలియదు. ఏ గతం ఎవరికి ప్రాణవాయువు పోస్తున్నదో తెలియదు.
 డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లాడు.తెచ్చుకుని బాల్కనీలో కూలబడ్డాడు.
 చేతుల్లో చందమామ. మరికొన్నాళ్లకు సరిపడా వెన్నెల.                    

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement