డబ్బు పట్టుకునే అధికారం పోలీసులకు లేనేలేదు | no right to polices to search and seize money | Sakshi
Sakshi News home page

డబ్బు పట్టుకునే అధికారం పోలీసులకు లేనేలేదు

Published Tue, Nov 29 2016 8:00 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM

డబ్బు పట్టుకునే అధికారం పోలీసులకు లేనేలేదు - Sakshi

డబ్బు పట్టుకునే అధికారం పోలీసులకు లేనేలేదు

న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పోలీసులు పెద్ద మొత్తాల్లో వాహనాల్లో తరలిస్తున్న పాత నోట్లను లేదా కొత్త నోట్లను పట్టుకున్నారని, నిందితులను నిర్బంధంలోకి తీసుకొన్నారంటూ రోజూ వార్తలు వస్తున్నాయి. వాహనాలను తనిఖీ చేసే అధికారం కానీ, వాటిలో బయటపడిన నిషేధించిన పెద్ద నోట్లు లేదా కొత్త నోట్లను స్వాధీనం చేసుకోవడం, బాధ్యులను అరెస్ట్‌ చేయడం లాంటి అధికారం పోలీసులకు అసలు లేనే లేవు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్‌ 8వ తేదీ నాడు ఆ నాటి నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లవని, ఇక అవి చిత్తు కాగితాలతో సమానమని పేర్కొన్నారు.

మరి చిత్తు కాగితాలను తీసుకెళుతున్న వారిని పోలీసులు ఎందుకు తనిఖీ చేస్తున్నారు? ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు? డిసెంబర్‌ 31వ తేదీ వరకు పాత నోట్లను ఎంత మొత్తమైనా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకునేందుకు కేంద్రమే అవకాశం ఇచ్చినప్పుడు మధ్యలో పోలీసులు ఎలా పట్టుకుంటారు? రెండున్నర లక్షల రూపాయలకు మించి ఓ వ్యక్తి బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసినట్లయితే వారిపై ఆదాయం పన్ను శాఖ నిఘా ఉంటుందని ప్రభుత్వమే చెప్పింది. అప్పుడు ఆదాయం పన్ను శాఖ, ఖాతాదారులే ఆ వ్యవహారం చేసుకుంటారు. అలాంటప్పుడు పోలీసుల ఓవర్ యాక్షన్‌ ఎందుకు?

1978 నాటి చట్టం ఇప్పుడు లేదు
ఇంత మొత్తానికి మించి పాత నోట్లను లేదా కొత్త నోట్లను కలిగి ఉండరాదంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తే వాటిని కలిగి ఉండడం నేరం అవుతుంది. 1978లో వెయ్యి, ఐదువేలు, పదివేల రూపాయల నోట్లను అప్పటి మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం రద్దు  చేసినప్పుడు ఆ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి రద్దయిన నోట్లను ఇచ్చి పుచ్చుకోవడం, బదిలీ చేయడం నేరమంటూ ‘హై డినామినేషన్‌ బ్యాంక్‌ నోట్స్‌ (డీమానిటైజేషన్‌) యాక్ట్‌’ను ప్రత్యేకంగా తీసుకొచ్చింది.

ఇప్పుడు మోదీ ప్రభుత్వం అలాంటి చట్టాన్ని ఏమీ తీసుకరాలేదు. డబ్బును ఓ చోటు నుంచి మరో చోటుకు తరలించడం ‘కాగ్నిజబుల్‌ (శిక్షార్హమైన)’ నేరం కాదని చట్టమే చెబుతోంది. పైగా దోపిడీ దొంగతనాల లాంటి కేసుల్లో మాత్రమే డబ్బు కోసం వాహనాలను తనిఖీ చేసే అధికారం, నిందితులను అదుపులోకి తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. నల్లడబ్బుకు సంబంధించి వాహనాలను గానీ, ఇళ్లను గానీ, ఆఫీసులను గానీ తనిఖీ చేసే అధికారం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు ఉండదు.

ఎవరి అధికార పరిధి వారిదే...

దేశంలోని వివిధ చట్టాల అమలును, ఉల్లంఘనలు పర్యవేక్షించే బాధ్యత వివిధ విభాగాలకు భారత రాజ్యాంగం అప్పగించింది. ఒకే విభాగం చేతిలో సుప్రీం అధికారాలుంటే అది అధికార దుర్వినియోగానికి దారితీస్తుందని, పౌర స్వేచ్ఛా హక్కులకు భంగం కలిగిస్తుందన్న ఉద్దేశంతో  రాజ్యాంగంలో ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి. 1860 భారతీయ శిక్షాస్మృతి రాష్ట్ర పోలీసుల అధికారాల పరిధిలోకి వస్తోంది. దీనికిందకు వచ్చే నేరాలను 1973 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ కింద పోలీసులు విచారించాల్సి ఉంటుంది. అలాగే 1961, ఆదాయం పన్ను చట్టం ప్రకారం ఆ విభాగం అధికారాలు పూర్తిగా వేరు. వారి విధుల్లో జోక్యం చేసుకునే అధికారాలు పోలీసులకు లేదు. ఎవరి ఇంటినైనా, ఆఫీసునైనా తనిఖీ చేయాలంటే పోలీసులు తప్పనిసరి వారెంటు తీసుకొని వెళ్లాలి. అదే ఆదాయం పన్ను శాఖ అధికారులు మాత్రం వారెంట్లు లేకుండానే దాడులు చేయవచ్చు. టెర్రరిజం నిరోధక చట్టాలు, ప్రత్యేక సాయుధ దళాల చట్టాల ప్రకారం మాత్రమే వారెంట్లు లేకుండా పోలీసులు తనిఖీ చేయవచ్చు. అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఆదాయం పన్ను చట్టంలో కూడా ఇలా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆదాయం పన్ను చట్టంలోని 132 సెక్షన్‌ కింద కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు పరిధిలో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసుకు చెందిన ఓ స్థాయి ర్యాంకు అధికారులకు పన్ను ఎగవేత కేసులను విచారించే అధికారమూ, తనిఖీలు నిర్వహించే అధికారమూ ఉంది.

ఈ తరహా తనిఖీలు ఎన్నికల సమయాల్లోనూ....
ఎన్నికల సందర్భంగా కూడా పోలీసులు భారీ ఎత్తున డబ్బును పట్టుకున్నారన్న వార్తలను మనం తరచుగా వింటుంటాం. ఈ విషయంలో పోలీసులను ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నామని పోలీసులు, స్వేచ్ఛగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత తమది కావడమే కాకుండా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు జిల్లా యంత్రాంగం అంతా తమ పరిధిలో ఉంటుంది కనుక ఇలాంటి ఆదేశాలను పోలీసులకు జారీ చేయడం సబబేనని ఎన్నికల కమిషన్‌ వాదిస్తూ వచ్చింది. అయినా ఇలాంటి తనిఖీలు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించే అధికారం ఎన్నికల కమిషన్‌కుగానీ, తనిఖీచేసే అధికారం పోలీసులకుగానీ లేదని దేశంలోని పలు కోర్టులు పలుసార్లు మందలించినప్పటికీ ఇలాంటి తనిఖీలు ఆగడం లేదు.

కోర్టుకెక్కిన వ్యాపారల సంఘం...
నగదు మార్పిడి ద్వారా లావాదేవీలు నిర్వహించే వ్యాపారవేత్తలు ఎన్నికల సందర్భంగా పోలీసులకు డబ్బుతో పట్టుబడడం, ఆ తర్వాత వారు కోర్టు నుంచి నిర్దోషులుగా విడుదలవడం తరచు జరగుతూ వచ్చింది. పోలీసులు, ఎన్నికల కమిషన్‌ అధికారుల బెడద పడలేక ‘భాగ్యోదయ్‌ జన్‌పరిషద్‌’ సంస్థ గుజరాత్‌ హైకోర్టులో సవాల్‌ చేయగా 2012లో కీలకమైన తీర్పును వెలువరించింది.

అన్ని ప్రాంతాలకు తిరిగే హక్కు ఉంది...
‘భారీ ఎత్తున నగదు, విలువైన వస్తువులను తీసుకెళుతున్నారన్న అనుమానంపై అహేతుకంగా ప్రజల వాహనాలను ఆపరాదు, తనిఖీ చేయరాదు. రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద ఓ సామాన్యుడికి సైతం దేశంలోని అన్ని ప్రాంతాలకు తిరిగే హక్కు, స్వేచ్ఛ ఉంది. సామాన్యుల  ప్రయాణాన్ని నియంత్రిడం లేదా ఆంక్షలు విధించడం చేయరాదు. ఎన్నికలను స్వేచ్ఛగా, సముచితంగా నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్‌దన్న విషయాన్ని మేము అర్థం చేసుకుంటాం. అయినప్పటికీ ఇక్కడ పౌరుల స్వేచ్ఛ ముఖ్యం, కమిషన్‌ ఆదేశించినప్పటికీ ఏ రాజకీయ పార్టీతోగానీ, ఎన్నికలతోగానీ సంబంధం లేని వ్యక్తుల వాహనాలను తనిఖీ చేయరాదు. ఏ పౌరుడికి ప్రాథమిక హక్కులు అప్రతిహతం కాదని మేము విశ్వసిస్తున్నప్పటికీ ఓ పౌరుడిపై ఎలాంటి ఆంక్షలు విధించాలనుకున్నా అవి చట్టం పరిధికే లోబడి ఉండాలి’ అని హైకోర్టు బెంచీ తీర్పు చెప్పింది. ఈ తీర్పు సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేయగా గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉంది.

ఓట్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు పంచుతున్నారని తెలిస్తే భారతీయ శిక్షాస్మతిలోని 171 బీ కింద వాహనాలను తనిఖీ చేసే అధికారం పోలీసులకు ఉంది. అయితే ఇది ‘కాగ్నిజబుల్‌’ నేరం కాదు కనుక కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. దీన్ని ‘కాగ్నిజబుల్‌’ నేరంగా చట్టాన్ని సవరించాలంటూ ఎన్నికల కమిషన్‌ చేసిన సిఫార్స్‌ కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంగా చట్టానికి విరుద్ధంగా చర్యలు తీసుకునే అధికారం పోలీసులకే కాదు, ఏ అధికారికి లేదు.
(వివిధ సందర్భాల్లో న్యాయనిపుణులు, కోర్టులు వ్యక్తం చేసిన అభిప్రాయాల సమాహారమే ఈ వార్తాకథనం)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement