మందుల పెట్టెల మాటున..
చత్తీస్గఢ్: పాతనోట్ల కట్టల పాములు ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాయి. చత్తీస్గడ్ లో ఒక మెడికల్ షాపులో భారీ ఎత్తున పాత నోట్లను, బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెమెతారలోని శ్రీరామ మెడికల్ స్టోర్ పై బుధవారం ఆదాయ పన్ను అధికారులు దాడిచేశారు. మందుల పెట్టెల్లో దాచిన రూ.70 లక్షలకుపైగా విలువైన పాతనోట్లను, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.. తాజా సమాచారం ప్రకారం అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
కాగా నవంబర్ 8న రద్దు చేసిన రూ.500, 1000 నోటలకు డిపాజిట్లకు గడువు దగ్గరపడుతోంది. మరోవైపు నల్లధనానికి చెక్ పెట్టే క్రమంలో కేంద్ర బుధవారం కొత్త ఆర్డినెన్స్ ను జారీ చేసింది. దీని ప్రకారం 2017 మార్చి 31 తర్వాత 10 కంటే ఎక్కువ పాతనోట్లు కలిగి ఉంటే నేరం. ఇలాంటి వారికి 4 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు. అలాగే మార్చి 31 తరువాత పాత నోట్లను మార్చుకునే వారికి, పాతనోట్ల లావాదేవీలలో పాలుపంచుకున్న వారికి రూ.5 వేలు జరిమానా విధించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రద్దయిన నోట్ల డిపాజిట్లకు గడువు డిసెంబర్ 30 మాత్రమే. ఈ గడువు తర్వాత మార్చి 31 వరకు కేవలం రిజర్వు బ్యాంకు వద్ద మాత్రమే పాతనోట్ల మార్పిడి చేసుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.