బ్యాంక్‌ డిపాజిట్లపై ఐటీ | IT Inquires on Bank deposits | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ డిపాజిట్లపై ఐటీ

Published Wed, Jan 11 2017 3:28 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM

బ్యాంక్‌ డిపాజిట్లపై ఐటీ - Sakshi

బ్యాంక్‌ డిపాజిట్లపై ఐటీ

నోట్ల రద్దు తర్వాత ఖాతాల్లో చేరిన నగదుపై ఆరా
పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన ఆదాయ పన్ను శాఖ
తొలి దశలో పెట్రోల్‌ బంక్‌ల యజమానులకు నోటీసుల జారీ
రెండో విడతలో ఆస్పత్రులు, నగల దుకాణదారులకు..
ఐటీ చట్టం 133 (6) 1961 ప్రకారం నోటీసులు
గడువులోగా ఆధారాలు చూపాలని ఆదేశాలు
బెంబేలెత్తుతున్న బడా వ్యాపారులు


మొదటి విడతలో పెట్రోల్‌ బంక్‌ల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్న ఐటీ శాఖ.. ఆ తర్వాత  ఆస్పత్రులు, నగల దుకాణాల వ్యాపారులపై కొరడా ఝుళిపించనున్నట్లు తెలుస్తోంది.  ఆస్పత్రుల్లో పాత నోట్లకు అనుమతించడంతో వాటిల్లో బోగస్‌ బాధితులను సృష్టించి నకిలీ బిల్లులతో భారీ మొత్తంలో నగదు మార్పిడికి పాల్పడినట్లు ఆ శాఖ పరిశీలనలో తేలింది. 50 రోజుల వ్యవధిలో నగల దుకాణాల్లో భారీగా  అవకతవకలు జరిగినట్లు  అధికారులు గుర్తించారు.

నల్లగొండ : బ్యాంక్‌ ఖాతాల్లో దాగి ఉన్న భారీ నగదు నిల్వలపై ఆదాయ పన్ను శాఖ ఆరా తీస్తోంది. గత ఏడాది నవంబర్‌ 8న పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన మొత్తాలపై దృష్టి సారించిన ఐటీ శాఖ.. ఆ మేరకు ఖాతాదారుల వివరాలు సేకరించింది. నోట్ల రద్దుకు ముందు సంబంధిత వ్యక్తులు, వ్యాపా ర సంస్థలు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలు.. వాటికి సంబంధించి బ్యాంక్‌ డిపాజిట్లపై కూపీ లాగింది. నోట్ల రద్దు తర్వాత జన్‌ధన్‌ ఖాతాలు, దిక్కుమొక్కులేని (డార్మెంట్‌ స్టేటస్‌), జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు (నో ఫ్రిల్స్‌ అకౌం ట్స్‌) అన్నింట్లోకి భారీగా నగదు వచ్చి చేరినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు , కేవైసీ ఆధారంగా బ్యాంక్‌ అధికారులు భారీ మొత్తంలో డిపాజిట్లు స్వీకరించారు. పాత నోట్లనే బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారా.. కొత్త నోట్లు జమ చేశారా.. అనేదానిపైనా ఆదాయ పన్ను శాఖ స్క్రూటినీ చేసింది. ఈ క్రమంలో కొత్త నోట్ల డిపాజిట్ల జోలికి వెళ్లకుండా ఎక్కువ మొత్తంలో డిపాజిట్‌ చేసిన పాత నోట్లపైనే ఆదాయ పన్ను శాఖ, ఇంటెలిజెన్స్, క్రిమినల్‌ ఇంటెలిజిన్స్‌ అధికారులు దృష్టి సారించారు. నోట్లు రద్దు అయిన మరుసటి రోజు నుంచి డిసెంబర్‌ 30 వరకు వివిధ బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్‌ చేసినట్లు గుర్తించిన ఖాతాదారులకు ప్రస్తుతం ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తోంది.

పాత నోట్ల డిపాజిట్లపైనే..
రద్దు చేసిన రూ.500, రూ.1,000  నోట్లను పెట్రోల్‌ బంక్‌లు, ఆస్పత్రులు, నగల దుకాణాల్లో చెల్లుబాటవుతాయని కేంద్రం ప్రకటించింది. దీంతో అవసరం ఉన్నా.. లేకున్నా వాహనదారులు బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ పోయించుకున్నారు. చిల్లర సమస్య సాకుగా చూపి బంక్‌ నిర్వాహకులు అందిన కాడికి దోచుకున్నారు. పాత నోట్లకు కమీషన్‌ తీసుకుని మరీ పెట్రోల్‌ పోశారు. ఇదే వారి మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. పెట్రోల్‌ బంక్‌లలో పాత నోట్లకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందన్న ఉత్సాహంతో వ్యాపారులు వెనకాముం దు ఆలోచించలేదు. పాత రోజులతో పోలిస్తే బంక్‌లో ఆయిల్‌ అమ్మకాలు డబుల్, ట్రిపుల్‌ పెరిగాయి. చెలామణిలో ఉన్న పాత నోట్లలో ఎక్కువ నగదు బంకుల్లోకి చేరింది. ఈ మొత్తం నగదు నిల్వలను వ్యాపారులు తమ కరెంట్‌ ఖాతాల్లోనూ, బంకుల్లో పనిచేసే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశారు. బంగారం క్రయవిక్రయాలకు రశీదులు చూపించేందుకు వీలున్నా.. పెట్రోల్‌ బంక్‌లో ఆ అవకాశం లేకుండా పోయింది.

ఆయిల్‌ పోయించుకున్న వాహనదారులకు బంక్‌ యజమానులు ఎలాంటి రశీదు ఇవ్వకపోవడంతో వ్యాపారులకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. కరెంట్‌ ఖాతాల్లో జమ చేసిన నగదు నిల్వల వివరాలు, పెట్రోల్, డీజిల్‌ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసినట్లయితే.. దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని వ్యాపారులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. నోట్ల రద్దుకు ముందు జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆ తర్వాత ఖాతాదారుల ఖాతాల్లో చేరిన నగదు నిల్వల లెక్కలు సమర్పించాలని నోటీస్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. ఐటీ చట్టం 133 (6) 1961 ప్రకారం జారీ చేసిన  నోటీసులకు వారం రోజుల్లోగా ఆధారాలు సమర్పించాలని.. ఖాతాలకు సంబంధించిన క్యాష్‌ పుస్తకాలు, బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్లతో తమ ఎదుట హాజరుకావాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది.

విడతల వారీగా నోటీసులు..
మొదటి విడతలో పెట్రోల్‌ బంక్‌ల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్న ఐటీ శాఖ.. ఆ తర్వాత  ఆస్పత్రులు, నగల దుకాణాల వ్యాపారులపై కొరడా ఝుళిపిం చనున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల్లో కూడా పాత నోట్లకు అనుమతించడంతో వాటిల్లో బోగస్‌ బాధితులను సృష్టించి నకిలీ బిల్లులతో భారీ మొత్తంలో నగదు మార్పిడికి పాల్పడినట్లు ఐటీ శాఖ పరిశీలనలో తేలింది.  నగల దుకాణాల్లో జరిగిన క్రయవిక్రయాలపైనా నిఘా పెట్టింది. 50 రోజుల వ్యవధిలో నగల దుకాణాల్లో జరిగిన బంగారం అమ్మకాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను బ్యాంకుల ద్వారా ఐటీ అధికారులు సేకరించారు. ఇందులో  అక్రమంగా జరిగిన విక్రయాలు ఏమైనా ఉన్నాయా.. అని నిగ్గుతేల్చేందుకు ఐటీ శాఖ నుంచి త్వరలో నోటీసులు జారీ కానున్నట్లు తెలిసింది.  ఈక్రమంలో పెట్రోల్‌ బంక్‌ యజమా నులు, నగల దుకాణాల వ్యాపారులు, ఆస్పత్రుల నిర్వాహకులు హడలెత్తిపోతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement