నోట్లు.. పాట్లు!
నోట్లు.. పాట్లు!
Published Mon, Mar 27 2017 11:42 PM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM
టీడీపీ ఎమ్మెల్యేపై ఐటీ కన్ను!
– భారీగా పాత నోట్ల డిపాజిట్లపై ఆరా
– ఇప్పటికే పిలిపించి విచారించిన ఐటీ శాఖ అధికారులు?
– లెక్కలు చెప్పేందుకు ఇబ్బందిపడ్డ వైనం
– పార్టీ మారిన సొమ్మేనని ప్రచారం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ కన్ను పడింది. పాత నోట్ల రద్దు నేపథ్యంలో భారీగా సదరు ఎమ్మెల్యే బ్యాంకులో డిపాజిట్ చేయడంపై ఐటీ శాఖ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఇంత భారీ మొత్తంలో పాత నోట్లు డిపాజిట్ కావడంతో మొత్తం ఆధారాలు సమర్పించాలని సదరు ఎమ్మెల్యేను ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు దఫాలుగా సదరు ఎమ్మెల్యేను ఐటీ శాఖ అధికారులు విచారించినట్టు సమాచారం. అయితే, భారీగా పాత నోట్ల డిపాజిట్లపై పూర్తిస్థాయిలో సరైన సమాచారం ఇవ్వడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని విశ్వసనీయంగా తెలిసింది. ఇదంతా పార్టీ మారిన సమయంలో అందిన మొత్తమనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు నోట్లకు లెక్కలు అంతుచిక్కక పోవడంతో కోటి రూపాయల మేరకు ఐటీ శాఖ అపరాధ రుసుం చెల్లించాలని పేర్కొన్నట్టు సమాచారం. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించేందుకు ఐటీ శాఖ అధికారులు ఇష్టపడటం లేదు. ఏదేమైనా అధికార పార్టీ ఎమ్మెల్యే ఐటీ శాఖ వలలో ఇరుక్కోవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అంతుచిక్కని లెక్కలు
పాత నోట్లు రూ.500, రూ.1000లను రద్దు చేస్తున్నట్టు గత నవంబర్ 8వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎవరైనా సరే పాత నోట్లను బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసుకుని మార్చుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రైవేటు బ్యాంకులో భారీగా నగదు డిపాజిట్ చేసినట్టు సమాచారం. దీంతో అన్ని లావాదేవీలను పరిశీలించిన ఆదాయపు పన్నుశాఖ అధికారుల కన్ను ఈ ఎమ్మెల్యేపై పడింది. తీరా ఈ భారీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలపాలంటూ నోటీసు పంపినట్టు సమాచారం. ఇందుకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చినప్పటికీ లెక్కలు తేలకపోవడంతో నేరుగా కలవాలని ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండుసార్లు సదరు ఎమ్మెల్యేను ఐటీ శాఖ అధికారులు పిలిపించి విచారించినట్టు సమాచారం. అయితే, ఎక్కడ కూడా లెక్కలు సరిపోలేదని విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాకుండా ఈ మొత్తానికి లెక్కలు చెప్పేందుకు ఆ ఎమ్మెల్యే ఇబ్బంది పడినట్టు సమాచారం. ఏకంగా కోటి రూపాయల మేరకు సదరు ఎమ్మెల్యేకు ఐటీ శాఖ అపరాధ రుసుం చెల్లించాలని ఆదేశించినట్టు తెలిసింది.
అది పార్టీ మారిన సొమ్మేనా?
అధికార పార్టీలో చేరిన సదరు ఎమ్మెల్యే ఖాతాలో భారీగా నగదు డిపాజిట్ కావడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ మొత్తం అంతా పార్టీ మారిన సందర్భంగా అధికార పార్టీ నుంచి ముట్టిన సొమ్మేననే చర్చ జరుగుతోంది. పార్టీ మారిన సందర్భంలో అందుకున్న రూ.10కోట్ల నుంచి రూ.15 కోట్లలో కొంత మొత్తం అప్పులు చెల్లించగా మిగిలినదంతా.. ఈ విధంగా ఒకేసారి బ్యాంకులో డిపాజిట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తానికి లెక్కలు చూపేందుకు నానా తిప్పలు పడినప్పటికీ ఎక్కడా సరిపోలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఏకంగా కోటి రూపాయల మేరకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై మాట్లాడేందుకు ఐటీ శాఖ అధికారులు ఇష్టపడటం లేదు. ఏదేమైనా ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Advertisement