రోబో.. పోలీస్‌ రోబో | Robot .. Police Robot | Sakshi
Sakshi News home page

రోబో.. పోలీస్‌ రోబో

Published Thu, Jul 6 2017 3:30 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM

రోబో.. పోలీస్‌ రోబో - Sakshi

రోబో.. పోలీస్‌ రోబో

దేశంలోనే తొలిసారిగా..
ప్లేస్‌.. జూబ్లీ చెక్‌పోస్ట్‌..
జాయినింగ్‌ డేట్‌.. 31 డిసెంబర్‌
 
హైదరాబాద్‌ : ప్రపంచంలోనే అరుదైన పోలీస్‌ రోబో డిజైన్‌ను బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌ ఆవిష్కరించారు. రోబోల తయారీలో నూతన ఒరవడి సృష్టిస్తున్న ‘హెచ్‌బోట్స్‌ రోబోటిక్స్‌’వ్యవస్థాపకులు 2నెలలు శ్రమించి పోలీస్‌ రోబో డిజైన్‌కు తుది రూపమిచ్చారు. డిసెం బర్‌ 31న జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ జంక్షన్‌లో పోలీస్‌ రోబోను ఏర్పాటు చేస్తామని హెచ్‌బోట్స్‌ రోబోటిక్స్‌ సీఈవో కిషన్‌ వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో మాత్రమే పోలీస్‌ రోబో ఉందని, ప్రపంచంలోనే రెండో పోలీస్‌ రోబోను హైదరాబాద్‌లో తామే అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.
 
మూడు నెలల్లో టీ–వర్క్స్‌
టీ–హబ్‌ తరహాలోనే హార్డ్‌వేర్‌ స్టార్టప్‌ల ప్రోత్సాహం కోసం రూ.50 కోట్ల వ్యయంతో టీ–వర్క్స్‌ను మూడు నెలల్లో ఏర్పాటు చేస్తామని జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు. బుధవారం గచ్చిబౌలిలో ‘మేకర్స్‌ లీవే’హై ఎండ్‌ రోబోటిక్‌ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీ–వర్క్స్‌లో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, చిప్స్‌ను తయారు చేస్తారని, టీ–వర్క్స్‌కు సహకారం అందించేందుకు జీఈ, కాల్‌కమ్‌ సంస్థలు ముందుకొచ్చాయని చెప్పారు. ఐటీ పాలసీకి అనుబంధంగా మరో 10 పాలసీలు రానున్నాయని చెప్పారు. ఐఓటీ పాలసీని త్వరలోనే తీసుకొస్తామని, ఇందులోనే రోబోటిక్‌ ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అవసరాలకు ఉపయోగపడే రోబోటిక్‌ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేవారికి అద్దె, విద్యుత్, ఇంటర్నెట్‌ బిల్లులో రాయితీలు ఇస్తామని చెప్పారు.

సామాజిక అవసరాలకు రోబోలను తయారు చేయడం అభినందనీయమన్నారు. హెచ్‌బోట్స్‌ రోబోటిక్‌ సీఈవో కిషన్‌ పీఎస్‌వీ మాట్లాడుతూ మేకర్స్‌ స్పేస్‌లో ఏకకాలంలో 50 మందికి రోబోల తయారీలో శిక్షణ ఇస్తామని, మరో రెండు కేంద్రాల్లో మరో 100 మందికి శిక్షణ ఇచ్చే వీలుందని అన్నారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 40 మేకర్స్‌ స్పేస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సామాజిక సమస్యల పరిష్కారం కోసం రోబోలు తయారు చేస్తామన్నారు. అంతకు ముందు మేకర్స్‌ స్పేస్‌ మెంబర్‌షిప్‌ కార్డు బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
 
‘పోలీస్‌ రోబో’ ఏం చేస్తుందంటే..
జూబ్లీ చెక్‌పోస్ట్‌ పరిసరాల ఫొటోలు, వీడియోలు, మెస్సేజ్‌లను పోలీస్‌ రోబో మెయిన్‌ సర్వర్‌కు పంపిస్తుంది. ఎవరైనా ఫిర్యాదులిచ్చినా స్వీకరిస్తుంది. అంతేకాదు పరిసరాల్లో బాంబులు, అనుమానాస్పద వస్తువులు ఉంటే గుర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల అనుమతితో పోలీస్‌ రోబోకు యూనిఫాం వేస్తారు. ఒకే చోట ఉంచేందుకు, అటు ఇటు కదిలేందుకు ఈ రోబోకు అవకాశం ఉంటుంది.
 
నలుగురు ఇంజనీర్ల కృషి ఫలితం..
మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన కిషన్, సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన హర్ష, అభిషేక్, ఐటీ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అన్వేష్‌ రెండేళ్ల క్రితం గచ్చిబౌలి టీ–హబ్‌లో హెచ్‌బోట్స్‌ రోబోటిక్స్‌ స్టార్టప్‌ను స్థాపించారు. రోబోటిక్స్‌పై ఆసక్తి ఉన్న కిషన్‌ వెలూరులోని వీఐటీలో రెండేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. కాలిఫోర్నియా వర్సిటీలో రోబోటిక్స్‌ తయారీపై నాలుగు నెలల శిక్షణ పొందారు. రెండు నెలలుగా వీరు పోలీస్‌ రోబో తయారీపై పరిశోధన చేస్తున్నారు. పోలీస్‌ రోబో తయారీకి సుమారు ఎనిమిది నెలలు పడుతుంది. ప్రస్తుతం ‘మేకర్స్‌ లీవే’హై ఎండ్‌ రోబోటిక్‌ ల్యాబ్‌లో పోలీస్‌ రోబో తయారీ పూర్తి కానుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement