48 గంటల్లో 4 టన్నుల బంగారం అమ్మారు!
48 గంటల్లో 4 టన్నుల బంగారం అమ్మారు!
Published Mon, Jan 2 2017 3:17 PM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM
న్యూఢిల్లీ : నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ నిర్ణయం ప్రకటించిన అనంతరం భారీగా బంగారం అమ్మకాలు జరిగినట్టు తెలిసింది. అయితే ఎంత బంగారం విక్రయించుంటారనే దానిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ ఇంటిలిజెన్స్ జరిపిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 48 గంటల్లో జువెల్లర్ వర్తకులు 4 టన్నులకు పైగా బంగారాన్ని విక్రయించారని తేలింది. వాటి విలువ రూ.1,250 కోట్లకు పైగా ఉంటుందని తెలిసింది. పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు రాత్రి ఎనిమిది ప్రకటించిన రోజునే దాదాపు రెండు టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయట. రద్దయిన నోట్లను బంగారంలోకి మార్చుకోవడానికి పెద్ద ఎత్తున్న అనుమానిత మనీ లాండరింగ్ కార్యకలాపాలు జరిగాయని ఈ సర్వేలో వెల్లడైంది.
ఢిల్లీకి చెందిన ఓ దిగ్గజ జ్యువెల్లర్ ఎక్కువగా 45 కేజీల బంగారాన్ని 700 మందికి అమ్మినట్టు అధికారులు చెప్పారు. అంతకముందు ఆయన కేవలం 820 గ్రాములే విక్రయించినట్టు తెలిసింది. చెన్నైలోని లలితా జువెల్లర్స్ 200 కేజీల గోల్డ్ను విక్రయించిందని, జైపూర్ లావత్ జువెల్లర్స్ 30 కేజీలు అమ్మినట్టు సెంట్రల్ ఎక్స్చేంజ్ అధికారులు పేర్కొన్నారు. ఆ జువెల్లర్స్ ముందు రోజు వరకు కేవలం గ్రాములోనే బంగారాన్ని విక్రయించినట్టు తెలిపారు. పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దు అనంతరం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మనీ లాండరింగ్ కార్యకలాపాలు విపరీతంగా జరుగుతున్నాయని గుర్తించిన డీజీసీఈఐ ఈ సర్వే నిర్వహించింది. పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడిన జువెల్లర్స్కు 300 పన్ను నోటీసులను ఈ ఏజెన్సీ జారీచేసింది.
Advertisement