వివరం: కల్పవృక్షం భూమ్మీద పుడితే...
వృద్ధాప్యం ఎరుగని కాయ ఏదైనా ఉందీ అంటే, అది కొబ్బరికాయే! పండుగా రూపాంతరం చెందకుండానే జీవితసారంతో పండిపోయే కాయ కూడా అదే! ఏ కాయకూ లేనన్ని అన్వయాలు! ఏ కాయా చెప్పలేనన్ని తత్వాలు! చిన్నప్పుడు బోండాంగాడిగా తీసి పారేయగలిగే వెసులుబాటు ఇస్తూనే, పెద్దవుతూనే పరమ పవిత్రతను ఆపాదించుకుంటుంది నారీకేళ ఫలం. అదికదా అసలైన పరిణామం.
అది కదా మనిషి అందుకోగలిగే సందేశం. పూజల్లో, భోజనంలో, వివాహంలో, బతుకుదెరువులో భాగమైన ఈ చెట్టంత ప్రాధాన్యత భూమ్మీద మరిదేనికీ లేదేమో! సర్వకాల సర్వావస్థల్లోనూ అది ఉపయోగపడినట్టే, కొబ్బరిచెట్టులోని సర్వాంగాలూ మనకు పనికొస్తాయి. బహుశా పురాణాల్లో వినిపించే కల్పవృక్షం ఇదేనేమో! సాధారణంగా వేసవి రాగానే తలుచుకునే కొబ్బరిని ఇప్పుడు గుర్తుచేసుకోవడానికి కారణం ఇది మాత్రమే కాదు; సెప్టెంబర్ 2న ‘వరల్డ్ కొకొనట్ డే’ కావడం మూలాన కూడా!
ఏ పనిచేసినా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం మన సంప్రదాయం. ఏ మొదటి పూజైనా గణేశుడికి చేయడం అంతకన్నా ప్రధానం. అందుకే ఈ కథనాన్ని ‘గణేశుడు - కొబ్బరికాయ’తో మొదలుపెడదాం. బొజ్జ గణపయ్య బుజ్జి గణపయ్యగా ఉన్నప్పటి సంగతిది. ఆటలాడుకునే పసితనం కదా! ఒకరోజు శివుడి మూడోకన్నును చూసి ముచ్చటపడి, దాంతో ఆడుకుంటానని మారాంచేశాడట విఘ్నేశుడు. అది తెరవడం ప్రళయసంకేతం కాబట్టి, కొడుకును బుజ్జగించి, దీనికి బదులుగా నీకో ప్రత్యేక బంతి ఇస్తాను, అన్నాడట పరమేశ్వరుడు. అలా కొబ్బరి పుట్టిందట. అందుకే కొబ్బరికాయకు శంకరుడిలా మూడు కళ్లుంటాయని ఒక భౌతిక రుజువు. పీచు తీసిన కొబ్బరి మనిషి తలను తలపిస్తుంది కాబట్టి, ఇది నిజమేనేమో అనిపించేంత పకడ్బందీగా అల్లిన పూర్వగాథ. వాస్తవం ఏమైనా, నమ్మడానికి బాగుండే కథ. మతాలు, విశ్వాసాల కన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది బతుకుదెరువుతో కొబ్బరి ముడిపడివున్నదన్నది మాత్రం కాదనలేని నిజం.
చిట్లించిన ముఖం!
ప్రపంచం నుంచి మనం ఎన్నిరకాల కూరగాయల్ని, పళ్లను దిగుమతిచేసుకున్నామో! కానీ కొబ్బరికాయను మాత్రం పాక్షికంగానైనా మనదేనని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే, మూడున్నర నుంచి ఐదున్నర కోట్ల సంవత్సరాల క్రితమే భూమ్మీద కొబ్బరిచెట్టు ఉనికి ఉందని నిర్ధారించే శిలాజాలను భారత్, ఆస్ట్రేలియాల్లో శాస్త్రవేత్తలు కనుక్కున్నారు మరి! మనదేశం నుంచే యూరప్ యాత్రికులు తమ దేశాలకు ఈ కాయను పరిచయం చేశారు. అందుకే దీన్ని ‘ఇండియన్ నట్’గానే వాళ్లు భావించారు. పోర్చుగీసు నావికుడు వాస్కో డి గామా బూరు తీసిన కొబ్బరికాయను తొలుత చూసి, చిట్లించిన ముఖంలాగా దాని ఆకృతి ఉందనుకుని, తన భాషలో ఆ అర్థాన్నిచ్చే పదం ‘కొకొ’ అని దీనికి నామకరణం చేశాడట. ఇంగ్లీషువాళ్లు దానికి ‘నట్’ చేర్చి, ‘కొకొనట్’ అన్నారట.
నాగరిక చెట్టు!
కొబ్బరి మహాసముద్రంలో పుట్టింది. భూమధ్యరేఖకు ఇరువైపులా ఉష్ణ, సమశీతోష్ణ ప్రాంతాల్లో ఈ చెట్లు తొలుత పెరిగాయంటారు. మలేసియా(దేశం కాదు; ఫిలిప్పీన్స్, ఇండోనేసియా లాంటి దేశాలున్న హిందూ మహాసముద్ర ప్రాంతం), మెలనేసియా (ఫిజి, గినియా లాంటి దేశాలున్న పిసిఫిక్ మహాసముద్ర ప్రాంతం)ల్లో కొబ్బరిచెట్లు ఆవిర్భవించి ఉండొచ్చు. మరింత స్పష్టంగా న్యూ గినియా ద్వీపం చుట్టుపక్కల పెరిగివుంటాయని మరో అభిప్రాయం. ఏదేమైనా సముద్రంలోని చిన్న చిన్న దీవుల్లో ఇవి పెరిగాయి. నీటిలో ఈదడానికీ, ఇతర సమూహాల సంపర్కానికీ కొబ్బరిదుంగలు పనికొచ్చాయి. అలా నాగరికతను ఒక తీరానికి చేర్చిన చెట్టు ఇది.
ప్రకృతి ఎంత గొప్పదంటే, మనిషి జీవించడానికి అది మరొక ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టి ఉంచుతుంది. కనుచూపుమేరా కనబడే తాగడానికి పనికిరాని సముద్ర నీళ్లు ఉన్నచోట కొబ్బరినీటిని సృష్టించి పెట్టింది. తల్లి భూదేవి తన పిల్లలకు బోండాం రూపంలో ప్యాక్ చేసిచ్చిన హెల్త్ డ్రింక్ అది. లైఫ్ డ్రింక్!
చిన్నకాయలో పావు లీటర్, ఎదిగినదాన్లో లీటర్ వరకూ నీళ్లుండే బోండాం కడుపారా దాహం తీర్చగలదు. ఇది పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంలాంటివే కాక, లారిక్ ఆమ్లం కలిగివుంటుంది. ఈ విషయంలో తల్లిపాలతో దాదాపు సరిసమానం అవగలదు. ఈ నీరు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గిస్తుంది. చిన్నప్రేవుల్లోని పురుగుల్ని చంపేస్తుంది. మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి కలిగివుంటుంది. మూత్రం వృద్ధి అయ్యేట్టు చేసి, శరీరాన్ని శుభ్రపరచడానికి సాయపడుతుంది. అందుకే కొబ్బరి అధికంగా పండించే ఫిలిప్పీన్స్‌లో కొత్త సామెత పుట్టింది: ఎ కొకొనట్ ఎ డే కీప్స్ ది యూరాలజిస్ట్ అవే(రోజో కొబ్బరిబోండాం తాగితే, మూత్రపిండాలకు సంబంధించిన వైద్యుడి దగ్గరకు వెళ్లే అవసరం రాదని దీని అర్థం). గ్లకోమా ఉన్నవాళ్లకు కూడా తాగితే మేలుచేస్తుంది. నీరసంగా ఉన్నవాళ్లకు కూడా కొబ్బరి ఎంత సులభంగా శరీరంలో కలిసిపోగలదంటే, దాన్ని జీర్ణం చేయడానికి ప్రత్యేకంగా పైత్యరసం ఉత్పత్తి కానవసరం లేదు. అందుకే అది నేరుగా రక్తంలో కలిసిపోయి, తక్షణం శక్తి ఇస్తుంది. అందుకే దాన్ని జీవద్రవం అంటారు.
కొబ్బరినీరు రక్తంలోని ప్లాస్మాకు ప్రత్యామ్నాయం కాగలదు. పైగా ఎర్ర రక్తకణాలకు హాని చేయదు, అలెర్జీ కలిగించదు. అందుకే యుద్ధ సమయాల్లో ఐ.వి.(ఇంట్రా వీనస్) ద్రవాలు అందుబాటులో లేని సందర్భాల్లో- ముఖ్యంగా రెండో ప్రపంచయుద్ధం, వియత్నాం యుద్ధ కాలంలో- అప్పుడే దింపిన తాజా కొబ్బరినీటిని సైనికులకు నేరుగా ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కించేవారు. బాగా పరుగెత్తడం వల్ల చెమటతో కోల్పోయే ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి భర్తీ చేయడానికి అథ్లెట్లకు కూడా ఇది మంచి రీహైడ్రేజన్ డ్రింక్!
భూమ్మీది కల్పవృక్షం!
30 మీటర్ల ఎత్తుకు పెరిగే కొబ్బరిచెట్టు దుంగను పడవగా మలుచుకోవచ్చు. వంతెనగా వాడుకోవచ్చు. కొబ్బరిమట్టల్ని తలదాచుకోవడానికి పైకప్పుగా వేసుకోవచ్చు. తడికలు, చాపలు అల్లుకోవచ్చు. బుట్టలు చేసుకోవచ్చు. పనితనం తెలిసినవాళ్లు ఆకులతో పిల్లలకు ఆటవస్తువులు చేసివ్వొచ్చు. కొబ్బరిపీచుతో తాళ్లు పేనుకోవచ్చు, మ్యాట్స్ చేసుకోవచ్చు, గిన్నెల్ని తోముకోవచ్చు, కొబ్బరి ఇటుకలు చేసుకోవచ్చు. బూరును అంటించడం ద్వారా దోమలను పారద్రోలవచ్చు.
వంటచెరుకుగా, ఫర్నిచర్‌గా, చీపురుగా ఎలా అంటే అలా రూపాంతరం చెందించవచ్చు. ఆరోగ్యంగా ఉంటే ఒక్కోచెట్టు ఏటా కనీసం 75 కాయలు ఇస్తుంది. నీళ్లనూ, పాలనూ, నూనెనూ, కొబ్బరినీ, టెంకనూ, మీది పీచును కూడా వినియోగించుకోగలిగే అద్భుత ఫలం ఇది. శాకాహారులు కూడా తినగలిగే మాంసం ఇది. తెల్లటి భాగాన్ని మాంసం అంటారు. అసలు ఇందులో వృథా అయ్యేది ఏదీ లేదు. కాయ, ఆకు, కాండం అన్నీ పనికొచ్చేవే! ఆకలి తీర్చి, దప్పిక తీర్చి, పోషకాహారాన్ని ఇచ్చి, నీరసంగా ఉంటే శక్తినిచ్చి, అందుకోవడానికి సాహసాన్నిచ్చి, దాని నీడ, జాడల అందంతో కవిత్వశక్తినిచ్చే ఇలాంటి చెట్టును కల్పవృక్షం అనికాకుండా మరేమంటారు? అందుకే ఒక్క కొబ్బరిచెట్టు మనిషి మనుగడకు అండాదండ. అందుకే కొబ్బరికి అంత ప్రాధాన్యత. కొకొనట్ డే కూడా చెప్పేది అదే!
ఎందుకు సెప్టెంబర్ 2?
ఇండోనేషియా కేంద్రంగా ఉన్న ‘ఏసియన్ అండ్ పసిఫిక్ కొకొనట్ కమ్యూనిటీ’(ఏపీసీసీ) ఈ ‘వరల్డ్ కొకొనట్ డే’ను ప్రారంభించింది. భారత్ సహా, కొబ్బరి అత్యధికంగా పండించే దేశాలన్నీ ఇందులో సభ్యత్వం కలిగివున్నాయి. సెప్టెంబర్ 2 ఏపీసీసీ వ్యవస్థాపక దినం. కొబ్బరి ప్రాధాన్యతను గురించిన అవగాహన కల్పించడం, పేదరిక నిర్మూలనలో కొబ్బరి పాత్ర తెలియజెప్పడం, మొత్తంగా కొబ్బరి పరిశ్రమ వృద్ధి అయ్యేలా చూడటం ఏపీసీసీ లక్ష్యాలు.
92 దేశాల్లోని సుమారు మూడు కోట్ల ఎకరాల్లో కొబ్బరి పండుతుంది; ఏటా 6 కోట్ల టన్నుల కాయ ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ ఉత్పత్తిలో 16 శాతంతో భారత్ మూడో స్థానంలో ఉంటోంది. ఇండోనేషియా(34), ఫిలిప్పీన్స్(25) అత్యధికంగా సుమారు అరవై శాతం వాటాను ఆక్రమిస్తాయి. మళ్లీ మన దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కొబ్బరిలో దక్షిణాది నాలుగు రాష్ట్రాలు- కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లదే 92 శాతం. తిరిగి ఇందులో కేరళది సగం వాటా. కేరళీయులు వంటను కూడా కొబ్బరినూనెతో చేస్తారని మలయాళేతరుల ప్రేమవిసుగు ఇందుకే!
కొబ్బరి చెప్పే భావాలెన్నో!
ఒక కొత్త పని ప్రారంభించినప్పుడు, దాని తాలూకు గర్వం మనిషిలో మొలకెత్తే అవకాశం ఉంటుంది. నేను కేవలం పరికరాన్నే, అంతా నువ్వే అని దేవుడి ముందు మనిషి తన అహాన్ని బద్దలు కొట్టుకోవడంగా కొబ్బరికాయ కొట్టడాన్ని పెద్దలు విశ్లేషిస్తుంటారు. భయస్థులకు కొబ్బరిపీచు ప్రతీకట. ఎవరినీ లెక్కచేయనితనాన్ని టెంక ప్రతిబింబిస్తుంది. అటు అలానూ కాకుండా ఇటు ఇలానూ కాకుండా లోపలి తియ్యటి కొబ్బరిముక్కలాగా మనిషి ఉండాలని మరోరకంగా అర్థాన్ని చెప్పేవాళ్లూ ఉంటారు. స్థూలదేహం, సూక్ష్మదేహం, అతిచేతన మనసు, ఆత్మలను ఇది సూచిస్తున్నదని కొందరంటారు. తంత్రవిద్యల్లో చేసే నరబలిని మాన్పించడానికి, దాని స్థానంలో కొబ్బరికాయను కొట్టడం ఆదిశంకరాచార్యులు ప్రవేశపెట్టివుంటారని ఒక కథనం.
కొబ్బరిటెంకను శివుడిగానూ, కొబ్బరిని పార్వతీదేవిగా, నీటిని గంగాదేవిగానూ చెబుతారు. హిందువుల వివాహాల్లో ఆకుపచ్చటి కొబ్బరికాయను వధువు పందిట్లోకి మోసుకెళ్తుంది. కొబ్బరి గర్భాన్ని సూచిస్తుందట. మీది పీచు మనిషి జుట్టుకు, పెంకు మనిషి తలకు, కొబ్బరి మెదడుకు, నీళ్లు రక్తానికి ప్రతీకలని చెబుతారు. గుట్టు దాచుకుని కాపురం చేసుకోండని చెప్పడం కూడా కావొచ్చు.
ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి సాధిస్తే తప్ప చేరుకోలేమని చెప్పేందుకు ప్రతీకాత్మకంగా మన పూర్వీకులు ఆలయాలను కొండల మీద నిర్మించారు. దేవుడి దగ్గరికి, ఆ మాటకొస్తే ఎవరిదగ్గరికి వెళ్లినా పువ్వో పండో తీసుకెళ్లడం మర్యాద. మరి కొండెక్కడో ఉంది. ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో దేవుడికి ఏదైనా తీసుకెళ్లాలంటే ఎన్ని రోజులైనా పాడవ్వనిది అయ్యుండాలి. అలా కొబ్బరికాయ పూజల్లోకి వచ్చిందని ఒక కథనం.
అభిషేకం కోసమే కొబ్బరి...
సృష్టిలో ఎన్నో ఫలాలున్నా వాటిలో కాయ, పండు అవస్థ లేనిది కొబ్బరికాయ మాత్రమే. అది ఎప్పుడూ కాయే! కుళ్లిపోవడం తెలియని కాయ. విత్తనమూ కాయా రెండూ అయిన చెట్టు. దాని పుట్టుకే విశిష్టతతో కూడుకున్నది.
షోడషోపచారాల్లో దేవతలకు స్నానం చేయించడం ఒకటి. మనం తాకిన నీళ్లతో చేయించడం అపవిత్రం కాబట్టి, ప్రకృతి ప్రసాదించిన కొబ్బరినీటితో అభిషేకం చేయడాన్ని మన పెద్దవాళ్లు ఆచారంగా ఏర్పరిచారు. నిజానికి బోండాలే వాడాలి. అవి ఎక్కువ దొరక్క కాయలు ఉపయోగిస్తున్నాం.
బలి ఇవ్వడమనేది సమయాచారంలో లేదు; వామాచారంలో ఉంది. వామాచారంలో మంత్రాలుండవు, తంత్రాలుంటాయి. అందులో కూడా కూష్మాండబలి(తీపి గుమ్మడికాయ) ఉన్నదేగానీ కొబ్బరిని బలి ఇవ్వమనైతే ఎక్కడా చెప్పలేదు. అహాన్ని బద్దలు కొట్టడంగా కొబ్బరికాయ కొట్టడాన్ని అర్థం చేసుకోవడం అనేది, అన్వయించుకోవడానికి బాగుందిగానీ శాస్త్రప్రమాణం ఉన్నదయితే కాదు.
వివాహ సమయంలో వధువు చేతిలో కొబ్బరిబోండాం ఎందుకు పెడతామంటే: కొబ్బరి, అరటి విడి కాయలుగా ఉండవు. అవి గెలలుగా ఉంటాయి. అధిక సంతానానికి సూచిక. అందుకే ఈ రెంటికీ పెళ్లిలో ప్రాధాన్యత ఉంది. పుష్పవతి అయిన అమ్మాయికి వివాహం చేస్తాం కదా! ‘ఇదిగో ఈ పుష్పాన్ని నీకిస్తున్నాం, కొబ్బరిలాగే అనేక ఫలాలను అందించు,’ అని వరుడికి చెప్పడం అది.
ఆధ్యాత్మిక ప్రవచకులు
అయితే, వీటన్నింటికీ శాస్త్రప్రమాణం ఏమీలేదని కొట్టివేసే పెద్దవాళ్లూ ఉన్నారు. అన్వయింపే జీవితంలో ఉన్న అందం కాబట్టి, మనం ఎన్నిరకాలుగానైనా కొబ్బరి గురించి చెప్పుకోవచ్చు. సంప్రదాయాలు, ఆధ్యాత్మికతను పక్కకు పెట్టినా- ఏ అరిశెలోనో ఎక్కడైనా చిన్న కొబ్బరిముక్క నాలుక్కి తగులుతూ ఉంటే అందులో రుచి పెరుగుతుంది; ఆరుబయట మంచం వేసుకుని, కొబ్బరాకుల మాటున దాగిన చందమామను చూస్తే జీవితంలోని రుచి అర్థమవుతుంది.
మాల్దీవుల జాతీయవృక్షం కొబ్బరిచెట్టు. జాతీయచిహ్నంలో కూడా స్వీకరించారు.
కొబ్బరి అత్యధికంగా పండించే తొలి పది దేశాలు ఇండోనేషియా ఫిలిప్పీన్స్
భారత్ శ్రీలంక బ్రెజిల్ థాయిలాండ్ వియత్నాం మెక్సికో పాపువా న్యూ గినియా మలేషియా
స్టాండుల మీద వరుసగా నిలబెట్టివున్న కొబ్బరికాయల్ని ఒక చెక్క బంతితో పడగొట్టే ఆటను విదేశాల్లో ఆడతారు. దాని పేరు కొకొనట్ శై. మన జాతర్లలో రింగులు వేయడం లాంటిదే. పడగొట్టిన కొబ్బరికాయ విజేతదే!
- మైలవరపు శ్రీనివాసరావు