మహా గుణపతి | Vinayaka chavithi special story | Sakshi
Sakshi News home page

మహా గుణపతి

Published Thu, Sep 13 2018 12:07 AM | Last Updated on Thu, Sep 13 2018 7:45 AM

Vinayaka chavithi special story - Sakshi

విఘ్నేశ్వరుడు గణాలకే కాదు... గుణాలకూ అధిపతే!

మన సంప్రదాయంలో ఓ దైవం గురించీ, ఓ పూజ గురించీ దేన్ని గురించైనా సరే తెలుసుకోదగ్గ ఎన్నో విశేషాలను తెలుసుకోగలుగుతున్నాం. అలా తెలుసుకోగలిగినంత సమాచారం మనకి అందేలా చేయాలని భావించిన నాటి రుషులు అంతంతటి సమాచారాన్ని చిన్న చిన్న శ్లోకాల్లో పెట్టి మనకి అందించి ఉంచడం మరింత గొప్పదనం నిజంగా. వీటిప్రాముఖ్యాన్నీ ప్రాశస్త్యాన్నీ గమనించిన వాళ్లు కాబట్టే నాటి వారంతా నేటికాలంలో లాగా ఏ విధమైన దృశ్య– శ్రవణ మాధ్యమాలు లేకున్నా అలా నిత్యం పఠిస్తూ పఠింపజేస్తూ కేవలం నోటి ద్వారా చెవి ద్వారా మనందరికీ వాటిని సంప్రదాయపు ఆస్తి సుమా అంటూ అందజేసి వెళ్లారు. వీటిని పరిరక్షించుకో(లేని) పక్షంలో నిజమైన కళ్లున్న గుడ్డివాళ్లం అనేది వాస్తవం. ఈ నేపథ్యంలో మన మహాగణపతి మనకి ఎలా ఉండాలో, ఏయే గుణాలు మనకి అవసరమో ఆవశ్యకమో అద్భుతంగా తెలియజేశాడు తనని పఠిస్తుండే శ్లోకంలో ఇమిడిపోయి. 

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదర శ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
అష్టా వష్టౌ చ నామాని యః పఠే చ్ఛృణుయా దపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. 

వినాయకునిలో నుండి గ్రహించవలసిన గుణాలని చెప్పే నామాలు 8. వినాయకుని రూపాన్ని వర్ణిస్తూ ఆ రూపం ద్వారా ఆయన గుణ సౌందర్యాన్ని అర్థం చేసుకుంటూ కళ్లలో ఆయన రూపాన్ని నిలుపుకునేలా చేసే నామాలు 8. మొత్తం 16 నామాలు పై శ్లోకంలో ఉన్నాయి. ఈ విశేషాన్ని గుర్తించవలసినదిగా చెప్పేందుకే అష్టౌ అష్టౌ చ నామాని అని కనిపిస్తుంది శ్లోకంలో. రూపాన్ని వర్ణించదలచడం ప్రస్తుత వ్యాస శీర్షిక ప్రకారం అప్రస్తుతం కాబట్టి నేరుగా ఆయన గుణాలని గురించి వివరించుకుంటూ, ఇలాంటి గుణాలని మనం ఆయన నుండి నేర్చుకోవాలనే యథార్థాన్ని తెలుసుకుందాం!

1 సుముఖః
సు– ముఖః అంటే ఎవరు ఏ కోరికను తన ముందుకొచ్చి చెప్పదలిచినా, మనసులో అనుకుంటున్నా ఆ అభిప్రాయాన్ని ఎంతో సుముఖునిగా ఉంటూ (వినాలనే ఆసక్తితోనూ, చెప్పేవానికి తప్పక తన పని తీరుతుందనే నమ్మకం కలిగేలాగానూ ఆ విషయాన్నంతటినీ వింటాడాయన. లోకంలో కొందరి దగ్గరకు పోయి ఏదైనా చెప్పుకోదలిస్తే, ఏదో పరాకుగా వింటూనో మధ్యమధ్యలో ఎవరినుండో వచ్చిన మాటల్ని వింటూనో ఆ మధ్య మధ్యలో ‘ఏం చెప్పా?’వంటూ అడుగుతూనో వినే మనుషులుంటారు. అలాంటి వాళ్లకి వినాయకుడు చెప్తాడు– వినదలిస్తే సుముఖునిగా ఉండి విను. లేదా తర్వాత వింటానని చెప్పు తప్ప వింటున్నట్టుగా వినకుండా ఉండటం సరికాదని. 
సు–ముఖః అనే పదంలో ముఖమనే మాటకి చక్కని నోరు కలవాడనేది కూడా అర్థం. అందుకే ముఖం కడిగావా? అనే వాక్యానికి దంతధావన చేశావా? అనేదే అర్థం. ‘నీ మొహం అంటాం. అంటే నోటితో చెప్పే ఆ మాటలెంత పేలవంగా ఉన్నాయో గుర్తించు!’ అని చెప్పడం దాని భావం. ఇలా ముఖమనే మాటకి నోరు అనేదే అర్థం. వినాయకుడు చక్కని నోరు కలవాడనేది దీనర్థం. నోటితో సంభాషిస్తాం కాబట్టి నొప్పించకుండా మాట్లాడేవాడనేది ఈయనకున్న మరో చక్కని గుణమన్నమాట. ఎందరిలోనో కొరవడేది ఇదే కదా!కాబట్టి ‘సుముఖ’ నామం ద్వారా ఎవరేది తనకి చెప్పుకోదలిచి ఏదైనా చెప్పదలిచి వచ్చినా – తల్లి తన బిడ్డ తన దగ్గరకొచ్చి ఏదో చెప్పదలిచి వస్తే – ఎలా వింటుందో అలా వినాలన్నమాట. రెండవది దానికి సమాధానాన్ని కూడా అతని కష్టం. తీరేలాగా చక్కని శైలిలో చక్కని స్వరంలో చెప్పాలన్నమాట. ఆయన నోటి నుండి అంతా విన్నాక ‘ఆ మాటొచ్చింది. చాలు’ అనుకున్నానని అంటుంటామే! అలా మాట్లాడుతాడన్నమాట గణపతి. ఆ గుణం మనకి రావాలని ఆయన చెబుతున్నట్లుగా ఆయన నామాన్ని బట్టి మనం గ్రహించాలి. 

2 ఏక+దంతః
గజ ముఖం కలిగిన ఆయనకి నిజంగా 2 దంతాలుండాలి. వ్యాసుడంతటివాడు భారత గ్రంథమంతనీ తన బుద్ధిలో నిలుపుకుని ‘నేను చెప్తూంటే రాయగల బుద్ధిమంతుడెవరా?’ అని బ్రహ్మ గురించి ప్రార్థిస్తే ఆయన గణపతి పేరుని చెప్పాడు. గణపతిని ప్రార్థిస్తే ఆయన – తప్పక రాస్తాను. అయితే నా రాత వేగానికి సరిపోయేలా నువ్వు కవిత్వాన్ని చెప్పా–లనే నియమాన్ని పెట్టాడు. (...భవేయం లేఖకోహ్యహమ్‌). దాన్ని విని వ్యాసుడు మరో నియమాన్ని పెడుతూ – ‘నేను చెప్పే ప్రతి అక్షరాన్నీ నువ్వు అర్థం చేసుకున్నాక మాత్రమే రాయాలి తప్ప ఏదో యథాలాపంగా రాయకూడ’దన్నాడు. (అబుద్ధ్వామా విఖ! క్పచిత్‌)
వ్యాసుని నియమాన్ని వింటూనే మహాగ్రంథాన్ని రాయబోతే తప్ప తనంతటివానితో ఇలాంటి ఒప్పందాన్ని చేయనే చేయదలచడని భావించిన గణపతి ఆ రాయబోయే గ్రంథాన్ని తన చేతులతో బిగించడం కోసం తన దంతాన్నే పెరికి (పెకలించి) గంటంగా చేసి మరీ రాశాడు.దీన్ని గమనిస్తూ మనమూ అర్థం చేసుకోగలగాలి. మన శరీరంలోని ఏ అవయవమైనా అవతలివానికి సహాయపడేలా చేయాలని. దధీచి మహర్షి తన వెన్నెముకని రాక్షస వధ కోసం ఇంద్రునికి వజ్రాయుధంగా చేశాడంటేనూ, అలర్కుడనే మహారాజు తన కన్నుల్ని దానం చేశాడంటేనూ... ఇలాంటివన్నీ దీనికుదాహరణలే. మరి మన స్థాయిలో మనం చేదోడు వాదోడు (పనిలో సహాయపడటం – మాట సహాయం చేయడం)గా ఉండగలిగితే చాలు. నిందని ఎదుటివాళ్ల మీద నెట్టేలా సముఖంలో మాట్లాడటం, చాటున చాడీలు చెప్పడం వంటివి మానేస్తే చాలు. ఒక్కొక్కరికి ఓ వింత వ్యాధి ఉంటూంటుంది. ఈ రోజు ఆకాశానికెత్తెయ్యడం, రేపటి రోజున పాతాళంలోకి పడేస్తూ పదిమంది మధ్య అవమానించడం. ఇదుగో ఇలాంటివన్నీ మానాలని చెప్పడం దీని భావం. శరీరావయవాలన్నీ ఎదుటివారికి తోడ్పడేలా చేయగలగాలి. 

3 కపిలః
రెండు రంగులు కలిసిన తనాన్ని ‘కపిల’మంటారు. ఇటు శివ లక్షణమూ అటు విష్ణు విధానమూ కలిగినవాడు కాబట్టి కపిలుడు (శుక్లాం బరధరం విష్ణుమ్‌... కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా!) దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరైనా నేరాన్ని చేస్తే ‘వాడు మనవాడా? మనకి ఉపయోగపడేవాడా?’ అని ఈ తీరుగా లెక్కించి తప్పుచేసినా రక్షించదలిచే (రావణుడికి కుంభకర్ణునిలా) చేయరాదనీ శిక్షించే తీరాలని చెప్తుంది ఒక పద్ధతి. అదే తీరుగా ధర్మబద్ధంగా పనిచేస్తూ ఉండేవాణ్ని మెచ్చుకోవడమే కాక వానికి కొంత వెసులుబాటుని కల్పించాలని కూడా దీని భావంగా అర్థం చేసుకోవాలి!

4 గజకర్ణికః
ఏనుగు చెవులే తనకి చెవులుగా కలవాడనేది పై అర్థం. ఏనుగుకున్న లక్షణాల్లో రెండు ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. అంత ఎత్తున్న ఏనుగుకున్న ఆ చిన్న కళ్లు నేలమీద పడ్డ  సూదిని కూడా గుర్తించగలవు.అలాగే ఆ చెవులు దూరంగా పాము బుసకొడుతూంటే వినగలిగినంతటి శక్తిమంతమైనవి. చెవుల వరకే దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరు మన ప్రవర్తన గురించి తేడాగా అనుకుంటున్నారో గమనించుకుంటూ ఉండాలి. లోకం నుండి అపవాదు వస్తుందేమో అనే భయంతో మన ప్రవర్తన ఉండాలి తప్ప ‘ఎవ్వరేమనుకున్న నాకేమి సిగ్గు?’ అన్నట్టుగా ఉంటే పశువుకీ వీనికీ భేదం లేనట్టే. ఇక ఏనుగు తన చెవుల్ని నిరంతరం ఆడిస్తూనే ఉంటుంది. ఇదే తీరుగా అధికారికి ఎందరెందరో ఇచ్చకాలు పలుకుతూ పొగిడేస్తూ దగ్గరైపోతుంటారు. మరోపక్క గిట్టనివారి మీద చెప్పేస్తూ వ్యతిరేకతని నూరిపోస్తూ ఉంటారు. అంటే వేటిని వినాలో వేటిని వినకూడదో గమనించుకోవాలి తప్ప చెవికి చేరిన అన్నిటినీ నమ్మడం సరికాదని. 

5 లంబోదరః
పెద్ద బొజ్జ ఉన్నవాడనేది దీనిపై అర్థం. ‘లంబ’మనే మాటకి వేలాడుతున్న (లంబమానః) అనేది సరైన అర్థం. బొజ్జ మరింతగా అయినప్పుడు కిందికి వేలాడుతూ ఉంటుంది.‘నా కడుపులో ఎన్నో రహస్యాలని దాచుకున్నా’నంటుంది తల్లి. అలా రహస్యాలెందరు తనకొచ్చి చెప్పినా వాటికి తన పైత్యాన్ని కూడా జోడించి ప్రచారం చేయడం కాకుండా ‘కడుపులో దాచుకోగలగడ’మనే గొప్ప లక్షణాన్ని అలవర్చుకోవాలనేది గణపతి మనకి చెప్తున్నాడన్నమాట!

6 వికటః
కటమంటే చెక్కిలి. ఏనుగు రూపం అయిన కారణంగా ఏటవాలుగా అయి దృఢంగా అయిన చెక్కిలి కలవాడనేది దీనర్థం. దీన్ని మనకి అన్వయించుకుంటే చెక్కిలి (కటం) అనేదే వ్యక్తి చెప్పదలిచిన అభిప్రాయాన్ని చెప్పించగల ముఖ్య అవయవం ముఖంలో. అందుకే ఆంజనేయుడికి ‘హనుమాన్‌’ చక్కని హనువులు కలవాడనే పేరు. ఏ పదం తర్వాత ఏ పదాన్ని పలకాలో, ఎంతగా ఊది ఏ పదాన్ని పలకాలో దేన్ని తేల్చి పలకాలో, ఏ మాటని ముందు చెప్పి తర్వాత దేన్ని పలకాలో ఆ విశేషాన్ని వివరించేది ఈ నామం. మనం కూడా స్పష్టంగా అవగాహనతో నిదానించి మాట్లాడాలనే గుణాన్ని గ్రహించాలన్నమాట.

7 విఘ్నరాజః
ప్రారంభించబడ్డ పని – ఇక ఎప్పటికీ ముడిపడనే పడ–దన్న రీతిలో వచ్చిన అభ్యంతరాన్ని విఘ్నమంది శాస్త్రం. (ప్రారబ్ధం కర్మ విశేషేణ ఘ్నంతీతి విఘ్నః) అలాంటి విఘ్నాలకి రాజు ఆయన అని అర్థం.రాజుకి చతురంగ బలాలు (పదాద్రి–అశ్వ–గజ–రథ) ఉన్నట్లే విఘ్నాలని తొలగించేందుకై నాలుగు విధాలుగా ప్రయత్నించడం నలుగురి సహాయాన్ని అర్ధించడం నాలుగు చోట్లకి వెళ్లి విచారించి ఆ విఘ్నాన్ని తొలగించుకోవాలి తప్ప విఘ్నం వచ్చిందనుకుంటూ దుఃఖిస్తూ ఉండిపోవడం సరికానిదని గణపతి చెప్తున్నాడన్నమాట!

8 గణాధిపః
యక్ష కింనర కింపురుష గంధర్వ విహంగ నాగ రాక్షస దేవ... మొదలైన అన్ని గణాలకీ అధిపతి అనేది దీనర్థం.లోకంలో ఏ ఒక్కరూ శత్రువంటూ లేనివాళ్లుండరు. కాబట్టి ఏక–గ్రీవంగా (ముక్తకంఠంతో) ఎన్నుకోవడమనేది అసాధ్యమైన అంశం. అయితే వినాయకుడు మాత్రం సర్వగణాధిపతి కాగలిగాడంటే దాని ద్వారా ‘అందరూ మెచ్చుకునే తీరులో తన ప్రవర్తనని ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ నడుచుకోవాలనే గుణాన్ని మనం గ్రహించుకోవాలన్నమాట.మరో విశేషమేమంటే పైన కనిపిస్తున్న అన్ని గుణాలవీ ఒకే తీరు లక్షణం కలవి కావు. ఎవరి తీరు వారిది అయితే అలాంటి భిన్న భిన్న లక్షణాలున్న అందరినీ ఒకే తీరుగా అంగీకరించేలా చేసి ఆధిపత్యాన్ని సాధించగలిగాడంటే ఆ తీరుగా అధికారి ఉండాల్సిందేనని చెప్తున్నాడన్నమాట గణపతి.తనకి తగిన శక్తి లేకపోయినా తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తూ నారాయణాష్టాక్షరీ మంత్ర మననం చేస్తూ విజయాన్ని సాధించగలిగాడు కాబట్టీ, గణాధిపుడు ఆ కారణంగానే కాగలిగాడు కాబట్టీ అధికారికి ఉండాల్సింది దైవ విశ్వాసమూ తన తల్లిదండ్రుల మీద గౌరవమున్నూ – అని గణపతి తెలియజేస్తున్నాడన్నమాట!

ఇలాంటి 8 గుణాలలో సంవత్సరానికొకటి చొప్పున అయినా పొందగలిగే ప్రయత్నాన్ని ప్రారంభిస్తే వ్యక్తిలో మార్పు సంభవం అవుతుంది. లేని పక్షంలో పూజావస్తువులు కొన్న మూల్యం, పూజ చేసిన కాలం దండగ అవుతాయి. కాలక్షేప పూజే అవుతుంది!ఈ 8 గుణాలనీ అర్థం చేసుకున్నాక ఈ మొత్తం మీద మనకి అర్థమయ్యే మరో గుణం – దాన్ని 9వ గుణం అనుకోవచ్చు – గురించి అనుకుందాంగణాధిపత్యాన్ని పొందడానికి – ఎవరు అన్ని నదీ నద సముద్ర జలాల్లో స్నానం చేసి వస్తే వాళ్లు అర్హు–లనేది విషయం. ఈ మాటని వింటూనే సన్న శరీరం వాడూ, నెమలి వాహనం వాడూ అయిన కుమారస్వామి వాయు వేగంతో ఆకాశంలోకి దూసుకుపోతూంటే వినాయకుడు అసూయపడలేదు.

తమ్మునికి పరాజయం లభించేలా శపించవలసిందనో అనుకూలత లేకుండా చేయవలసిందనో ప్రార్థించలేదు – లేదా – తనకి తానే ఓ మంత్రాన్ని మననం చేయడం చేయలేదు.మనకి అసాధ్యమైన పనిని మరొకరు చేస్తూంటే దాన్ని చెడగొట్టించుదాం – చెడగొడదామనే ఆలోచన లేకపోవడాన్ని నేర్చుకోవాలి గణపతి నుండి. తనకి ఆ పదవి ఎలాగైనా లభించేలా ఏ అకృత్యాన్నో చేయవలసిందని అనలేదు – తల్లిదండ్రుల్ని తూలనాడలేదు. గమనించుకోవాలి. లోకంలో ఎందరో చేసే సర్వసాధారణమైన పని ఇదే.వినాయకుడు చేసింది – తన అçశక్తతని అంగీకరిస్తూ తల్లిదండ్రుల దగ్గరికి మౌనంగా వెళ్లి కన్నీరు పెట్టడం. అంటే ఏమన్నమాట? గుండె నిండు దుఃఖానికి మన అశక్తత గాని కారణమయ్యుంటే, ఆ బాధ నుండి తాము బయటపడాలంటే శత్రువుని ఓడించడం, ఓడించే ప్రయత్నాలని ఇతరుల ద్వారా చేయించడం, తనవాళ్లని నిందించడం కాదు – కనిపించే దైవాల్లా ఉండే తల్లిదండ్రుల్ని ఆరాధించడమే అని చెప్తున్నాడన్నమాట! ఎంత గొప్ప ఉపాయం ఇది! ఎవరైనా తమ తల్లిదండ్రులకి గౌరవాన్నిస్తూ చూసుకుంటూ ఉంటే – వీళ్లెవరో తనలాగా తల్లిదండ్రుల పట్ల గౌరవం కలవాళ్లనే అభిప్రాయంతో విజయాన్నిస్తాడన్నమాట! ఎంత గొప్ప గుణం అది!!

– డా. మైలవరపు శ్రీనివాసరావు
 పౌరాణిక ప్రవచకులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement