వికాసం: అందంగా మాట్లాడటం ఒక కళ!
‘మాట్లాడటం సిల్వర్; మౌనం బంగారం’ అన్న ఇంగ్లిష్ సామెత కరెక్టయితే అయ్యుండచ్చు గాక. దీని కన్నా మించిన సూక్తి ‘సరైన సందర్భంలో సరిగ్గా మాట్లాడటం ప్లాటినం!’
‘నీ భార్య చనిపోయిందని తెలిసి చాలా సంతోషంగా ఉంది’ అన్నాడు ఓ స్నేహితుడు. అసలే భార్య మరణించి రోదిస్తూన్న వ్యక్తి ఈ మాటలకి నిర్ఘాంతపోయాడు. ‘నీకు క్యాన్సర్ అని డాక్టర్లు నిర్ధారించారట’ స్నేహితుడు కొనసాగించాడు. ‘ఇంకో నాలుగైదు నెలల కన్నా బతకవని చెప్పారట. నిజమేనా? పిల్లలు కూడా లేరు కదా! ఎంతో సంతోషంగా ఉంది’. వింటున్న వ్యక్తి సాచి పెట్టి కొట్టాడు.
‘మాట్లాడటం సిల్వర్; మౌనం బంగారం’ అన్న ఇంగ్లిష్ సామెత కరెక్టయితే అయ్యుండచ్చు గాక. దీని కన్నా మించిన సూక్తి ‘సరైన సందర్భంలో సరిగ్గా మాట్లాడటం ప్లాటినం!’.
మన ఫీలింగ్‌ని అవతలివారికి కరెక్ట్‌గా అర్థమయ్యేలా చెప్పగలగటం ఒక కళ. దీన్నే ‘కమ్యూనికేషన్’ అంటారు. పై సంఘటనలో స్నేహితుని ఉద్దేశం ఏమిటంటే, ‘నీవొక ఆరు నెలల్లో మరణించబోతున్నావు, నీకెలాగో పిల్లల్లేరు. ఇప్పుడు నీ భార్య కూడా మరణించింది. ఆ విధంగా నీకు అన్ని భవబంధాలు నశించాయి. ఎంతో అదృష్టం చేసుకుంది కాబట్టే నీ అంతిమ దినాల్లో కష్టాలు చూడకుండా, నీ మరణం తరువాత కష్టాల్ని భరించకుండా నీ భార్య ఈ లోకం నుండి వెళ్లిపోయింది.’
ఇది సరిగ్గా చెప్పలేకే అతడు ఒక స్నేహాన్ని పోగొట్టుకున్నాడు. సాంఘిక సేవలో నిమగ్నమైన ఒక నిశ్శబ్ద సోషల్ వర్కర్‌కి భారతరత్న రావొచ్చు. మౌనంగా తన పని తాను చేసుకుపోయే ఒక సైంటిస్ట్‌కి నోబుల్ ప్రైజ్ రావొచ్చు. కానీ సమాజంలో పేరు, ప్రతిష్ట పెరగాలంటే మనిషికి ఈ ఏడు రకాల అంశాల్లో ‘కనీసం కొన్నయినా’ ఉండాలి. తెలివి, విషయ పరిజ్ఞానం, లౌక్యం, ఇతరులతో సంబంధాలు, డబ్బు, దాతృత్వం, కమ్యూనికేషన్. చివరిది అన్నిటికన్నా ముఖ్యం.
అవసరం లేని విషయాన్ని మాట్లాడటం, అసందర్భమైన సమయంలో మాట్లాడకుండా ఉండటం కళ. తప్పు సంకేతం వచ్చేలా మాట్లాడటం మరీ దారుణం. ఆ విషయాన్ని పై స్నేహితుడి ఉదాహరణ నిరూపిస్తుంది. ఒక విషయాన్ని అవతలివారికి చెప్పేటప్పుడు, అది వారికి సరిగ్గా అర్థం అయిందా లేదా అని చూడాలి. ఒక దినపత్రికలో ‘నక్సలైట్లు పోలీస్‌స్టేషన్‌ను చుట్టు ముట్టి, కాల్పులు జరిపినప్పుడు పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఇందులో ఆరుగురు గాయపడ్డారు’ అని వార్త వచ్చింది. గాయపడింది పోలీసులో, నక్సలైట్లో చదివేవారికి అర్థం కాలేదు.
చదవటం, రాయటం, మాట్లాడటం, వినటం, హావభావాలు, సంజ్ఞల మీద కమ్యూనికేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. సంభాషణాన్ని రెండు రకాలుగా విడగొట్టవచ్చు. ప్రైవేట్ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్. ప్రైవేట్ కమ్యూనికేషన్‌లో నాలుగు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి.
1. మన మూడ్, మాట్లాడటానికి తగిన విధంగా ఉందా? 2. అవతలివారి మూడ్, వినటానికి సరైన స్థితిలో ఉందా? 3. అవతలివారి మూడ్‌ని, మన మాటల్తో మార్చగలిగే పరిస్థితి ఉందా? 4. అవతలివారి పరిస్థితిని బట్టి మన మూడ్ మార్చుకొనే అవసరం ఉందా?
ఈ చివరి దాన్ని భావోద్వేగ నియంత్రణ (ఎమోషనల్ కంట్రోల్) అంటారు.
ఐదు జ్ఞానేంద్రియాలతో మనం గ్రహించేది ‘వాస్తవం’. అది దృశ్యం కావొచ్చు. పరిమళం కావొచ్చు. శబ్దం కావొచ్చు. అలా గ్రహించిన దాన్ని మనం ఏ విధంగా అన్వయించుకుంటామనేది మన ‘ఫీలింగ్’.
- యండమూరి వీరేంద్రనాథ్