
మహా మాయగాడు
ఎవరూ ఊహించలేని మోసాలను చేయడమే కాదు, అవసాన దశలో పోలీసు బందోబస్తు నుంచి తప్పించుకుని, తర్వాత ఎవరికీ చిక్కకుండా పోయిన మహా మాయగాడు నట్వర్‌లాల్. అతడి ఘనకార్యాలు అలాంటిలాంటివి కావు. ఇతగాడి అసలు పేరు మిథిలేశ్ కుమార్ శ్రీవాస్తవ. బిహార్‌లోని సివాన్ జిల్లా బాంగ్రా అనే కుగ్రామంలో పుట్టాడు. మోసాల బాటలోకి అడుగుపెట్టక ముందు న్యాయవాదిగా ఉండేవాడు. రకరకాల మారుపేర్లతో మాయ వేషాలతో వందలాది మందికి కోట్లాది రూపాయల మేరకు నిట్టనిలువునా ముంచేసిన బురిడీరాయుడు నట్వర్‌లాల్.
అతడి బాధితుల్లో టాటా, బిర్లా, అంబానీలు కూడా ఉన్నారు. తాజ్ మహల్, ఎర్రకోట, రాష్ట్రపతి భవన్‌లను ఒకటి కంటే ఎక్కువసార్లే అమ్మేశాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే పార్లమెంటు భవనాన్ని 545 మంది సిటింగ్ సభ్యులతో పాటు తెగనమ్మేశాడు. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ సహా పలువురు ప్రముఖుల సంతకాలను ఫోర్జరీ చేసి ఎడాపెడా మోసాలు సాగించాడు. తొమ్మిదిసార్లు అరెస్టయినా, జైళ్ల నుంచి తప్పించుకుని పారిపోయాడు. అతడిపై వందకు పైగా కేసులు ఉండేవి.
వాటిలో 14 కేసులకు సంబంధించి మొత్తం 113 ఏళ్ల శిక్ష పడింది. అయితే, అతడు జైలులో గడిపింది ఇరవై ఏళ్ల లోపే. చివరిసారిగా కాన్పూర్ జైలులో ఉండగా జైలు సిబ్బంది 1996 జూన్ 24న అతడిని కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య వైద్యపరీక్షల కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. అప్పటికి అతడి వయసు 84 ఏళ్లు. అక్కడి నుంచి అతడు తప్పించుకుపోయాడు. ఆ తర్వాత అతడి ఆచూకీ ఎవరికీ దొరకలేదు.