
వయసుకు తొందరపాటు ఎక్కువ
చిత్రం: చంద్రముఖి
రచన: భువనచంద్ర
సంగీతం: విద్యాసాగర్
గానం: టిప్పు, బిన్నీ బాలకృష్ణన్
పి. వాసు దర్శకత్వంలో వచ్చిన ‘ఆప్తమిత్ర’ (తమిళ చంద్రముఖి) చిత్రంలో నేను రాసిన తెలుగు పాట ఇది. ఈ పాటతో నాకు తమిళనాడులో గుర్తింపు వచ్చింది. నేటికీ నన్ను చంద్రముఖి పాట రచయితగా పరిచయం చేస్తున్నారు. తెలుగులో వచ్చిన ‘చంద్రముఖి’లో నా పాటకి తమిళంలో వాలితో అనువాదం రాయించారు. చంద్రముఖి సాంఘిక చిత్రం. కానీ ఈ పాటను చారిత్రకంగా చూపాలి. ఆ కాలాన్ని ప్రతిబింబించేలా, ఈ కాలపు వాళ్లకి అర్థమయ్యేలా పదాలను ఎంపిక చేసుకున్నాను.
నాట్యాచార్యుడిని ప్రేమించిన నర్తకి ప్రేమగా పిలవటం ఈ పాట సందర్భం. ‘రారా సరసకు రారా....’ అనే పల్లవితో పాట మొదలవుతుంది. తన ప్రాణం అతనిదే అంటుంది, తన ఊపిరిలో ఊపిరిగా కలిసిపొమ్మని పిలుస్తుంది. ‘నీ పొందునే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహరా; కాలాన మరుగైన ఆనంద రాగాలు వినిపించ నిలిచానురా’ అంటూ అష్టవిధ నాయికలలో నాయకుడి పొందుకోరే ‘అభిసారిక’ ను ఇక్కడ ప్రస్తావించాను. అత్యంత ప్రియమైనవి ఎన్నటికీ మరుగున పడవనేది అక్షర సత్యం. అందుకే మరుగైన ఆనందరాగాలు అనే పదం ఇక్కడ ఉపయోగించాను.
చరణంలో... ‘వయసు జాలమోపలేదురా మరులుగొన్న చిన్నదానరా; తనువు బాధ తీర్చ రావేరా రావేరా... సలసలసల రగిలిన పరువపు సొద ఇది; తడబడి తడబడి తపముల స్వరమిది’ అంటూ వయసుకుండే తొందరపాటును చూపడం కోసం ఎక్కువగా లఘువులు ఉపయోగించాను. పగలాగే ప్రేమ కూడా శక్తివంతమైంది. పగకు మూలకారణం ప్రేమ. త్రికరణశుద్ధిగా ప్రేమించిన చోట అనుమానానికి తావు ఉండదు. సాంఘిక ముద్ర కోసం మాత్రమే వివాహం చేసుకుంటారనే అంశాన్ని పరోక్షంగా ఇందులో చూపాను.
తమది జన్మజన్మల బంధం అని చెబుతుంది. ‘నయనాల నడయాడు తొలి స్వప్నం, నీ వలపును మరచుట సులువా, ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక, సరసకు పిలిచితి విరసము తగదిక, బిగిబిగిబిగిబిగి సొగసుల మొరవిని, మిలమిల మగసరి మెరుపులు విరియగ రారా’ అంటూ రెండవ చరణంలో వారి అనుబంధాన్ని, విరహాన్ని, ఇద్దరూ కలవాలనే వారి బలమైన కోరికను చూపాను. తమిళనాడులో నాకు ఎంతో గుర్తింపు తెచ్చిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాట తమిళనాట టాప్ టెన్‌లో రెండవ స్థానంలో నిలిచింది.
– సంభాషణ: డా. వైజయంతి