ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభలో మూడో స్వరం వినిపించేందుకు ట్రాన్స్‌జెండర్లు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వరంగల్ తూర్పు సెగ్మెంట్ నుంచి బీఎస్‌పీ అభ్యర్థి గా పోటీ చేసేందుకు రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయకు తాజాగా అవకాశం లభించగా, గత ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీఎల్‌ఎఫ్ అభ్యర్థి గా పోటీ చేసిన చంద్రముఖి కూడా ఈసారి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇక ట్రాన్స్‌జెండర్‌లతో పాటు ప్రజల్లో ఓటు అవగాహనకు రాష్ట్ర ఎన్నికల ప్రచార కర్తగా వరంగల్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ లైలాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది. ఆమె తమ కమ్యూనిటీ వారు ఓటు నమోదు చేసుకునేందుకు అవగాహన కలిగిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్/హైదరాబాద్
రాష్ట్రంలో సుమారు 50 వేల మందికి పైగా ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు స్వచ్చంద సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ ఓటర్లుగా నమోదైన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ట్రాన్స్‌జెండర్ల పట్ల సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాలు, వేధింపుల కారణంగానే చాలామంది ‘మగవారు’గానే మనుగడ కొనసాగిస్తున్నట్టు ఆయా సంస్థలు చెబుతున్నాయి. అన్ని జీవన సమూహాల్లాగే ట్రాన్స్‌జెండర్లు కూడా స్వేచ్ఛా యుతమైన జీవనాన్ని కొనసాగించే హక్కును కలిగి ఉన్నట్లు గతంలో వెలువరించిన సుప్రీంకోర్టు తీర్పు వారికి గొప్ప ఆత్మస్థైర్యాన్ని కలిగించింది.
మరోవైపు వివిధ స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలు, హక్కులసంఘాల నుంచి వారికి సంపూర్ణమైన మద్దతు, అండదండలు లభించాయి. దీంతో ట్రాన్స్ జెండర్లు సంఘటితమయ్యారు. తమ ఉనికిని బలంగా చాటుకొనేందుకు ఎన్నికలను ఒక అస్త్రంగా మలుచుకున్నారు. తీవ్రమైన వివక్ష, అణచివేతకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్‌ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు, ఆకాంక్షలనువెల్లడించేందుకు చట్టసభలను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నట్లు చిత్రపు పుషి్పత లయ, చంద్రముఖి చెబుతున్నారు.
బీఎస్పీ కార్యకర్త నుంచి అభ్యర్థిగా చిత్రపు పుష్పిత లయ ప్రస్థానం
వరంగల్ రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయ బీఎస్పీ పార్టీ కార్యకర్తగా ఢిల్లీలో ఐదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత డాక్టర్ అంబేడ్కర్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. రెండేళ్ల నుంచి వరంగల్ తూర్పు బీఎస్‌పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ట్రాన్స్‌జెండర్ల తరఫున తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈసారి స్వతంత్ర అభ్యర్థి గా చంద్రముఖి
ట్రాన్స్‌జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు మువ్వల చంద్రముఖి వెల్లడించారు. భరతనాట్య కళాకారిణి. వ్యాఖ్యాత, సినీనటి అయిన చంద్రముఖి దశాబ్దకాలంగా ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రజాస్వామ్య సౌధంలో మూడోస్వరాన్ని వినిపించేందుకే 2018లో ట్రాన్స్‌జెండర్ల ప్రతినిధిగా, బీఎల్‌ఎఫ్ అభ్యర్థి గా గోషామహల్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 1125 ఓట్లు లభించాయి. ఈ సారి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నట్లు చెప్పారు. ఏ నియోజకవర్గం నుంచి అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.
ఎన్నికల ప్రచారకర్తగా లైలా..
మహబూబాబాద్ జిల్లాలోని అన్నారం గ్రామానికి చెందిన లైలా అలియాస్ ఓరుగంటి లక్ష్మణ్ డిగ్రీ చదువుకునే రోజుల్లో హిజ్రావైపు మళ్లారు. పూర్తిస్థాయి ట్రాన్స్‌జెండర్‌గా మారి డబుల్ పీజీ కూడా చేశారు. 20 ఏళ్ల నుంచి మ్యారీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ ప్రాజెక్ట్‌లో హెల్త్ వర్కర్‌గా పనిచేస్తూ వరంగల్‌లో ఉంటున్నారు. రాష్ట్ర హిజ్రాల వెల్ఫేర్ సంఘం సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు. వారి కమ్యూనిటీ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఈమె సేవలను గుర్తించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది సెపె్టంబర్ 19వ తేదీన ఎన్నికల ప్రచారకర్త (అంబాసిడర్)గా నియమించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment