శ్రీఆంజనేయం | Sri Anjaneyam | Sakshi
Sakshi News home page

శ్రీఆంజనేయం

Published Sun, Jun 14 2015 12:31 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

శ్రీఆంజనేయం - Sakshi

శ్రీఆంజనేయం

 మనుషులకైనా, కోతులకైనా ఇగో సహజం. మనుషుల ఇగో వల్ల కోతులకే సమస్య లేదు గానీ, కోతుల ఇగో వల్ల ఒకసారి మా ఊళ్లో కొంపలు మునిగాయి.సర్వీస్ ఆటో శంకర్‌తో ఈ కథ మొదలైంది. ఆ ఆటో ప్రత్యేకత ఏమంటే ఎవరు ఎవరిపైన కూచున్నారో తెలుసుకోవటం కష్టం. ఓ నలుగురయిదుగురు కడ్డీలకు జెండాల్లా రెపరెపలాడుతూ వేలాడుతూ ఉండగా ఎప్పటిలాగే శంకర్ ఆటో కదిలింది. అదే సమయానికి ఊరి బయట మర్రిచెట్టు వద్ద ఓ కోతుల గుంపు విశ్రాంతి తీసుకుంటూ ఉంది. మా ఊళ్లో జనమే బెంగళూరికి వలస వెళుతూ ఉంటే ఈ వెర్రి మర్కటాలు మా ఊరికి అంతకుముందు రోజు రాత్రి వలసొచ్చాయి.
 
 నల్లటి పొగతో దడదడమని వస్తున్న ఆటోని చూసి కోతులకు నిద్రాభంగమైంది. ఒంటిపిర్రపై కూచుని, గోతికి గోతికి మధ్య కనిపిస్తున్న రోడ్డుపై చాకచక్యంగా ఆటో నడుపుతున్న శంకర్‌కి కోతుల్ని చూసి ముచ్చటేసింది. గట్టిగా హారన్ కొట్టాడు. ఆటోలో అన్నివైపుల నుంచి వేలాడుతున్నవాళ్లు కూడా గట్టిగా అరిచి కోతుల్ని రెచ్చగొట్టారు. ఈ కొత్త జంతువు తమని సవాల్ చేస్తూ ఉందని ఇగో ఫీలయ్యాయి కోతులు. దాంతో ఆటోపైన ఒక్క ఎగురు ఎగిరాయి. కంగారుపడిన శంకర్ ఆటోని ఎటు నడపాలో తెలియక, రోడ్డు పక్కనున్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టాడు. నిప్పురవ్వల్ని పూలవర్షంలా కురిపించి స్తంభం నేలకొరిగింది. ఈ క్రమంలో ఆటోమేటిగ్గా నలుగురు వ్యక్తులు గాల్లోకి లేచి దబ్బున కిందపడ్డారు. ఆ నలుగురు మళ్లీ పైకి లేవలేకపోయారు. ఈ ఉత్పాతానికి జడుసుకున్న మర్కట బృందం వెనక్కితగ్గి తిరిగి భేతాళుడిలా చెట్టుని ఆశ్రయించింది.
 
 చుట్టూ జనం కుషన్‌లా ఉండటం వల్ల శంకర్‌కేమీ కాలేదు గానీ ఆటో మూతి ఆంజనేయుడి మూతిలా మారింది. ఈలోగా చుట్టుపక్కల జనం పరిగెత్తుకొచ్చారు. ముందస్తు చర్యగా శంకర్ ఏదో దిక్కుకి పారిపోయాడు. కిందపడిన నలుగురిని ఇంకో నలుగురొచ్చి లేవదీసినా ఎవరికాళ్లపై వాళ్లు నిలబడలేకపోయారు. ఉప్పు మూటల్లా వీపుకి వేసుకుని తోమయ్య దగ్గరికి తీసుకుపోయారు. ఆయన మా లోకల్ డాక్టర్. బెణుకులు, నొప్పులు, కండరాల బిగతీత మాయం చేసే స్పెషలిస్ట్. ఆముదంతో తోమి చేతి చమురు వదిలిస్తాడు. తోమడం వల్ల అందరూ ఆయన్ని తోమయ్య అని పిలుస్తారు. అసలు పేరు ఆయనకి కూడా గుర్తులేదు.
 
 ఉదయాన్నే చేతినిండా పని దొరకడంతో తోమయ్య సంతోషించి రోగుల్ని వరుసగా ఈతచాపలపై పడుకోబెట్టాడు. ఆ చాప నూనె మరకలతో నల్లగా అట్టలు తేలి ముక్కు భరించలేని దుర్వాసన వస్తోంది. నలుగురి వీపుల్ని పరిశీలించి తకతకమని తబలా కొట్టాడు తోమయ్య. వరుసగా కు.. కుయ్యోమని సోడా కొట్టినట్టు సౌండ్ వచ్చింది.  ‘‘లోపల వెన్నెముక బెండ్ అయ్యింది. బెండు తీయాలి. తలా ఐదొందలు అవుతుంది’’ అన్నాడు తోమయ్య. ‘‘కూలికి పోతేనే కుండకాలే బతుకులు కదా. అంతడిగితే ఎట్లా’’ అన్నారు రోగి సహాయకులు.
 
 ‘‘అయితే టవున్‌కి పోండి.’’
 టవున్‌కి పోతే తోమకుండా తోలు వలుస్తారు. ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గరికి పోయి భూమి, ఇల్లు, గొడ్డూగోదా గొర్రెమేకల్ని అమ్ముకున్నవాళ్లు మా ఊళ్లో కొందరున్నారు. అందుకని తోమయ్యతో పదిహేను వందలకి బేరం కుదుర్చుకున్నారు. మందు వేసే ముందు మందు పుచ్చుకోవడం తోమయ్య అలవాటు. ఉదయాన్నే కాఫీ తాగినట్టు క్వార్టర్ తాగి, వీధంతా వినిపించేలా బ్రేవ్‌మన్నాడు. మొదట ఒక రోగి వీపుపై గుప్పెడు ఆముదం పోసి నరాల్ని వీణ తీగెల్లా సవరించాడు. మందు కొంచెం కిక్కిచ్చిన తరువాత, వాడి చేతులు వెనక్కి తిప్పి ఒక కాలు బలంగా వీపుపై అదిమి గట్టిగా లాగాడు. ఎముకలు కటకటమనే సరికి ఆ రోగి అరిచిన అరుపులకి వీధికుక్కలు కూడా భయంతో అంతుచిక్కని దారుల్లో పారిపోయాయి. ఇది చూసి మిగిలిన రోగులు పారిపోవటానికి ప్రయత్నించారు కానీ ఎముకలు సహకరించలేదు.
 
 ఈ చికిత్సా ప్రక్రియ ఇలా జరుగుతూ ఉండగా యాక్సిడెంట్ స్పాట్‌లో ఊళ్లోవాళ్లంతా చేరారు. విరిగిపడిన స్తంభాన్ని చూసి ఇప్పట్లో కరెంట్ రాదని తీర్మానించారు. దాంతో ఆడవాళ్లకు రెండు రకాల సమస్యలొచ్చాయి. ఫ్రిజ్‌లో పెట్టిన దోశపిండి, రెండు రోజుల క్రితం చేసిన కూరల్ని ఎలా సంరక్షించుకోవాలనే రసాయనిక సమస్య, సీరియల్స్ కంటిన్యూటి కోల్పోవడంతో వచ్చే మేధోపరమైన సమస్య.ఇంతలో లైన్‌మన్ నాగరాజు రంగప్రవేశం చేసి స్తంభాన్ని అటు ఇటు కదిలించి పెదవి విరిచారు.
 
 ‘‘గవర్నమెంట్ ప్రాపర్టీ, చాలా పెద్ద కేసు, కేసు తెగితేనే కరెంట్’’ అంటూ ఫోన్ తీసుకుని ‘‘ఆటోహిట్ సార్ పోల్ డౌన్‌ఫాల్. రికవరి చేస్తేనే రిపేరీ’’ అని ఇంగ్లీష్‌లో పైఅధికారికి వివరించాడు.కాసేపటికి హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు బైక్‌పై వచ్చి ఆగాడు. అతని వెంట ఉన్న కానిస్టేబుల్ వినయంగా దిగి, హెడ్ చేతిలో నుంచి బైక్ తీసుకుని స్టాండ్ వేశాడు. ఉదయం నుంచి వెంకటేశ్వర్లు చాలా చిరాగ్గా ఉన్నాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఎవడో తలమాసినోన్ని పెళ్లి చేసుకుంటానని కూతురు పట్టుబడితే ఏం చేయాలో తెలియక తికమకపడుతుండగా ఫోన్ వచ్చింది. స్పాట్‌కి రావాల్సి వచ్చింది.
 
 ‘‘ఈ ఆటో ఎవుడిదిరా’’ కోపంగా అడిగాడు.‘‘శంకర్‌గాడిది, వాడు లేడు పారిపోయాడు’’ అని గుంపులో నుంచి ఎవడో చెప్పాడు.వెంకటేశ్వర్లు సీరియస్‌గా ఆటోని, కరెంట్ పోల్‌ని చూశాడు. తనని చూసి కూడా నిర్లక్ష్యంగా నిలబడి ఉన్న నాగరాజుని చూసి, ‘‘నువ్వెవరు?’’ అని అడిగాడు.‘‘నేను లైన్‌మన్ నాగరాజుని. ఆ ఆటోవరకూ మీ ఇష్టం. ఈ పోల్ టచ్ చేయకండి. ఇది మా ప్రాపర్టీ’’ సెల్‌ఫోన్‌లో వస్తున్న మెసేజ్‌లు చూసుకుంటూ చెప్పాడు నాగరాజు.  ‘‘యాక్సిడెంట్ జరిగితే ఆ స్పాట్ మొత్తం మాకిందకే వస్తుంది. నీకు తెలుసో లేదో తెలుసుకో’’ అన్నాడు వెంకటేశ్వర్లు.
 
 బాస్ మాటలకు వంతపాడుతూ కానిస్టేబుల్, ‘‘బాగా చెప్పినారు సార్’’ అన్నాడు.‘‘రూల్స్ మాకూ తెలుసు’’ అన్నాడు నాగరాజు.‘‘ఏందిరా నీకు తెలిసింది. అతిగా మాట్లాడితే కరెంట్ వైర్లు తీసి చెవుల్లో చెక్కుతా’’ అన్నాడు హెడ్.నాగరాజుకి ఒళ్లు మండింది కానీ తమాయించుకున్నాడు. ‘‘మా ఎఇ వచ్చినాకా చెపుతా నీ సంగతి’’ అన్నాడు మెల్లిగా.హెడ్ ఏదో నోట్‌బుక్ తీసి ‘‘ఎంతమందికి దెబ్బలు తగిలాయి?’’ అని అడిగాడు రాసుకోవటానికి.
 ‘‘నలుగురికి సార్.’’
 
 ‘‘ఏ ఆస్పత్రిలో ఉన్నారు?’’
 ‘‘ఆస్పత్రి కాదు సార్, తోమయ్య దగ్గర ఉన్నారు.’’
 హెడ్ తికమకగా చూసి, ‘‘తోమయ్యా, వాడెవడు?’’ అని అడిగాడు.
 ‘‘ఎముకలు విరిగితే అతికిస్తాడు సార్, అతుక్కుని ఉంటే విరగ్గొడతాడు.’’
 ‘‘ఇది మెడికోలీగల్ కేసు. ఆ తోమయ్యగాడిని ఈడ్చుకుని రాండి.’’
 
 ఓ కుర్రాడు ఉత్సాహంగా బయలుదేరాడు. ఆ సమయానికి తోమయ్య ముగ్గుర్ని తోమి, నాలుగోవాడి పని పడుతున్నాడు. నాలుగోవాడి అరుపులను మిగిలిన ముగ్గురు పేషెంట్లు ఎంజాయ్ చేస్తున్నారు. తోమయ్య ఒక పెద్ద శాస్త్రజ్ఞుడిలా రోగి వీపుని పరిశీలిస్తూ, తడుముతూ ఎముకలకు, నరాలకు ఉన్న తేడాని వివరిస్తూ సడన్‌గా ఒక పట్టుపట్టాడు. కిటకిటమని సన్నని శబ్దంతో పాటు, రోగి బర్రెలా అరిచిన పెద్ద శబ్దం కూడా ఏకకాలంలో వినిపించాయి. ఇదంతా చూసిన కుర్రాడు ఎందుకైనా మంచిదని గుమ్మం నుంచే హెడ్ కానిస్టేబుల్ ఈడ్చుకు రమ్మన్న విషయం చెప్పాడు.
 
 ప్రపంచమంతా ఇగోపైనే నడుస్తున్న ప్పుడు తనను తాను గొప్ప ఎముకల డాక్టర్‌గా భావించే తోమయ్యకు మాత్రం ఇగో ఉండదా?‘‘నేనేం దొంగని కాదు, ఆ గాడ్దెకొడుకునే రమ్మను’’ అని తోమయ్య తన పనిలో తాను పడ్డాడు.ఆ కుర్రాడు వెళ్లి, ‘‘ఏం పీక్కుంటాడో పీక్కోమను ఆ గాడ్దెకొడుకుని అన్నాడండి’’ అని చెప్పాడు.తోమయ్య ఇంటి ముందు హెడ్ బైక్ ఆగింది. అదే సమయానికి భార్య నుంచి ఫోన్.‘‘ఫేస్‌బుక్ వాడితో పెళ్లి చేయకపోతే మౌనపోరాటం చేస్తుందట.’’ఎవడో ఒకన్ని అర్జెంట్‌గా తన్నకపోతే హెడ్‌కి పిచ్చెక్కేలా ఉంది. ఆ రోగి పక్కటెముకలపై మృదంగం వాయిస్తున్న తోమయ్యని చూసి ‘‘నువ్వే నా తోమయ్యా?’’ అని అడిగాడు. తోమయ్య తలవూపాడు.
 
 ‘‘ఏంరా కొడకా, మదమెక్కిందా, పిలిస్తే రానన్నావట’’ అంటూ ఏం జరిగిందో తోమయ్య తెలుసుకునేలోగా లాఠీతో నాలుగు పీకాడు. తోమయ్య పిక్కలపై రెండు, పిర్రలపై రెండు కుడుములు లేచాయి. నొప్పితో తోమయ్య గావుకేకలు పెట్టాడు. అప్పటివరకూ తమతో కేకలు పెట్టించిన తోమయ్య చివరికి తమకంటే పెద్దగా కేకలు పెట్టడం విని అక్కడున్న రోగులకి ఏదో తెలియని ఆనందం, సడన్‌గా లాఠీతో ప్రత్యక్షమైన పోలీసు వల్ల భయం ఒకేసారి కలిగాయి. అయితే ఆ క్షణంలో ఒక శక్తి స్వరూపం ప్రత్యక్షమైంది. ఆమె తోమయ్య భార్య.
 
 ఆమెకి చట్టం, న్యాయం, ధర్మం ఈ మూడు సింహాల గురించి తెలియదు. ఎందుకంటే ఆమే ఒక సింహం. కానీ గంగి గోవంత మెతగ్గా ఉంటుంది. గొడ్డు చాకిరీ చేస్తుంది. ఉదయం నాలుగుకి లేచి పేడ కసువు వూడ్చి బర్రెలకు ఒళ్లు కడుగుతుంది. పొదుగుకి దండం పెట్టి పాలు పితుకుతుంది. పాలకేంద్రానికి వెళ్లి పోస్తుంది. గడ్డి కోస్తుంది. పనులుంటే కూలికెళుతుంది. టవున్‌లో చదువుకుంటున్న ఇద్దరు బిడ్డలకి రూపాయి తక్కువ లేకుండా డబ్బు పంపుతుంది. తాగడం, తోమడం తప్ప తోమయ్యకేమీ రాదు. దానివల్ల ఇల్లు గడవదు. కష్టం తప్ప మరేమీ తెలియని ఆమెకి కోపమొస్తే ఒళ్లంతా కొమ్ములు మొలుస్తాయి. ఆమెకి భయపడి సన్యాసుల్లో కలిసిపోవటానికి మూడుసార్లు తోమయ్య కాశీ పారిపోయాడు. గంగలో మునిగి తేల్చి మరీ లాక్కొచ్చింది. తనింటికొచ్చి తన మొగున్ని కొట్టడాన్ని చూసిన ఆమె వెంటనే కొడవలి అందుకుని, ‘‘ఎవుర్రా మీరు కొడకల్లారా’’ అని అరిచింది. ఆ గర్జనకి రోగుల సహాయకులు ఎప్పుడు ఎలా పారిపోయారో వాళ్లకే తెలియదు. రోగులు పారిపోలేరు కాబట్టి గోడవారన గజగజ వణుకుతూ కూచున్నారు.
 
 తన సర్వీసులో ఎందరో గూండాలు, రౌడీలను చూశాడు కానీ, ఇలాంటి స్త్రీమూర్తిని ఎన్నడూ హెడ్డు చూడలేదు. నిస్సందేహంగా కొడవలితో తన పీక కత్తిరించి తీరుతుందని అనుమానించి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ ఇంటి జియాగ్రఫీ తెలియకపోవడం వల్ల తోమయ్య తన పరిశోధనార్థం వుంచుకున్న చమురు గిన్నెపై కాలు వేశాడు. ఏదో వెహికల్‌పై వెళుతున్న అనుభూతిని పొందిన తరువాత హెడ్డు కళ్లముందు తమ యూనిఫారాలకి తగిలించుకునే నక్షత్రాలు కోకొల్లలుగా కనిపించాయి.
 
 అతనితో పాటు వచ్చిన కానిస్టేబుల్ పిక్కబలంతో సుదూరం వెళ్లి స్టేషన్‌కి ఫోన్ చేశాడు.
 ‘‘సార్, హెడ్డ్ సార్‌పై దాడి జరిగింది. అర్జెంట్‌గా ఫోర్స్ పంపండి’’ అని ఎస్‌ఐకి చెప్పాడు. టవున్ దగ్గరే కాబట్టి వెంటనే ఇన్నోవా వచ్చి ఆగింది. నలుగురు పోలీసులు తుపాకీలతో బూట్లు దడదడలాడించుకుంటూ దిగారు. దిగడమైతే దిగారు కానీ వాళ్లకు కూడా భయంగానే ఉంది. ఎందుకంటే వాళ్ల దగ్గరున్నది పేరుకే తుపాకులు కానీ అవి పేలగా ఎవరూ చూడలేదు. ట్రిగ్గర్ నొక్కితే కాదు కదా, ఒక బండరాయితో మోదినా అవి పేలవు. అవి ఏ కాలం నాటివో పురావస్తు శాస్త్రవేత్తలు కూడా తెలుసుకోలేరు.
 
 ఇదంతా జరుగుతూ ఉండగా లైన్‌మన్ నాగరాజు విరిగిపోయిన పోల్ వద్ద కూచుని సెల్‌ఫోన్‌లో బూతుబొమ్మలు చూస్తూ తన లోకంలో తానున్నాడు. హెడ్డు వెంటవున్న కానిస్టేబుల్‌కి మొదట ఈ లైన్‌మన్‌ని తన్నాలనే కోరిక పుట్టింది.‘‘ముందు వీడిని నాలుగు కుమ్మండి, డిపార్ట్‌మెంటంటే లెక్కలేకుండా మాట్లాడుతున్నాడు’’ అన్నాడు. వెంటనే నాగరాజుకి ‘సయ్ సయ్’ అని లాఠీలు గాల్లోకి లేచిన సౌండ్ వినిపించింది. ఎక్కడికి పారిపోవాలో తెలియక, పోల్ ఎక్కే అలవాటు కొద్దీ దగ్గర్లోని మర్రిచెట్టు ఎక్కేశాడు.
 
 ఆ సమయానికి కోతుల గుంపు పేన్లు చూసుకుంటూ ముచ్చట్లాడుకుంటూ చెట్టుపై ఉన్నాయి. అతివేగంగా చెట్టెక్కిన నాగరాజుని చూసి జడుసుకుని అవి ‘యాహూ’ అంటూ నాగరాజుపైకి దూకాయి. కింద పోలీసులు, పైన కోతులు, దాంతో గరాజు టార్జాన్‌లాగా వూడలకి వేలాడుతూ దబ్బున కిందపడ్డాడు. తోమయ్యకి కొత్త కేసు దొరికింది. నాగరాజు సంగతి చూసిన తరువాత పోలీసులు తోమయ్య ఇంటికి బయలుదేరారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే కింద పడిన హెడ్డుకి మెలకువ వచ్చింది.
 
 శరీరంలో ఏదో కెమెరా అమర్చినట్టు కదిలితే చాలు క్లిక్ క్లిక్‌మని సౌండ్ వస్తోంది. ప్రమాదంలో ఉన్న హెడ్డుని చూసి తన ప్రత్యర్థిని కూడా భావించకుండా హెడ్ చొక్కా తీసేసి ఆముదంతో ఒక్కపట్టు పట్టాడు. హెడ్డు గావుకేకలు పెడుతుండగా పోలీసులు ప్రవేశించారు. తోమయ్య భార్య శక్తి గురించి ముందే తెలియడం వల్ల ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లతో సహా వచ్చారు.తోమయ్య భార్య ఏ ఆయుధం అందుకోకముందే ఆమె చేతుల్ని గట్టిగా పట్టేశారు. భార్యాభర్తల్ని స్టేషన్‌కి తీసుకెళ్లారు.
 
 వాళ్ల వెంబడే మా వూరి సర్పంచ్, నలుగురు పెద్దమనుషులు వెళ్లి ఆ దంపతులని బెయిల్‌పై విడిపించారు. తోమయ్య భార్య తిట్టిన బూతులకి ఎస్‌ఐ సెలవుపై వెళ్లగా, సర్పంచ్ రెండు రోజులు జబ్బుపడ్డారు. కరెంట్‌వాళ్లకి పోలీసులకి జరిగిన గొడవలో మా ఊళ్లో పదిరోజులు కరెంట్ లేకుండా పోయింది. లైన్‌మన్ నాగరాజుతో సహా తోమయ్యతో తోమించుకున్నవాళ్లంతా చాలాకాలం వూళ్లో పురావస్తు మానవుల్లా నేలపై సగం వంగి దోగాడుతూ సంచరించారు.
 
 ఇదిలా వుండగా సర్పంచ్ పెద్దమనసుతో కోతులు పట్టేవాన్ని పిలిపించాడు. వాడు కోతికి రెండొందలు అడిగాడు. మా పిసినారి సర్పంచ్ కోతికి యాభై ఇస్తానన్నాడు. దాంతో వాడికి కోపమొచ్చి పక్కవూళ్లో పట్టిన కోతుల్ని ఓ అర్ధరాత్రి తెచ్చి మావూళ్లో వదిలాడు. పాతకోతులు లోకల్, కొత్తకోతులు నాన్‌లోకల్‌గా తమను తాము వర్గీకరించుకుని భీకర యుద్ధాలు మొదలుపెట్టాయి. దాంతో వూళ్లో క్షతగాత్ర శిబిరాలు వెలిశాయి. ఇక కోతుల దెబ్బకి ఆటో శంకర్ ఎంత భయపడ్డాడంటే ఏకంగా ఆంజనేయస్వామి మాల వేశాడు. కోతి కనిపిస్తే చాలు హనుమ హనుమ అని అరుస్తున్నాడు.
 
 కోతుల వల్ల ఓటర్లు చేజారిపోతారని భయపడిన సర్పంచ్ ఎలాగోలా కోతులవాన్ని బతిమలాడి రప్పించాడు. కోతుల సంఖ్య చూసి వాడు జడుసుకుని ‘‘ఇన్నింటిని వలతో పట్టడం సాధ్యం కాదని, కొండ ముచ్చులంటే కోతులకి చచ్చేంత భయమ’’ని చెప్పి ఎక్కడినుంచో నాలుగు కొండముచ్చుల్ని తెచ్చాడు. తెల్లటి జుత్తు, నల్లటి మూతి, వాటిని చూసి కోతులు కెవ్వుకేక. కిచకిచమంటూ పరారీ. అయితే కోతులు రౌడీషీటర్లయితే, కొండముచ్చులు ఉగ్రవాదులు. వీటిని ఎలా వదిలించుకున్నామో తరువాత చెబుతా. అది వేరే కథ!        
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement