‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ... గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు నటనకు అవకాశం ఉన్న పాత్రలు కూడా అవలీలగా చేస్తూ ‘భేష్’ అనిపించుకుంటోంది. ‘పింక్’లాంటి సినిమాలతో బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటిన తాప్సీ అంతరంగ తరంగాలు...
ఒక్క జీవితంలో...
సినిమాల్లోకి రావాలని, నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. సినిమాల్లోకి రావడం యాదృచ్ఛికంగా జరిగింది. ‘ఇదేదో కొత్తగా ఉంది. ప్రయత్నించి చూద్దాం’ అని ప్రయత్నించాను. అలా ప్రయత్నించినప్పుడు బాగుంది అనిపించింది., అంతేకాని ‘నా తుదిశ్వాస వరకు నటించాలని ఉంది’ స్థాయి ప్యాషన్ అయితే నాకు లేదు.
ప్రపంచస్థాయి నటి కావాలి అని కూడా ఎప్పుడూ కల కనలేదు.
ఈ ఒక్క జీవితంలోనే ఎన్నో చేయాలని ఉంది. అందులో నటన కూడా ఒకటి అనుకుంటాను తప్ప... నా యావజ్జీవితాన్ని నటనకే అంకితం చేయాలని అనుకోను.
బోనస్
నన్ను మార్చేంత ‘దృశ్యం’ సక్సెస్‌కు లేదు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఆ మాటకొస్తే నా కెరీర్ మొదట్లో చేసిన ఒక తమిళ చిత్రానికి ఆరు నేషనల్ అవార్డులు వచ్చాయి! ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? బాలీవుడ్‌లో అడుగు పెట్టడానికి ముందు సక్సెస్, ఫెయిల్యూర్‌లను సమానంగా చూశాను. అందుకే సక్సెక్ వచ్చినప్పుడు మేఘాల్లో తేలిపోను. ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు పాతాళానికి కుంగిపోను.సక్సెస్‌ను బోనస్ అనుకుంటానే తప్ప తలకు ఎక్కించుకోను.
చేస్తున్న పనిని తప్ప... సక్సెస్,ఫెయిల్యూర్‌లను సీరియస్‌గా తీసుకునే రకం కాదు నేను. ఒకేరకమైన పాత్రలు చేస్తే ప్రేక్షకులకు మొహం మొత్తుతుంది. అందుకే 20 నిమిషాల పాత్ర అయినా సరే... నచ్చితే చేస్తాను.
కంఫర్ట్ జోన్
స్కూల్లో హాజరు బొటాబొటిగా ఉన్నపటికీ మార్కులు మాత్రం బ్రహ్మాండంగా వచ్చేవి. ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో పని చేస్తూ బిజీగా ఉండేదాన్ని.‘కంఫర్ట్ జోన్’లో ఎక్కువ కాలం ఉండడానికి ఇష్టపడను. ఆ జోన్‌లోనే ఉంటే జీవితం స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుంది.
నా బుర్రలో ఎన్నో ఐడియాలు ఉన్నాయి, వాటిని ఆచరణలో పెట్టదగినంత సాహస ప్రవృత్తి కూడా నాలో ఉంది!
సింపుల్‌గా...
నా చుట్టూ బాడీగార్డులు ఉండాలని, నేను కారు నుంచి దిగగానే అభిమానులు చుట్టుముట్టాలని అనుకోను. ఖరీదైన జీవితం గడపాలని లేదు. నిరాడంబరంగా జీవించడం అంటేనే ఇష్టం. ఇప్పటికీ ఢిల్లీలో మెట్రోస్‌లో ప్రయాణిస్తాను. ముంబైలో అవసరమైతే నార్మల్ క్యాబ్‌లో వెళతాను.
Comments
Please login to add a commentAdd a comment