టారో : 12 జూన్ నుంచి 18జూన్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఆశను విడనాడకండి. పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకోండి. కాలమే అన్ని గాయాలనూ మాన్పుతుంది. పనులు వాటంతట అవే పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో నిజాయతీగా వ్యవహరించండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. మీ నిబద్ధతే ఈ వారం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది.
లక్కీ కలర్స్: నీలం, ఊదా
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకోగలుగుతారు. సన్నిహితుల్లో ఒకరు మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. అయితే, మీరు ప్రేమించిన వారితో మీ బంధం బలపడుతుంది. అనుకోని సంఘటనలు జరిగినా, సీరియస్‌గా పట్టించుకోకండి. ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావచ్చు.
లక్కీ కలర్స్: ఆకుపచ్చ, పసుపు
మిథునం (మే 21 - జూన్ 20)
మొండిబకాయిలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. ఇంటా బయటా పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. కొత్త ఇల్లు కట్టడం లేదా ఇంటి పునర్నిర్మాణం చేయడం వంటి పనులు చేపడతారు. ఆత్మీయులతో ప్రేమానుబంధాలు బలపడతాయి. అవివాహితులకు వివాహానికి అనుకూలమైన కాలం.
లక్కీ కలర్: నీలం
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
అన్ని రంగాల్లోనూ పూర్తి అనుకూలమైన కాలం. మంచి అవకాశాలు మీ తలుపు తడతాయి. కొత్త జీవితానికి నాందీ ప్రస్తావన జరుగుతుంది. గతాన్ని మరచి ముందుకు సాగుతారు. ఆటవిడుపుగా కాలం గడుపుతారు. చిన్న చిన్న సరదాలు తీర్చుకునేందుకు తగిన తీరిక దొరుకుతుంది. విద్యార్థులకు, పరిశోధకులకు అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: లేత నారింజ
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
చక్కని మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఒప్పందాలకు అనుకూలమైన కాలం. ప్రముఖులను కలుసుకుంటారు. ఇతరుల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా స్వీకరించి, మీదైన వివేకంతో ముందుకు సాగుతారు. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో సవాళ్లు ఎదురవుతాయి. సృజనాత్మకమైన పనుల్లో నిమగ్నమవుతారు.
లక్కీ కలర్స్: తెలుపు, మీగడరంగు
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
సంపద సమకూరుతుంది. ఉద్యోగపరంగా సానుకూలమైన మార్పులు జరుగుతాయి. మీరు కలలు కన్న ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కొత్త అనుబంధం బలపడుతుంది. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు సమయం వెచ్చిస్తారు. వ్యాయామంపై దృష్టి సారించాల్సి ఉంటుంది.
లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
మరింత అవగాహన పెంచుకుంటారు. విషయాలను కూలంకషంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ వారంలో ధ్యానానికి సమయం కేటాయించడం మంచిది. చాలారోజులుగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యుల కోసం మరింత కాలాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
లక్కీ కలర్స్: ఎరుపు, నలుపు
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
కుటుంబ సభ్యులతోను, బంధుమిత్రులతోను ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. సమస్యలకు పరిష్కారం మీ ఆలోచనల్లోనే స్ఫురిస్తుంది. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఇంటా బయటా సమతుల్యతను సాధిస్తారు. ఖర్చులను అదుపు చేసుకుంటారు. మీ ప్రయత్నాలన్నింటిలోనూ కుటుంబ సభ్యుల నుంచి, బంధుమిత్రుల నుంచి తగిన సహాయ సహకారాలు అందుతాయి.
లక్కీ కలర్: గోధుమరంగు
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
ఆత్మీయానుబంధాలలో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో చొరవ తీసుకుని ముందంజ వేస్తారు. డోలాయమానంగా ఉన్న పరిస్థితులు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధిస్తారు. కెరీర్ పరంగా మంచి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. విశ్రాంతి కోసం విహార యాత్రలకు వెళతారు.
లక్కీ కలర్: ఊదా
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
జీవితంలో మెరుగైన మార్పులు సంభవిస్తాయి. కోరుకున్నవి క్రమంగా అందుబాటులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. కెరీర్ పరంగా పలుకుబడి గల వ్యక్తులను కలుసుకుంటారు.బంధువుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమాను బంధాలలో పొరపొచ్చాలు తలెత్తవచ్చు.
లక్కీ కలర్: నీలం
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
సమస్యల సుడిగుండం నుంచి బయటపడతారు. ఆచితూచి ఒక అడుగు వెనక్కు వేసి, కొంత విరామం తీసుకుంటారు. మరీ అలసట చెందేంతగా పనులను నెత్తిన వేసుకోవద్దు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. తీరికవేళల్లో ఆరుబయట గడపడం ద్వారా నూతనోత్సాహం పొందుతారు. ప్రేమలో పడతారు. తొందరపడకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
లక్కీ కలర్: గులాబి
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
మీ జీవితంలో ముఖ్యమైన దశను విజయవంతంగా ముగిస్తారు. అర్థవంతమైన పనులు సాధించాలని తపన పడతారు. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరుల్లో స్ఫూర్తి కలిగిస్తారు. చెక్కుచెదరని మీ సానుకూల దృక్పథమే మిమ్మల్ని విజయ పథంలో నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. శ్రమకు తగిన ప్రతిఫలితాలను అందుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు.
లక్కీ కలర్: ఆకుపచ్చ
- ఇన్సియా, టారో అనలిస్ట్