టారో : 10 జూలై నుంచి 16జూలై, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
జీవితమే ఒక మిస్టరీ అన్నట్లుగా సాగుతుంది. ఏదీ నిశ్చితంగా ఉండదనే విషయం అర్థమవుతుంది. ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ వారంలో జీవిత భాగస్వామితో నిజాయతీగా వ్యవహరించడం మంచిది. రహస్యాలు దాచినట్లయితే, సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. వదంతులు కలవరపెడతాయి. వాటిని నమ్మకపోవడమే క్షేమం.
లక్కీ కలర్: ఆకాశనీలం
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్థైర్యం కోల్పోకుండా ఎదుర్కొంటారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. మీపై అసూయ పెంచుకున్న ఒక సహోద్యోగి మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో పొరపొచ్చాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: లేత పసుపు
మిథునం (మే 21 - జూన్ 20)
ప్రేమికుల మధ్య స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంబంధించిన సంఘర్షణలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో భాగస్వాములకు స్వేచ్ఛనివ్వడమే మేలనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. పని ప్రదేశంలో లేదా ఉద్యోగంలో మార్పులు సంభవించవచ్చు. ఈ మార్పుల ఫలితంగా మీరు కెరీర్‌లో ఒక మెట్టు పైకి ఎదిగే అవకాశాలు ఉంటాయి.
లక్కీ కలర్: చాక్లెట్ రంగు
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. మీ ఘనతకు గుర్తింపుగా సన్మాన సత్కారాలు అందుకుంటారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల నుంచి తప్పించుకుంటారు. మృత్యుముఖం నుంచి తేలికగా బయటపడతారు.
లక్కీ కలర్: గులాబి
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
ఈ వారం మొత్తం ఒక పండుగలా సందడి సందడిగా గడిచిపోతుంది. బంధు మిత్రులు మీ చుట్టూ చేరడానికి ఆసక్తి చూపుతారు. మంచి చెడులను పట్టించుకోకుండా అన్ని పరిణామాలనూ ఆస్వాదిస్తారు. విహార యాత్రల కోసం దూరప్రయాణాలు చేస్తారు. ఈ వారంలో ఒక ఆసక్తికరమైన మనిషిని కలుసుకుంటారు.
లక్కీ కలర్: బూడిద రంగు
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
సంతోషంగా ఉండాలని ఎంతగా అనుకుంటున్నా పరిస్థితులు సంతోషంగా ఉండనివ్వడం లేదనే భావనతో బాధపడతారు. సంతోషంగా ఉండాలా? లేక బాధపడాలా? అనేది మీ చేతుల్లోనే ఉంటుందని తెలుసుకుంటారు. పిల్లలపై దృష్టి సారించాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. ఉన్నత విద్యావకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్: ఊదా
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
స్వయంకృషితో జీవితాన్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మలచుకుంటారు. అవరోధాలలోనే అవకాశాలను అందిపుచ్చు కుంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, సత్ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న పొరపొచ్చాలు తలెత్తినా, చాకచక్యంగా వాటిని పరిష్కరించుకుంటారు.
లక్కీ కలర్: లేత ఊదా
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
పనిలోనే సంతోషాన్ని వెతుక్కుంటారు. ప్రతి పనినీ చెదరని ఏకాగ్రతతో సంతోషంగా పూర్తి చేస్తారు. తీరిక వేళల్లో ధ్యానంలో గడుపుతారు. అనుకోకుండా ఒక అపరిచితుని ద్వారా సాయం అందుకుంటారు. అనూహ్యమైన మార్పులు ఎదురవుతాయి. పని విషయంలో చివరి నిమిషంలో తలపెట్టిన మార్పులతో విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు.
లక్కీ కలర్: ఆకుపచ్చ
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
ఈ వారంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. మీ ఆకాంక్షలు, లక్ష్యాల విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. ప్రతి నిమిషాన్నీ సంతోషభరితంగా గడిపేందుకు తాపత్రయ పడతారు. ఏదైనా ముఖ్యమైన సదస్సు లేదా సమావేశానికి ఆహ్వానాన్ని అందుకుంటారు. నాయకత్వ పటిమను చాటుకుంటారు. క్రమశిక్షణతో ఫలితాలు సాధిస్తారు.
లక్కీ కలర్: ముదురు ఊదా
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
జీవితం సుఖదుఃఖాల సమ్మేళనం అని గ్రహిస్తారు. సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తారు. స్వేచ్ఛ కోసం తపిస్తారు. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ధైర్యంగా ముందంజ వేస్తేనే సత్ఫలితాలను సాధించగలరు. ఇతరులతో ఘర్షణలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పిల్లల ద్వారా సంతోషం పొందుతారు.
లక్కీ కలర్: లేత ఆకుపచ్చ
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
విపత్కర పరిస్థితుల్లో మీ ధైర్యసాహసాలను నిరూపించుకుంటారు. మిమ్మల్ని ఎవరూ తక్కువగా అంచనా వేయలేని పరిస్థితులు ఉంటాయి. బంధు మిత్రులకు, సహోద్యోగులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. మీ శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి.
లక్కీ కలర్: లేత నారింజ
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
ఏదీ ఎంపిక చేసుకోవాలనుకోవద్దు. ఎంపిక చేసుకున్న కొద్దీ మీ అవకాశాలు సన్నగిల్లిపోతాయి. పెట్టుబడుల విషయంలో కొద్ది నెలల కిందట తీసుకున్న నిర్ణయం వల్ల భారీ లాభాలు అందుకుంటారు. తలపెట్టిన ప్రతి పనిలోనూ అదృష్టం కలిసొస్తుంది. మితిమీరిన పనిభారంతో సతమతమవుతారు. ప్రేమ వ్యవహారాల్లో సమతుల్యతను పాటించాల్సి వస్తుంది.
లక్కీ కలర్: లేత ఆకుపచ్చ
- ఇన్సియా, టారో అనలిస్ట్