మన చార్మినార్‌ ఇరాన్‌లోనూ ఉంది | There Is No Irani Chai In Iran But Have A Beautiful Charminar | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో ఇరానీ చాయ్‌ లేదు

Published Sun, Feb 16 2020 12:26 PM | Last Updated on Sun, Feb 16 2020 12:28 PM

There Is No Irani Chai In Iran But Have A Beautiful Charminar - Sakshi

ట్రంపిజమ్‌–2 లోగోగా శంకర్‌ గీసిన క్యారికేచర్‌

ఇరాన్‌ కార్టూన్‌ అసోసియేషన్‌ వాళ్లు ఈసారి ‘ట్రంపిజమ్‌–2’ కార్టూన్స్‌ అండ్‌ క్యారికేచర్‌ పోటీ పెట్టారు. ప్రపంచంలోని ఇప్పటి కార్టూనిస్టులందరూ ఏదో సందర్భంగా ట్రంప్‌ మీద కార్టూన్లు, క్యారికేచర్లు గీసే ఉంటారు. అలా నేనూ ఓ పది క్యారికేచర్లు, యాభై కార్టూన్లు గీశాను. వాటిలో కొన్నింటిని సెలెక్ట్‌ చేసి, పోటీకి పంపుదామని సిద్ధపడుతుంటే, ‘మిమ్మల్ని ఈ పోటీకి అంతర్జాతీయ జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా అనుకున్నాం. మీరు ఒప్పుకుంటే సంతోషం’ అని మెయిలొచ్చింది. ఇరాన్‌ నుంచి ఆహ్వానం అందడం ఇది రెండోసారి. ఇదివరకు 2017లో కూడా జ్యూరీ సభ్యుడిగా వెళ్లాను. మళ్లీ ఇలా పిలుస్తారని ఊహించలేదు. ఇరాన్‌ను ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాల్సింది మిగిలే ఉంటుంది. ముఖ్యంగా అక్కడి పోటీ సంస్కృతి, ఆర్ట్, ఫిల్మ్, ఫొటోగ్రాఫర్లు, డాక్టర్లు ఎంతో అద్భుతం. హైదరాబాద్‌లో జరిగే చిల్డ్రన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గోల్డెన్‌ ఎలిఫెంట్‌ను ఎన్నోసార్లు గెలుచుకుంది ఇరాన్‌. అలాగే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా పలు అవార్డులు ఇరాన్‌ సినిమాకు సొంతం. నాకైతే పర్షియన్‌ కార్పెట్‌ ఏనిమేటెడ్‌ మూవీ ఎంతో ఇష్టం.

ప్రస్తుత ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ఇరానీలు తమదైన ముద్ర వేసుకుంటున్నారు. అంతర్జాతీయ కార్టూన్, క్యారికేచర్‌ పోటీల్లోనైతే మొదటి మూడు అవార్డుల్లో ఇరాన్‌ పేరు తప్పక ఉంటుంది. నేను ఈ స్థాయిలో ఉండటంలో కూడా ఇరాన్‌ కార్టూన్‌ పాత్ర కీలకం.
గతంలో అంటే 2002, 2003 ప్రాంతంలో ఆ వెబ్‌సైట్‌ చూడటానికి ఇంటర్‌నెట్‌ సెంటర్‌కు వెళ్లి గంటకు యాభై, అరవై రూపాయలు చెల్లించేవాడిని. వారు నిర్వహించే పోటీల్లో పాల్గొనడానికి చాలాసార్లు ప్రయత్నించాను. చివరకు ఓ పదేళ్ల తర్వాత ఒక బహుమతి పొందడం ఒక తీయని అనుభూతి.
ఇరాన్‌ కార్టూన్‌ అసోసియేషన్‌ వాళ్లు 2009లో ఓ అంతర్జాతీయ పోటీ నిర్వహించారు. కార్టూన్, క్యారికేచర్‌ పోటీలు, ప్రదర్శనలను వాళ్లు ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకమైన అంశంతో నిర్వహిస్తుంటారు.

ఇరాన్‌లో రెండవ శక్తిమంతమైన వ్యక్తి అయిన జనరల్‌ సులేమాన్‌ అమెరికా బలగాల ద్రోన్‌ దాడిలో మరణించడంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. అయినా, ఇరాన్‌కు పోదామని రెడీ అవుతుంటే కొలీగ్స్, దోస్తులు వద్దు అని వారించారు. అక్కడి నిర్వాహకులు మాత్రం ‘ఫర్వాలేదు వచ్చేయమ’ని నాకు భరోసా ఇచ్చారు.  టికెట్స్‌ రెడీ. పైగా ట్రంప్‌ మీద కార్టూన్‌ కాంపిటీషన్‌... చివరకు కచ్చితంగా వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. అసలు ఈ సమయంలోనే ఇరాన్‌ వెళ్లి ట్రంప్‌ కార్టూన్‌ ఫెస్టివల్‌లో పాల్గొని నైతికంగా మద్దతు ఇవ్వాలనిపించింది.
7.01.2020 సాయంత్రం 6.30 గంటలకు అల్‌ ఖొమైనీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దిగగానే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఫెస్టివల్‌ డైరెక్టర్‌ సయ్యద్‌ మసవుది నన్ను ఆప్యాయంగా హగ్‌ చేసుకుని పూల బొకేలతో ఆహ్వానం పలికారు.
ఇరాన్‌లో వీకెండ్స్‌ గురు, శుక్రవారాలు సెలవులు. పొద్దున్నే ‘టెహ్రాన్‌ టైమ్స్‌’ ఆఫీసుకు పోయాం. అక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నారు.  మధ్యాహ్నం విజువల్‌ ఆర్ట్స్‌ సెంటర్‌కు వెళ్లి అక్కడున్న పెద్ద ఆర్ట్‌ స్టూడియోలోకి వెళ్లాం. అందులో ఒకే ఒక మినియేచర్‌ ఆర్టిస్టు ఉన్నారు. అతనితో కాసేపు ముచ్చటించి విషయాలు అడిగి తెలుసుకున్నాను. ఖురాన్‌ నుంచి కొన్ని సూక్తులను పర్షియన్‌ కాలిగ్రఫీ స్టైల్‌లో వర్క్‌ చేస్తున్నారు. స్టూడియోలో మిగతా ఆర్టిస్టులు జనరల్‌ సులేమానీని వివిధ రకాలుగా చిత్రించిన చిత్రాలు ఉన్నాయి. సెలవులు కావడంతో చాలామంది ఆర్టిస్టులు రాలేదని చెప్పారు.

జ్యూరీ సభ్యులు, అవార్డు విన్నర్స్‌తో శంకర్‌ 

ప్రపంచంలోనే ఎల్తైన ఆరవ టవర్‌
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్లలో ఆరవదైన మిలాద్‌ టవర్‌ను ఎక్కాం. దాని ఎత్తు 3,435 మీటర్లు. పైన మూడు మ్యూజియంలను కూడా ఏర్పాటు చేశారు. అందులో పర్షియన్‌ కవి ఫిరదౌసి శిల్పం కూడా ఉంది. మొదటి మ్యూజియంలో వివిధ నమూనాల్లోని పురాతన వస్తువులు ఉన్నాయి. రెండో మ్యూజియంలో ఇరాన్‌లోనే అతి పురాతన శిల్పం ఒకటి ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచారు. ప్రఖ్యాత ఇరానీ చిత్రకారులు చిత్రించిన కొన్ని ఇలస్ట్రేషన్స్‌ అక్కడ ఉన్నాయి. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, దయ, ప్రేమ వంటి అంశాలతో ప్రత్యేకమైన మెటల్‌తో ఆ చిత్రాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి.

తర్వాత నేను, మిత్రుడు జితేత్‌ కొస్తానా బస చేసిన హోటల్‌లో రాత్రి డిన్నర్‌ వన్‌ బై టూ చేసి పడుకున్నాం. అక్కడ కబాబ్‌ చాలా ఫేమస్‌. కాని, అంత క్వాంటిటీ సింగిల్‌గా తినలేక లంచ్, డిన్నర్‌ వన్‌ బై టూ తినేవాళ్లం. మంచినీళ్లు మాత్రం చిన్న చిన్న సీసాల్లో ఇచ్చేవారు. టెహ్రాన్‌కు ఒక పక్కన ఎత్తయిన మంచు కొండలు ఉన్నాయి. ఆ కొండల్లోని ఒక కొండ పేరున్న పేరుతో వాటర్‌ బాటిల్స్‌ ఉండేవి. వాటిపై ‘నాన్‌ కార్బోనేటెడ్‌’ అని రాసి ఉంది. ఇరాన్‌లో లిక్కర్, ఫేస్‌బుక్‌పై బ్యాన్‌ ఉంది. 

తెల్లారే ‘ట్రంపిజమ్‌–2’ క్లోజింగ్‌ సెరిమనీ. ‘ఇస్లామిక్‌ రివల్యూషన్‌ అండ్‌ హోలీ డిఫెన్స్‌ మ్యూజయం’ వేదిక. అక్కడకు వెళ్లే సరికి పోస్టర్లు, ప్రెస్‌మీట్‌ వేదిక, సెరిమనీ వేదిక, నేను గీసిన ట్రంప్‌ క్యారికేచర్‌తో ముస్తాబు చేశారు. వేదిక మీద కార్యక్రమం జరుగుతుంటే పక్కన ఒక ఇరానీ ఆర్టిస్టు జనరల్‌ సులేమానీ పెయింటింగ్‌ వేస్తున్నారు. ఆ స్టేజ్‌పైన నేను ట్రంప్‌ మీద గీసిన క్యారికేచర్‌ వీడియోను ప్రదర్శించారు. ఆ కార్యక్రమానికి అవార్డు విన్నర్స్, ప్రముఖ కార్టూనిస్టులు, అక్కడి ప్రముఖులు, మిలటరీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అవార్డు విన్నర్స్‌తో పాటు నాకు జ్యూరీ అవార్డు ఇచ్చి సత్కరించారు.

బయటి హాలులో ప్రదర్శన ఏర్పాటు చేశారు. బయట చాలామంది ఇరానియన్‌ కార్టూనిస్టు మిత్రులు ఉన్నారు. వారితో కాసేపు మాట్లాడి, ఫొటోలు దిగాం. వారి బుక్స్‌ నాకు, నా బుక్స్‌ వారికి ఇచ్చి పుచ్చుకున్నాం. అదేరోజు టెహ్రాన్‌ నుంచి ఇస్‌ఫహాన్‌కు ఫ్లైట్‌లో వన్‌ అవర్‌ జర్నీ. అసలు ఇరాన్‌ అంతటికీ, ఇంకా చెప్పాలంటే ప్రపంచానికంతటికీ ఇరాన్‌ హ్యాండీక్రాఫ్ట్స్, కార్పెట్స్‌ అక్కడి నుంచే వెళతాయని అక్కడకు పోయేదాకా తెలియదు. అక్కడ అద్భుతమైన కళాకారులు, చిత్రకారుల వర్క్‌ చూసే అదృష్టం కలిగింది.

కల తీరింది
ఎప్పట్నుంచో వెబ్‌లో చూడటం తప్ప నిజంగా ఇరాన్‌ కార్టూన్‌ హౌస్‌ను చూడాలనే కోరిక తీరింది. అక్కడ ప్రపంచంలోనే ప్రముఖులైన కార్టూనిస్టుల ఒరిజినల్‌ డ్రాయింగ్స్‌ చూసే అదృష్టం దక్కింది. చాలాసేపు ఒరిజినల్స్‌ చూడటం, ఇరాన్‌ కార్టూన్స్‌కు వచ్చిన అవార్డులు, వారు ప్రచురించిన అనేక కార్టూన్, క్యారికేచర్‌ ఆల్బమ్స్‌ను చూశాను. అందులో సయ్యద్‌ మసవుది గీసిన ఎలిఫెంట్‌ కార్టూన్‌ పెయింటింగ్‌ అద్భుతం. సయ్యద్‌ మసవుది హౌస్‌ ఆఫ్‌ ఇరాన్‌ కార్టూన్‌కి డైరెక్టర్‌ కూడా. మసవుది కార్టూన్లు చూడటానికి సింపుల్‌గా కనిపించినా, చాలా ఇంటలెక్చువల్‌గా కూడా ఉంటాయవి. ఎక్కువగా ఆయన వార్‌ కార్టూన్స్‌ గీశారు.

ఇరాన్‌లో ఇరానీ చాయ్‌ లేదు

ఇరానీ చాయ్‌ అని ఎక్కడ అడిగినా అలాంటిదేమీ లేదు. వితౌట్‌ మిల్క్‌ డికాక్షన్‌తో రకరకాల టీ పొడులతో చేసిన చాయ్‌లే తాగుతున్నారు. పాలే కాదు, చక్కెర కూడా కలుపుకోరు. ఓ సుగర్‌ టాబ్లెట్‌లాంటిది నోట్లో వేసుకుని టీ తాగుతారు. ఇరాన్‌ పోయి ఇరానీ చాయ్‌ తాగలేదని ఇక్కడి ఫ్రెండ్స్‌కి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు! హైదరాబాద్‌లో గల్లీ గల్లీలోనూ ఇరానీ చాయ్‌ ఉంటుందని చెబితే ఆశ్చర్యపోయారు. మా ఆఫీసు ఎదురుగా ఉన్న సర్వీ హోటల్‌లో ఇరానీ చాయ్‌ తాగుతామని చెప్పా... పైగా ఆ హోటల్‌ యజమానులు ఇరానీ వాళ్లు కావడం అదో తృప్తి. 

ఇరాన్‌లో చార్మినార్‌
మన చార్మినార్‌లాంటిదే ఇరాన్‌లోనూ ఉంటుందని విన్నాను. అక్కడ చార్మినార్‌లా ఉండే కట్టడం నష్కే జహాన్‌ మసీదు చాలా పురాతనమైనది. నిజానికది చార్మినార్‌ కాదు, దానికి ఉన్నవి దో మినారే! ఆనుకునే ఉన్న హోటల్‌లో దిగడం చాలా సంతోషమేసింది. దాని లోపల పనితీరు కూడా మన చార్మినార్‌లాగానే ఉంది. సిటీ కూడా మన హైదరాబాద్‌లాగానే ఉంది. దానికి ఆనుకుని ఒక పెద్ద ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీ ఉండటం విశేషం. 
మధ్యాహ్నం ఇస్‌ఫహాన్‌ హౌస్‌ ఆఫ్‌ కార్టూన్‌కి వెళ్లాం. ఇస్‌ఫహాన్‌ సిటీలోని ఆ ప్రయాణంలో మధ్యలో ఒక అందమైన నది ఉంది. దాని మధ్యలో 1650లో కట్టిన పురాతనమైన వంతెన ఉంది. నిజంగా సిటీ మధ్యలో ఒక పెద్ద ఓల్డ్‌ మాస్టర్‌పీస్‌ పెయింటింగ్‌లా అనిపించింది. అక్కడ చాలాసేపు గడిపాం. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల జనం చేరుకుని భోజనాలు చేయడం, పిల్లలు ఆడుకోవడం, టూరిస్టులు ఫొటోలు తీసుకోవడం కనిపించింది. ఫైన్‌ ఆర్ట్స్‌ స్టూడెంట్స్, కార్టూనిస్టులు, క్యారికేచరిస్టుల సమక్షంలో నా వర్క్‌షాపు జరిగింది. దానిలో భాగంగా లైవ్‌ క్యారికేచర్‌ స్లైడ్‌షో జరిగింది. నేను వర్క్‌షాప్‌లో బొమ్మలు గీస్తుండగా దాదాపు ఓ ఏడెనిమిది మంది నా క్యారికేచర్‌ గీసి చూపించడం సరదాగా అనిపించింది. అక్కడి వారి బొమ్మలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ చూశాను. అక్కడ ఓ నలుగురు ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు. వారితో సెల్ఫీక్లిక్స్‌!

తెల్లారి మళ్లీ టెహ్రాన్‌. ఆరోజు టెహ్రాన్‌ సిటీ రోడ్ల మీద చలికి వణుక్కుంటూ చాలాసేపు తిరిగాం. మన డబ్బులతో పోల్చితే వాళ్లవి చాలా తక్కువ. సాయంత్రం వరకు గడిపి, నైట్‌ హోటల్‌లో డిన్నర్‌ చేసి, నిర్వాహకులకు, మసవుదికి, ఇతర కార్టూనిస్టులు ఆత్మీయ వీడ్కోలు పలకగా, మేం నైట్‌ ఒంటిగంటకు మళ్లీ అల్‌ ఖొమేనీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరాం. తోవలో మస్కట్‌ ఎయిర్‌పోర్టులో మిత్రుడు, తోటి జ్యూరీ సభ్యుడు జిట్‌ కోస్తానా ఇండోనేసియా వెళుతుండగా సెండాఫ్‌ ఇచ్చి, క్షేమంగా హైదరాబాద్‌ చేరుకున్నాం.
ఒక మిసైల్‌ నా మీద కాని, ఇరాన్‌ మీద కాని ట్రంప్‌ వేయలేదు. కాని మేం మాత్రం మిసైల్స్‌ కన్నా పవర్‌ఫుల్‌ కార్టూన్లు, క్యారికేచర్లు ‘ట్రంపిజమ్‌’ పేరుతో వేసి బాగా నవ్వుకున్నాం. ఈ సందర్భంగా నాకొక సామెత గుర్తొచ్చింది. ప్రపంచం ఇంకా బతికే ఉంది. ఎందుకంటే అది ఇంకా నవ్వుతోంది గనుక! 
'The world lasts because it laughs'
 – శంకర్‌, చీఫ్‌ కార్టూనిస్ట్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement