దెయ్యం సినిమాకి చావుపీడ! | this is one of the horror movie | Sakshi
Sakshi News home page

దెయ్యం సినిమాకి చావుపీడ!

Published Sun, Sep 6 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

దెయ్యం సినిమాకి చావుపీడ!

దెయ్యం సినిమాకి చావుపీడ!

* అది ఒక హారర్ సినిమా.
 
*  చూసినవాళ్లను భయపెట్టింది.
* చేసినవాళ్లను హడలెత్తించింది.
యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 1982... గడియారపు ముళ్లు పన్నెండున్నరను దాటి ఒంటిగంట వైపు పరుగులు తీస్తు న్నాయి. జోబెత్ విలియమ్స్‌కి నిద్ర పట్టట్లేదు. దిండ్లు ఎత్తుగా వేసుకుని, మంచమ్మీద వెనక్కి వాలింది.

వెచ్చగా రగ్గు కప్పుకుని ఏదో నవల చదువుకుం టోంది. చదివితే నిద్ర వస్తుందనుకుంది. కానీ నవల ఆసక్తికరంగా ఉండటంతో ఉన్న కాస్త మత్తు కూడా మెల్లమెల్లగా దూరమవుతోంది.
 ఇంకా రెండు పేజీలు మిగిలి వున్నాయి. అవి కూడా చదివేస్తే పడుకో వచ్చు. జోబెత్ కళ్లు అక్షరాల వెంట పరు గులు పెడుతున్నాయి. అంతలో... ఎక్కడో ఏదో అలికిడి. చదవడం ఆపి అటూ ఇటూ చూసింది జోబెత్. ఆ అలికిడికి కారణమే మిటో అర్థం కాలేదు. మళ్లీ పుస్తకంలో తలదూర్చింది. కానీ చదవలేకపోయింది. ఎందుకంటే... మళ్లీ ఏదో అలికిడి. ఈసారి పుస్తకాన్ని మూసి శ్రద్ధగా వినసాగింది.
 
టప్... టప్... టప్... అడుగుల సవ్వడిలా అనిపిస్తోంది. ఆ సవ్వడి దూరం నుంచి తనకు దగ్గరగా వస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ ఎవరది? ఇంట్లో ఎవ్వరూ లేరు. ఉన్నదల్లా తనొక్కతే. మరి ఇంకెవరు నడుస్తున్నారు? అది కూడా ఇంత అర్ధరాత్రి సమయంలో!
 గమనించుకోలేదు కానీ అప్పటికే జోబెత్ శరీరం చెమటతో తడిసి ముద్ద య్యింది. భయంతో కాళ్లు, చేతులు వణుకుతున్నాయి కూడా. పుస్తకం పక్కన పడేసింది. తనకేమీ కనిపించకూడదని, తాను ఎవరికీ కనిపించకూడదని దుప్పటి ముఖం మీదకంటా కప్పేసుకుంది. కానీ ఫలితం లేదు.

ఆ శబ్దం వినిపిస్తూనే ఉంది. అది తనని మరింత సమీపిస్తోంది.
 వణికిపోతోంది జోబెత్. భయాన్ని అణచుకోలేక దుప్పటిని ఇంకా ఇంకా గట్టిగా చుట్టేసుకుంటోంది. కానీ అంతలో ఆమె ఊహించనిది జరిగింది. దుప్పటిని ఎవరో గట్టిగా లాగేశారు. ఉలిక్కిపడింది జోబెత్. ఎవరది? ఎవరు అలా చేసింది?
 కళ్లు తెరిచే ధైర్యం లేదు. కానీ తెరవక తప్పలేదు. ఎందుకంటే... ఎవరో తనని పిలుస్తున్నారు. ‘‘జోబెత్... జోబెత్... కళ్లు తెరు. నన్ను చూడు.’’
 
జోబెత్ గుండెలు అదురుతున్నాయి. రెప్పల మాటున కనుగుడ్లు భయంతో అటూ ఇటూ కదులుతున్నాయి. మెల్లగా కళ్లు తెరించింది. చూస్తే ఎదురుగా ఓ వృద్ధురాలు. తెల్లని దుస్తులు... తెల్లని మేనిఛాయ... తెల్లని జుత్తు... చూడటానికే భయంకరంగా ఉంది. పైగా తనని చూసి వికృతంగా నవ్వుతోంది. అంతే... కెవ్వున కేక పెట్టింది జోబెత్. కళ్లు మూసేసుకుని అరుస్తూనే ఉంది... ఎవరో ఆమెను పట్టి, కుదిపి, లేపేవరకూ.
 
ఉలిక్కిపడి లేచి కూర్చుంది జోబెత్. ఎదురుగా పనిమనిషి. ‘‘ఏమైంది మేడమ్. ఎందుకలా అరుస్తున్నారు? పీడకలేమైనా వచ్చిందా?’’... కంగారుగా అడిగిందామె.
 అప్పటికి కాస్త తేరుకుంది జోబెత్. అంటే ఇప్పటివరకూ జరిగినదంతా కలా? తాను పుస్తకం చదువుకోవడం... అడుగుల సవ్వడి వినబడటం... ఆపైన దెయ్యం తన దగ్గరకు రావడం... తాను భయంతో అరవడం... ఇవేవీ నిజం కాదా?
 
‘‘చూడండి మేడమ్ ఎంత పొద్దెక్కి పోయిందో. లేచి ఫ్రెష్ అవ్వండి. ఏదో పీడకల కన్నట్టున్నారు మర్చిపోండి’’... పనమ్మాయి నిర్థారించేసింది. అప్పటికి జోబెత్‌కి కూడా అర్థమైపోయింది... అదంతా కలేనని. గబగబా నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంది. నైట్ గౌన్ సర్దుకుని లేవబోతూ ఎందుకో ఎదురుగా ఉన్న గోడవైపు చూసి అవాక్కయ్యింది. ‘‘అదేంటి? ఆ ఫొటోలు, పెయింటింగ్స్ అన్నీ అలా తిరగబడిపోయాయ్’’ అంది పనమ్మాయి వైపు చూస్తూ.
 ‘‘గాలికి తిరబడి ఉంటాయిలెండి మేడమ్. దానికి కూడా కంగారు పడతా రేంటి’’ అంటూ వెళ్లి అన్నిటినీ సరి చేసి వెళ్లిపోయిందా అమ్మాయి.

కానీ జోబెత్ మాత్రం అంత తేలికగా తీసుకోలేక పోయిందా విషయాన్ని. ఎందుకంటే ఇది ఇవాళ జరిగింది కాదు. కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. అది కూడా తాను ‘పోల్టర్‌గైస్ట్’ సినిమాలో నటించడం మొదలు పెట్టినప్పట్నుంచే జరుగుతోంది. రోజూ నిద్ర లేచేటప్పటికి, షూటింగు నుంచి ఇంటికొచ్చేసరికి తన గదిలో ఉన్న ఫొటోలు, పెయింటింగ్‌లు తిరగబడి పోతున్నాయి. ఎన్నోసార్లు సరి చేస్తోంది. కానీ ఇవాళ కూడా అదే జరిగింది.

పైగా రోజూ పీడకలలు. ఏవేవో శబ్దాలు విన పడుతున్నట్టు, ఆకారాలు కనబడుతు న్నట్టు, ఎవరో వెంటాడుతున్నట్టు ఫీలింగ్. ఇక ఆలస్యం చేయకూడదనుకుంది. ఆ రోజు షూటింగ్ స్పాట్‌కి వెళ్లగానే దర్శ కుడు టోబ్ హూపర్‌తో అంతా చెప్పింది. కానీ అతడు సీరియస్‌గా తీసుకోలేదు. పైగా నవ్వాడు. హారర్ సినిమాల్లో నటి స్తున్నప్పుడు ఇలాంటి భయాలు కలగడం మామూలే లైట్ తీసుకోమన్నాడు. అదే అతడు చేసిన తప్పు. ఆరోజే జోబెత్ చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఉంటే... ఎన్నో అనర్థాలు జరగకుండా ఆగేవి. ఎన్నో ప్రాణాలు పోకుండా నిల బడేవి. ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగింది?!  
 
సినిమా అంటేనే కల్పన. ఓ అంద మైన కథను అల్లి, అందరినీ అలరించేం దుకు తగిన అంశాలను ఆ కథలో మేళ వించి తెరకెక్కిస్తాడు దర్శకుడు. కొన్నిసార్లు వాటిలోని సన్నివేశాలు నిజ జీవితాన్ని ప్రతిబింబించవచ్చు. కొన్నిసార్లు అందు లోని పాత్రల స్వభావాన్ని పోలిన వ్యక్తులు మనకు తారస పడవచ్చు. కానీ సినిమా కోసం సృష్టించిన ప్రేతాత్మలు, దెయ్యాలు వెంటపడితే? అవి తమను శపిస్తే? అంత వరకూ ఆనందంగా సాగిపోతోన్న జీవితాలను చిన్నాభిన్నం చేసి పారేస్తే? చివరకు ప్రాణాలను సైతం హరిస్తే?
 
వినడానికే భయంగా ఉంది కదూ! కానీ 1982లో విడుదలైన ‘పోల్టర్‌గైస్ట్’ అనే హాలీవుడ్ సినిమా అలాంటి భయోత్పా తాన్ని కలిగించింది. ఇప్పటివరకూ హాలీవుడ్‌లో వచ్చిన హారర్ చిత్రాల్లో ‘పోల్టర్‌గైస్ట్’ది ముఖ్య స్థానమే. స్టీవెన్ స్పీల్‌బర్గ్ కథ, కథనాలను అందించిన ఆ చిత్రం మూడు పార్టులుగా తెరకెక్కి విజయం సాధించింది. ఎందరో ఆ సినిమా చూసి హడలిపోయారు. ఓ మంచి హారర్ సినిమాను చూసినందుకు సంతోష పడ్డారు. కానీ ఆ సినిమాల కోసం పని చేసినవారు మాత్రం ఆనందించలేక పోయారు. ఆ విజయాన్ని ఆస్వాదించలేక పోయారు. ఎందుకంటే... ఆ సినిమాలకి పని చేసిన తర్వాత వాళ్లందరి జీవితాల్లోని సంతోషం ఆవిరైపోయింది.
 
‘పోల్టర్‌గైస్ట్’లో ‘డానా ఫ్రీలింగ్‌‌స’ పాత్రలో నటించిన డొమినిక్ డ్యూన్ మరణంతో మొదలయ్యింది అసలు కథ. 1982లో ఆ చిత్రం తొలి భాగం విడుదలైన కొద్ది రోజులకే ఇరవై రెండేళ్ల డొమినిక్ తన శాడిస్టు ప్రియుడు జాన్ స్వీనీ చేతిలో హత్యకు గురయ్యింది. ఆమె మరణం చిత్ర టీమ్‌నే కాదు, యావత్ దేశాన్నీ షాక్‌కి గురి చేసింది. ఆ తర్వాత వరుసగా అలాంటి షాకులు తగులుతూనే ఉన్నాయి.
 
‘పోల్టర్‌గైస్ట్’ మూడు భాగాల్లోనూ ప్రధాన పాత్రధారి... హీథర్ రూర్కీ. మొదటి భాగంలో నటించేనాటికి హీథర్ వయసు ఏడేళ్లు. మూడో భాగంలో నటించే నాటికి పన్నెండేళ్లు. పార్ట్ 1లో నటిస్తున్న ప్పుడే హీథర్ అనారోగ్యం పాలయ్యింది. డాక్టర్లు ఫ్లూ అన్నారు. చికిత్స చేసినా తరచూ ఏవేవో ఇబ్బందులు తలెత్తేవి.  1988లో ‘పోల్టర్‌గైస్ట్ 3’ విడుదలకు సరిగ్గా పది రోజుల ముందు ఉన్నట్టుండి వాంతులు మొదలయ్యాయి హీథర్‌కి. శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరయ్యింది. చివరికి కళ్లు తిరిగి పడిపోయింది.

ఆస్పత్రికి తీసు కెళ్తే, కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతోందని నిర్ధారించారు. కానీ చికిత్స ప్రారంభించేలోపే చనిపోయింది. ‘పోల్టర్‌గైస్ట్ 2’లో నటించిన విల్ శామ్సన్‌కి... ఆ చిత్రం విడుదలయ్యాక గుండె, ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. ఆపరేషన్ చేయించుకున్నాడు. కానీ ఆ ఆపరేషన్ వికటించింది. ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. కిడ్నీలు కూడా ఫెయిలవ్వడంతో అతని ఊపిరి ఆగిపోయింది.

మరో పాత్రధారి జూలియన్ బెక్ స్టమక్ క్యాన్సర్‌తో మర ణించాడు. చిత్ర దర్శకుడు బ్రెయిన్ గిబ్సన్ కూడా క్యానర్‌తోనే చనిపోయాడు. అలాగే మూడు భాగాల్లోనూ నటించిన జెల్డా రూబిన్‌స్టీన్ అనే నటికి మూడో పార్టు రిలీ జయ్యాక గుండెనొప్పి వచ్చింది. మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. వీరు మాత్రమే కాదు. ఈ చిత్రానికి పని చేసిన చాలామంది నటీనటులు, టెక్నీషియన్స్‌ని సమస్యల పాలయ్యారు. కొందరు అనారోగ్యం పాలయ్యారు. ఇంకొందరు అప్పుల పాలయ్యారు. మరి కొందరు ప్రమాదాలకు గురయ్యారు. కొందరికైతే విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యేవి. దెయ్యాలు వెంటాడుతున్నా యనేవారు.

ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నా యనేవారు. హీథర్ తల్లిగా నటించిన జోబెత్ పీడకలలతో చిత్రవధ అనుభ వించింది. వీటన్నిటికీ తోడు ఎన్నోసార్లు షూటింగ్ కోసం వేసిన సెట్స్‌లో ప్రమా దాలు సంభవించి, సెట్లు నాశనమయ్యేవి. ఇవన్నీ చూశాక అందరూ ఒకటే అన్నారు... పోల్టర్‌గైస్ట్ చిత్రాలు శాపానికి గురయ్యాయి, అందుకే వాటిలో నటించిన వారి జీవితాలు అల్లకలోలమౌతున్నాయి అని! ఎంతోమంది ఆ మాటను నమ్మారు.

ఇప్పటినీ నమ్ముతున్నారు. అయితే నమ్మని వారు కూడా ఉన్నారు. అదే నిజమైతే అందరు నటీనటులకి, టెక్నీషియన్లకి ఏదో ఒకటి జరగాలి, కొందరు బాగానే ఉన్నారు కదా అన్నారు. దానికి జవాబు ఎవరూ చెప్పలేకపోయారు. చెప్పలేరు కూడా. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు సమాధా నాలు ఉండవు. కొన్ని నమ్మకాల విష యంలో లాజిక్కులు పని చేయవు. కొన్ని భయాలను.. ఎవరి ధైర్య వచనాలూ తొల గించలేవు. ఇంతకీ నిజం ఏమిటి! పోల్టర్ గైస్ట్ చిత్రాలు శాపగ్రస్తమయ్యాయా? లేక అదంతా భ్రమా??

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement