
అంతం
పట్టుకోండి చూద్దాం
ఆగస్ట్ నెల. వర్షం వచ్చినట్లు ఉంది. రానట్టూ ఉంది. ఎండ కొట్టినట్లు ఉంది. కొట్టనట్టూ ఉంది. ఆరోజు వాతావరణం కాస్త చిత్రంగా ఉంది. ఈ చిత్రానికి ఆరోజు నగరంలో మరో సంచలనం తోడైంది. చౌరస్తాలో పట్టపగలు నారాయణ హత్యకు గురయ్యాడు. రోడ్డుకు ఒకవైపుకు ఉన్న వేపచెట్టు దగ్గర నారాయణ కిళ్లీ కొట్టు ఉంటుంది. ఈ కిళ్లీ కొట్టు నారాయణ... చుట్టుపక్కల వారికి ఏ సమస్య వచ్చినా తీరుస్తాడనే మంచి పేరుంది. అయితే అతని మీద ఆరోపణలు కూడా లేకపోలేదు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు అంటారు కొందరు. కిళ్లీ కొట్టు అనేది అతని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రం అంటారు కొందరు. కిళ్లీ కొట్టు దగ్గర ఉన్న స్థలాన్ని కాజేయడానికి... కిళ్లీ కొట్టు పేరుతో నాటకం ఆడుతున్నాడని, అసలు అతడికి ఉన్న ఆస్తికి కిళ్లీ కొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదనేది కూడా కొందరి వాదన.
జనాలు మొదట నారాయణ మంచి చెడుల గురించి మాట్లాడుకున్నారు. ఆ తరువాత మాత్రం... ‘హత్య ఎవరు చేసి ఉంటారు?’ ‘ఎలా జరిగింది?’ ‘ఎవరి ప్రమేయం ఉంది?’ అనే కోణంలో మాట్లాడుకోవడం ప్రారంభించారు. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లు గాలి వార్తలు గాలి కంటే వేగంగా దూసుకెళుతున్నాయి. నిజానిజాలేమిటో ఎవరికీ తెలియడం లేదు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సంఘటన జరిగి వారం గడిచినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కేసు ఇన్‌స్పెక్టర్ నరసింహకు అప్పచెప్పారు. కిళ్లీ కొట్టు దగ్గరికి వెళ్లి చుట్టూ ఒకసారి పరిశీలనగా చూశాడు. ‘స్థలాన్ని కబ్జా చేయడానికే కిళ్లీ కొట్టును మొదలు పెట్టాడు’ అనే ఆరోపణలో నిజం ఉన్నట్లు అనిపించింది.
చుట్టుపక్కల వాళ్లను రకరకాల ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు నరసింహ.
‘‘ఈ కిళ్లీ కొట్టును నారాయణ ఒక్కడే చూస్తుంటాడా?’’
‘‘లేదు... అతని దగ్గర రాజు, శ్రీను అని ఇద్దరు సహాయకులు ఉంటారు. ఆ రోజు రాజు కనిపించలేదు. శ్రీను మాత్రం కనిపించాడు’’
‘‘శ్రీను క్యారెక్టర్ ఏమిటి?’’
‘‘నారాయణకు నమ్మిన బంటులాంటి వాడు. ఒక విధంగా చెప్పాలంటే... నారాయణకు అనధికార బాడీగార్డ్‌లాంటి వాడు’’
‘‘శ్రీనుని అర్జంటుగా పిలిపించండి’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. శ్రీను ఉరుకులు పరుగుల మీద వచ్చాడు. ‘‘ఆరోజు ఏం జరిగింది?’’ శ్రీనుని అడిగాడు ఇన్‌స్పెక్టర్.
‘‘మధ్యాహ్న సమయంలో అన్నకు రోజూ మందు తాగడం అలవాటు. ఆ రోజు కూడా ఒక క్వార్టర్ తెమ్మని పంపించాడు. అదిగో ఆ ఎదురుగా కనిపిస్తున్న దుర్గా వైన్స్‌కు వెళ్లి మందు తీసుకువచ్చాను. ఈలోపే అన్నను ఎవరో క్రూరంగా హత్య చేశారు’’ అంటూ ఏడ్వడం ప్రారంభించాడు శ్రీను.
కేసు గురించి ఇన్‌స్పెక్టర్ నరసింహ పోలీస్‌స్టేషన్‌లో తన సిబ్బందితో మాట్లాడుతున్నాడు. ‘‘నారాయణకు చాలా మంది శత్రువులు ఉన్నారు సార్. ఎవర్ని అనుమానిస్తాం?’’ అన్నారు ఒకరు.
‘‘ఆ రోజు శ్రీనుగాడు నారాయణ పక్కన ఉండి ఉంటే హత్య జరిగి ఉండేది కాదు’’ అన్నారు ఇంకొకరు.
ఆ సమయంలోనే టేబుల్‌పై ఉన్న పాత పేపర్ క్లిప్‌పై పడింది ఇన్‌స్పెక్టర్ దృష్టి. అది నారాయణ హత్య గురించిన వార్త. పేపర్ క్లిప్ చూసీ చూడగానే.... ‘‘ఈ హత్యలో శ్రీను భాగస్వామ్యం ఉంది. వెంటనే వాడిని అరెస్ట్ చేసి తీసుకురండి’’ అని సిబ్బందిని ఆదేశించాడు ఇన్‌స్పెక్టర్. పోలీసులు శ్రీను చేత నిజాలు కక్కించారు. హత్యలో తన ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకున్నాడు శ్రీను. ఇప్పుడు చెప్పండి... శ్రీను అనేవాడు నారాయణకు నమ్మిన బంటు, అనధికార బాడీగార్డ్. ఎవరు కూడా అతడిని అనుమానించే పరిస్థితి లేదు. మరి పేపర్ క్లిప్ చూసిన వెంటనే... శ్రీనుని ఇన్‌స్పెక్టర్ ఎందుకు అనుమానించినట్లు?
ఇన్‌స్పెక్టర్ నరసింహ పేపర్ కటింగ్ చూస్తున్నప్పుడు దాని మీద ఉన్న డేట్ అతనికి కొట్టొచ్చినట్లు కనిపించింది.
‘ఆగస్ట్ 15’ ఆ రోజు బార్‌లన్నీ మూసి ఉంటాయి. కాబట్టి శ్రీను అబద్దం ఆడిన విషయం తెలిసిపోయింది. ‘ఇప్పుడే వస్తాను’ అని నారాయణతో చెప్పి చుట్టు పక్కల ఎక్కడో ఉన్నాడు. హత్య జరిగిన తరువాత అక్కడికి చేరుకొని లబోదిబోమన్నాడు.