భాషణం: లాగి బిగించుకోవాల్సిందే! | tightening the belt | Sakshi
Sakshi News home page

భాషణం: లాగి బిగించుకోవాల్సిందే!

Published Sun, Aug 25 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

భాషణం: లాగి బిగించుకోవాల్సిందే!

భాషణం: లాగి బిగించుకోవాల్సిందే!

 రోజులెప్పుడూ ఒకలా ఉండవు. ఏమీ లేని వాళ్లకు ఏదైనా కలిసి వస్తే సంతోషమే కానీ, బాగా బతికినవాళ్లు ఊహించని విధంగా చితికిపోవడమన్నది చాలా బాధాకరమైన పరిణామం. అయితే ఉన్ననాడు ఎలా ఉన్నా, లేనినాడు మాత్రం సర్దుకుపోవాల్సిందే. ఇలా సర్దుకుపోవడాన్నే tightening the belt అంటారు.  మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1930-40 మధ్య కాలంలో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేసింది. ఎందరో సంపన్నులు, సామాన్యులు తినడానికి తిండే లేని దుర్భరమైన స్థితికి చేరుకున్నారు. ఆ సమయంలో పుట్టిందే tighten your belt అనే పదబంధం.
 
 ఆ ‘గ్రేట్ డిప్రెషన్’ పీరియడ్‌లో చేతిలో డబ్బులు లేక, తినడానికి తిండి లేక, బరువు తగ్గి, బక్కచిక్కిపోయినవారు తమ ప్యాంట్లు కిందికి జారకుండా నడుముకు ఉండే బెల్టును మరింత గట్టిగా (ఇంకో రంథ్రం లోపలికి) బిగించుకునేవారట. అలా ఈ మాట వాడుకలోకి వచ్చిందంటారు. మారిన ఆర్థిక పరిస్థితిని బట్టి అవసరాలను కుదించుకోవడమన్నది అంతరార్థం. సడెన్‌గా జీతం రావడం లేటవుతుంది, లేదా అనుకోని అత్యవసరానికి పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు అయివుంటుంది. అలాంటి సందర్భంలో మిగతా అవసరాలను తగ్గించుకోవలసి వస్తుంది. రెండు పాల ప్యాకెట్‌లు తీసుకునేవాళ్లు ఒకటితో సరిపెట్టుకుంటారు. వారానికి రెండుసార్లకు బదులు ఒకసారే చికెన్ తింటారు. పండగ వస్తున్నా సరే, ఉన్నబట్టలతోనే సర్దుకుంటారు కానీ, కొత్తవి కొనరు. ఇదంతా కూడా బెల్ట్‌ని టైట్ చేసుకోవడమే. ఈ వాక్యం చూడండి. I have had to tighten my belt since I stopped working full-time. ఫుల్ టైమ్ వర్క్ చేయడం లేదు కాబట్టి ఖర్చులు తగ్గించుకున్నానని చెప్పడం.
 
 ఇక be in a tight corner అంటే కష్టాల్లో ఉండడం. Keep a tight rein on అంటే అదుపులో ఉంచుకోవడం. ఇక్కడ ట్ఛజీ అంటే కళ్లెం వేసే తోలు బెల్టు లాంటిది. rein ని ‘రెయిన్’అని పలకాలి. (ఉదా: My father always kept us on a tight rein).
 Sit tight అంటే కదలకుండా, ఓపిగ్గా, సుదీర్ఘంగా కూర్చోవడం. Tight lipped అంటే పెదవి విప్పకపోవడం, కోపాన్ని అణుచుకోవడం.
 Sleep tight అంటే హాయిగా నిద్రపోవడం. గుడ్ నైట్ చెప్పడానికి బదులుగా కొంతమంది sleep tight అని అంటారు.
 
 Tight fisted అంటే డబ్బు ఖర్చుపెట్టడానికి వెనకాడడం. (వాడుక భాషలో పిసినారి). Belt tight చేసుకున్న అనుభవం ఉన్నవారు tight fisted గా ఉండడం సహజమే.  In a tight spot అంటే క్లిష్ట పరిస్థితి, సంక్షోభం. (If there is shortage of fuel, everyone who drives to work will be in a tight spot.)
 
 Tight-arse అని ఇంకో మాట ఉంది. దాని అర్థం కూడా tight fisted అనే.  కాకపోతే అక్కడ  fist, ఇక్కడ arse. దీన్ని ‘ఆస్’ అని పలకాలి. arse అంటే ఏ అవయవ భాగంతో అయితే మనిషి కూర్చుంటాడో ఆ భాగం. (You won't get a drink out of him, he is a real tight arse). అలాగే Close chewer and a tight spitter అనే మాట కూడా. అంటే అస్సలు డబ్బు ఖర్చుపెట్టని వ్యక్తి. పిల్లికి భిక్షం వేయడంటారే... అలా! ఇలాంటివారు ‘మీ ఇంటికొస్తే ఏమిస్తావ్? మా ఇంటికొస్తూ ఏం తెస్తావ్?’ అన్నట్లుంటారు.
 
 Run a tight ship అంటే సంస్థని క్రమశిక్షణగా, ఒక పద్ధతి ప్రకారం నడపడం. (The new office manager really runs a tight ship). On a tight leash అంటే ఆధీనంలో ఉంచుకోవడం. Leash అంటే.. కుక్కను కట్టే తోలు పటకా. ఈ వాక్యాలు చూడండి. 1. I keep my dog a tight leash so it won't bother people. 2. My father keeps my brother on a tight leash. 3. The boss has us all on a tight leash.
 
 I have had to tighten my belt since I stopped  working full-time.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement