
కోరిన వరాలిచ్చే కొండలరాయుని ఉత్సవాలెన్నో...
దేవదేవుని ఆలయంలో ఏడాది పొడవునా సాగే ఉత్సవాల్లో అతిముఖ్యమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆస్థానం, వసంతోత్సవం, పరిణయోత్సవం, జ్యేష్ఠాభిషేకం, ఆణివార ఆస్థానం, పవిత్రోత్సవం, పుష్పయాగం, వైకుంఠ ఏకాదశి సేవల్లో స్వామి వైభవం గురించి... గత బ్రహ్మోత్సవాల ప్రత్యేక సంచికలో తెలుసుకున్నాం. తాజాసంచికలో మరికొన్ని ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకుందాం!
శ్రీవారి పారు‘వేట’ ఉత్సవం
జగత్ప్రభువైన శ్రీనివాస చక్రవర్తి శంఖ, చక్ర, గదా, ధనుః, ఖడ్గమనే పంచాయుధాలు ధరించి వన విహారార్థం వెళ్లి దుష్ట మృగాలను వేటాడి విజయంతో తిరిగిరావటమే ఈ ఉత్సవ విశిష్టత. మృగంలాగా స్థిరత్వంలేని భక్తుని మనస్సును పంచాయుధాలతో వేటాడి పట్టుకుని ఏకాగ్రతను ప్రసాదించటమే ఈ పారు ‘వేట’ ఉత్సవ నిర్వహణలోని అంతరార్థం. ప్రతి సంవత్సరం కనుమపండుగరోజు, అధికమాసంలో వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవం తర్వాత శ్రీవారు పారువేటకు వెళతారు. ఆ రోజున స్వామి వేట దుస్తులు, శిరస్త్రాణం ధరిస్తారు. సుదర్శనచక్రం, పాంచజన్యశంఖం, నందక ఖడ్గం, కౌమోదకిగద, శార్ఙమనే విల్లు వంటి పంచాయుధాలతో వేటకు సన్నద్ధమవుతారు.
వేటపరికరాలైన డాలు, కత్తి, బల్లెం (ఈటె) స్వీకరించి బంగారు పీఠంపై ఆలయం నుంచి బయలుదేరుతారు. మరో బంగారు పీఠంపై శ్రీకృష్ణస్వామి కూడా శ్రీనివాస ప్రభువును అనుసరిస్తూ బాజాభజంత్రీలు, పండితుల వేదఘోష నడుమ ఆలయానికి మూడు మైళ్ల దూరంలోని పారువేట మంటపానికి చేరుకుంటారు. ఇక్కడ రెండు గంటలపాటు వైదిక ఆచారాలు, అన్నమయ్య సంకీర్తనలు, హరికథ, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్వామివారు వేటకు సన్నద్ధమవుతారు. శ్రీ స్వామివారు పంచాయుధాలను ఎక్కుపెట్టి పరుగెడుతుండగా, అర్చక స్వామి బంగారు బల్లెం(ఈటె)తో శ్రీస్వామివారిని అనుసరిస్తూ జంతువులను వేటాడతారు. ఇలా మూడుసార్లు ఈటెను విసరటంతో జంతువులు పారిపోతాయి. చివరగా శ్రీనివాసుడు, శ్రీకృష్ణస్వామి ఇరువురూ భక్తులకు దర్శనమిస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు.
ప్రణయ కలహోత్సవం
తాయార్లు, మలయప్ప మధ్య వినోద భరితంగా సాగే ఉత్సవంగా ప్రణయ కలహోత్సవం ప్రసిద్ధి పొందింది.
వేటకు వెళ్ళి వచ్చిన శ్రీవారిని చూసి అమ్మవార్లు కోపగించడం, శాంతించవలసిందిగా అమ్మవార్లను శ్రీస్వామివారు బతిమాలుకోవడం... అత్యంత భక్తిరస భరితంగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఆరవరోజున తిరుమలలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పౌరాణికుడు శ్రీస్వామి, దేవేరుల ప్రణయ కలహ పురాణ ఘట్టాన్ని ఆలపిస్తుండగా పరివట్టం (తలకు పట్టుగుడ్డ) ధరించిన జీయంగార్ అమ్మవార్ల తరపున నిలబడి రెండు పూలబంతులను స్వామివారిపై విసురుతారు. అమ్మవార్ల పూలబంతుల దెబ్బకు జడిసినట్టు స్వామివారు కొంచెం వెనక్కు కదులుతారు. తప్పు చేయలేదని అమ్మవార్లకు నచ్చజెబుతూ స్వామివారు ముందుకు వస్తారు. మళ్లీ జీయంగార్ అమ్మవారి తరపున పూలబంతులు వేయటం, స్వామివారు వెనక్కు పోవటం ... ఇలా మూడుసార్లు జరుగుతుంది. చివరికి అమ్మవార్లు శాంతించి స్వామివారి పక్కన నిలిచి మూడుమార్లు పుష్పమాలలు మార్చుకుంటారు. చివరగా జీయంగార్లు, పౌరాణికులకు శఠారీ, మర్యాదలు చేసి ఉత్సవాన్ని ముగిస్తారు.
ఒకరోజు బ్రహ్మోత్సవం రథ సప్తమి వేడుక
తిరుమలలో మాఘమాసం శుద్ధ సప్తమి పర్వదినాన ‘రథసప్తమి’ వేడుకలు నిర్వహిస్తారు. ఏడు వాహనాలపై ఊరేగుతూ శ్రీమన్నారాయణుడు తన దర్శన భాగ్యాన్ని భక్తులకు ప్రసాదిస్తారు. ఒకేరోజు వరుసగా ఏడువాహనాల ఊరేగింపు నిర్వహించటం వల్ల ఇవి ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందాయి.
క్రీ.శ.1564 నుంచి తిరుమల ఆలయంలో రథసప్తమి నిర్వహిస్తున్నట్టు శాసనాలు చెబుతున్నాయి. స్వర్ణకాంతులతో ధగధగ మెరిసే సప్తాశ్వ సూర్యప్రభ వాహనంపై వజ్రకవచాది సర్వాభరణాలు ధరించిన మలయప్ప భక్తులకు దర్శనమిస్తూ సూర్యోదయానికి ముందే ఊరేగింపుగా ఆలయ ఉత్తరమాడ వీధి ప్రారంభానికి చేరుకుంటారు. సూర్య భగవానుడి తొలికిరణాలు సూర్యవాహనంపై దర్శనమిస్తున్న తేజోమూర్తి వజ్ర కిరీటం, శంఖుచక్రాలు, వక్షఃస్థల లక్ష్మి.... చివరగా స్వామివారి పాదపద్మాలను స్పృశించటంతో అశేష భక్తజనం గోవింద నామస్మరణలతో స్వామివారిని దర్శించుకుని తన్మయం పొందుతారు. తర్వాత వరుసగా ఉదయం చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం ఇలా వాహన సేవలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో వేడుకగా చక్రస్నానం చేస్తారు. సాధారణ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల్ని దర్శించలేని భక్తులు రథసప్తమి వేడుకలో వచ్చి ఉత్సవమూర్తులను దర్శించుకుని ఆనంద పరవశులవుతుంటారు.
తెప్పతిరునాళ్లలో స్వామి కోనేటి విహారం
ఈ ఉత్సవాన్ని శ్రీవారికి కలహకేళిగా చెప్పొచ్చు. ఆలయానికి ఉత్తరదిశలోని పుష్కరిణి మధ్యలో క్రీ.శ.15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారు కూడా ఈ తెప్పతిరునాళ్లను తన సంకీర్తనల్లో ఆవిష్కరించారు. తర్వాత ఆగిపోయిన ఈ తిరునాళ్లను 1921లో అప్పటి మహంతు ప్రయాగదాసు ఆరంభించారు. ఇప్పుడు ఈ ఉత్సవాన్ని ఐదురోజుల పాటు కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు.
తొలిరోజు శ్రీ సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామ చంద్ర మూర్తి అవతారంలో శ్రీ స్వామివారు మూడుమార్లు పుష్కరిణిలో ప్రదక్షిణగా విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. రెండవ రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి, చివరి మూడు రోజులు శ్రీదేవి, భూదేవి సమేత తాయార్లతో కలసి మలయప్ప స్వామివారు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. కోలాహలంగా సాగే ఈ ఉత్సవంలో స్థానికులు, ఉద్యోగులు తెప్పపై శ్రీవారి వైభవాన్ని దర్శిస్తారు.
కైశిక ద్వాదశి ఉత్సవం
ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో శుక్లద్వాదశి రోజున ఆలయంలో కైశిక ద్వాదశి ఉత్సవం నిర్వహిస్తారు. సూర్యోదయానికి చాలా ముందుగానే శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉన్న ఉగ్రశ్రీనివాసమూర్తికి అభిషేకం, అర్చనలు పూర్తి చేసి, సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. సూర్యోదయానికి ముందే ఉత్సవవర్లను తిరువీధుల్లో అంగరంగవైభవంగా ఊరేగించి తిరిగి ఆలయ ప్రవేశం చేస్తారు. ఈ ఉగ్రశ్రీనివాసమూర్తికి సూర్యకిరణాలు సోకితే ఉగ్రత్వం వస్తుందని నమ్మకం. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు. ఆ రోజు మాత్రమే ఆ స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.
శ్రీబాగ్‌సవారిలో అప్రదక్షిణ
బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటిరోజు మలయప్ప స్వామి ఆలయానికి, పుష్కరిణికీ అప్రదక్షిణగా ఊరేగుతారు. అనంతాళ్వారుల తోటకు వెళ్లి అక్కడ పూజానివేదనలు అందుకుంటారు. శ్రీస్వామి, అనంతాళ్వారుల మధ్య గల అనుబంధానికి నిదర్శనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దీనికే శ్రీబాగ్ సవారి అని పేరు.