బెంగాలీ చిత్రం ‘అగ్నిపరీక్ష’ ఆధారంగా వచ్చి, అచ్చ తెలుగు చిత్రంలా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...
ఆ దేవాలయ పరిసరాల్లో ఎవరిగోల వారిది అన్నట్లుగా ఉంది. ఆ గోల మధ్యలో నుంచే...‘పెళ్లికూతురు కనిపించడం లేదు’ అని పెద్దకేక ఒకటి వినిపించింది.తన కారు దగ్గర నిల్చున్న కైలాసం దగ్గరికి ఇద్దరు వ్యక్తులు పరుగెత్తుకు వచ్చారు. ఆ ఇద్దరిలో అరవై సంవత్సరాల వ్యక్తి ఆందోళనగా...‘‘అబ్బాయ్ అబ్బాయ్...ఇటు పిల్ల పారిపోయి వచ్చింది. నీకేమైనా కనిపించిందా?’’ అని అడిగాడు.‘‘మీ అమ్మాయా?’’అడిగాడు కైలాసం.‘కాదు’’ అన్నాడు పెద్దాయన.‘‘మీ మనవరాలా?’’‘‘కాదు... నా పెళ్లాం’’ తాపీగా సమాధానం ఇచ్చాడు పెద్దాయన.అదిరిపడ్డాడు కైలాసం.‘‘నీకు పెళ్లాం కూడానా!’’ వెటకారం చేశాడు కైలాసం.‘‘ఆ... ఇంకా పెళ్లి కాలేదు. వీరికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకొని అన్ని ఏర్పాట్లు చేసుకునేలోపే ఆ పిల్ల పారిపోయింది’’ అసలు విషయం చెప్పాడు ఆ పెద్దాయనపక్కాయన.‘‘మంచిపని చేసింది’’ మనసులోని మాటను గట్టిగా అన్నాడు కైలాసం.‘‘మంచిపని చేసిందా మంచిపని...’’ అంటూ కైలాసం పైకి ఒంటి కాలి మీద లేచాడు పెద్దాయన.‘‘లేకపోతే ఈ వయసులో పెళ్లేంటి... పండ్లవి ఊడిపోయి’’ వెటకారానికి పదును పెట్టాడు కైలాసం.‘అన్నావు... నువ్వు ఇదే అన్నావు. ఈరోజుల్లో ఈ కుర్రాళ్లందరికీ ఇదే రోగం. ఏది నాతో పాటు కలిసి శేరు బియ్యం తిను నీ సంగతి ఏందో తెలుస్తుంది’’ సవాలు విసిరాడు పెద్దాయన.‘‘మేము తినేది అన్నం. బియ్యం కాదు తాతయ్య’’ వ్యంగ్యంగా అ సవాలుకు చురక పెట్టాడు కైలాసం.తాత అనగానే ఆ తాతగారికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఇలా విరుచుకుపడ్డాడు...‘‘తాతయ్యట తాతయ్య! నువ్వు నా కూతురి కొడుకువా? కొడుకు కొడుకువా!’’పరిస్థితి చేయిదాటుతుందని పసిగట్టిన పెద్దాయన పక్కాయన...‘‘వీడితో మనకెందుకండీ... పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దాం పదండి’’ అంటూ తొందరచేశాడు.‘‘పడుచోడు బయలుదేరారండి... బయలుదేరాడు’’ అంటూ కారు స్టార్టు చేశాడు కైలాసం.కొద్దిదూరం ప్రయాణం చేసిన తరువాత నీటి కోసం ఒక జలపాతం సమీపంలో ఆగాడు. జలపాతం దగ్గరికి వెళుతున్నప్పుడు ఒకచోట అమ్మాయి కనిపించింది.‘ఎవరది? వరూధినా? లేక కామిని పిశాచమా? ఆడమనిషే... ఆ సింగారమంతా చూస్తే ఎవరో ప్రియుడి కోసం వచ్చినట్లుంది’ అనుకున్నాడు చేతిలో డబ్బా పట్టుకున్న కైలాసం.
అక్కడ ఆమె ఇలా అనుకుంది...‘వీడెవడు? చేతిలో డబ్బా వీడూనూ! ఆ డొక్కు కారు డ్రైవరు కాబోలు. నేను డిక్కీలో నుండి దిగడం చూశాడేమో’’‘ఇదే ప్రేమతతంగమైతే గంట ముందు వచ్చి మగాడు పడుండాలి. చుట్టుపక్కల ఎక్కడా మగపురుగు కనబడడం లేదు. బహుశా ఆ మగధీరుడు ఏదో మోసం చేసి ఉండాలి’ అనుకున్నాడు కైలాసం. ‘ఎందుకైనా మంచిది కాస్త దగ్గరికి వెళ్లి చూద్దాం’ అంటూఅడుగులు వేశాడు.‘వీడికి ఏదో దురుద్దేశం ఉండాలి. లేకపోతే ఎందుకలా నా వైపు చూస్తున్నాడు’ ఆమె అనుమానపడింది.కైలాసం తన వైపు రావడం గమనించి.‘హమ్మయ్యో ఇటే వస్తున్నాడు. ఈ మగాళ్లకి ఇదే తెగులు. ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు అదే పనిగా వెంటపడతారు’ అని విసుక్కుంది.‘ఈ పిల్ల ఆ పిల్లే... పెళ్లిపీటల మీది నుంచి తప్పించుకొని వచ్చిందన్నమాట. ఇక్కడికి ఎందుకొచ్చిందబ్బా? ముసలాడికి ఇచ్చి కట్టబెడితే ఏంచేస్తుంది? చావాలనే వచ్చి ఉంటుంది’ తనే ప్రశ్న వేసుకొని సమాధానం తనే చెప్పుకున్నాడు కైలాసం.ఛీ వెధవ బతుకు. చావడానికి కూడా అడ్డేనా నాకు’ తనను తాను విసుక్కుంది ఆ అమ్మాయి.‘నేను అడ్డనుకుంటుందేమో! నా దారిన నేను పోయినట్లు నాటకం ఆడతాను’ అని వెనక్కి వెళుతున్నట్లు నటించాడు కైలాసం.హమ్మయ్య వెళ్లిపోయాడు’ అని ఆమె ఆత్మహత్యకు సిద్ధపడుతున్న సమయంలో...‘‘ఏవండీ... ఆగండి... మిమ్మల్నే... మిమ్మల్నే’’ అని గట్టిగా అరుచుకుంటూ వచ్చాడు కైలాసం.‘‘ఏమిలేదండీ... ఏమీ లేదు’’ అని బుకాయించబోయింది ఆమె.‘‘లేదంటే ఎలా? మీరు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి’’ ‘‘లేదండి’’ ‘‘చూడండి మీకు చావు అంటే అనుభవం లేనట్లుంది. అందులో నీటిలో పడి చావడం. నీటిలో మొసళ్లు ఉంటాయి. అవి కరకర మింగి నములుతాయి’’
‘‘అయ్యబాబోయ్.... ఈ నీటిలో మొసళ్లు ఉంటాయా?’’‘‘ఉండవనే అనుకుందాం. మీరు చచ్చేలోగా ఎవడైనా చూసి బయటికి లాగితే మీరు బతికిపోతారు. చావాలని చావకుండా బతికున్నందుకు పోలీసులు కేసులు పెడతారు’’‘‘కేసా? అమ్మయ్యో’’‘‘బతికి ఉంటే ఊరుకుంటుందా ప్రభుత్వం. శిక్ష వేస్తుంది. జైల్లోకి పంపించేస్తుంది. పోనీ మీ మటుకు మీరు అనుభవిస్తారనుకుంటే మధ్య నా పీక మీదికి వస్తుంది’’‘‘మీకా?’’‘‘అవును. ఆత్మహత్య ప్రయత్నానికి సాయపడ్డానని మధ్యలో నన్ను జైల్లో కుక్కుతారు. చూశారా... చావంటే ఎంత చావో’’‘‘ఇవేమీ నాకు తెలియవండీ’’‘‘తెలియకపోతే నాలాంటి వాళ్లను అడిగి తెలుసుకోవాలి. అది సరే మీరు ఎందుకు చావాలనుకుంటున్నారో కాస్త టూకీగా చెబుతారా?’’‘‘బతకడం అనవసరం అనిపించింది’’
చెక్‌పోస్ట్ దగ్గర...
‘‘ఆ పారిపోయిన అమ్మాయి కారులో వస్తే చచ్చినట్లు ఈ దారినే వచ్చి తీరాలి. కాలినడకనైతే అక్కడ మన 456 ఉండనే ఉన్నాడు. ఇక ఎలా పోతుందంటావు?’’ అన్నాడు సీనియర్ కానిస్టేబుల్ జూనియర్‌తో.‘‘అంతే బాబాయ్’’ అన్నాడు జూనియర్ తల ఊపుతూ.‘‘ఛా... బాబాయ్ అనొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బంధుత్వానికి ఉద్యోగానికి సంబంధం లేదని చెప్పలా! డ్యూటీలో ఉండగా సార్ అనాలి. జాగ్రత్త. ఇప్పుడు సార్ అని చెప్పి శాల్యూట్ కొట్టి ఏంచెప్పాలో చెప్పు!’’‘‘సరే సార్! ఆ రిపోర్ట్ అడిగిన వాళ్లను ఒక వివరం అడగడం మరిచిపోయాం సార్’’ అన్నాడు జూనియర్.‘‘ఏమిటది?’’ అడిగాడు సీనియర్.‘‘ఆ అమ్మాయికి జుట్టు ఉందా లేదా?’’
Comments
Please login to add a commentAdd a comment