ఇండస్ట్రీకి వస్తానంటే... వద్దనే చెబుతాను! | Villain gang in comdian rowdy is fish venkat | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీకి వస్తానంటే... వద్దనే చెబుతాను!

Published Sun, Sep 14 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

ఇండస్ట్రీకి వస్తానంటే... వద్దనే చెబుతాను!

ఇండస్ట్రీకి వస్తానంటే... వద్దనే చెబుతాను!

సంభాషణం
చాలా సినిమాల్లో విలన్ గ్యాంగులో రౌడీగా కనిపిస్తాడతను. కానీ ముఖం అమాయకత్వానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటుంది. చేసే పనులూ, మాట్లాడే మాటలూ అమాయకంగానే ఉంటాయి. నవ్వు తెప్పిస్తాయి. రౌడీ పాత్రలో కామెడీని పండించే ఆ నటుడి పేరు... ‘ఫిష్’ వెంకట్. ‘గబ్బర్‌సింగ్’లో ‘క్షందమామ రావే’ అంటూ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన వెంకట్ చెప్పిన విశేషాలివి...
 
ఆంధ్ర, తెలంగాణ సెగను కొందరు పరిశ్రమకు కూడా తగిలిస్తున్నారు. నాకది నచ్చడం లేదు. నేను తెలంగాణవాడినే. అయినా కూడా ఆంధ్రవాళ్లమీద నాకే అయిష్టమూ లేదు. ఇక్కడ పరిశ్రమను నెలకొల్పింది, నిలబెట్టింది, నాలాంటి వాళ్లందరికీ అవకాశాలూ కల్పించిందీ వాళ్లే. వాళ్లు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు పరిశ్రమ రెండు ముక్కలవ్వాల్సిన అవసరమూ లేదు. ఆ ఆలోచనే నాకు బాధ కలిగిస్తుంది. విభేదాలు లేకుండా ఎప్పటిలా అందరం కలిసి ఒకేచోట, ఒక్కటిగా ఉండి పని చేసుకోవాలన్నదే నా కోరిక.
 
మిమ్మల్ని ‘ఫిష్’ వెంకట్ అని ఎందుకంటారు?
 మేం బెస్తవాళ్లం. చేపల వ్యాపారం చేసేవాళ్లం. అందుకే అందరూ అలా పిలుస్తుంటారు.
     
మరి ‘ఫిష్’ను వదిలి ‘ఫిల్మ్’ని ఎందుకు నమ్ముకున్నారు?
మేం ముషీరాబాద్‌లో ఉండేవాళ్లం. 1980లో శ్రీహరిగారి కుటుంబం హైదరాబాద్ వచ్చి బాలానగర్‌లో స్థిరపడింది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన సినిమాల్లోకి వెళ్లాక తన షూటింగులకు వెళ్లేవాడిని. ఆయనే నన్ను సినిమాల్లోకి రమ్మన్నారు. నేను రానన్నా బలవంతపెట్టి ‘ఒరేయ్ తమ్ముడు’లో నటింపజేశారు.
   
బ్రేక్ ఎప్పుడు వచ్చింది?
‘ఆది’ సినిమాతో. నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది శ్రీహరన్న అయితే... నిలదొక్కుకునేలా చేసింది వీవీ వినాయక్‌గారు. ఆయన నాకు గాడ్‌ఫాదర్. ఆది, బన్ని సినిమాల్లో మంచి పాత్రలిచ్చి నేనెవరో అందరికీ తెలిసేలా చేశారు. ఎన్ని జన్మలెత్తినా ఈ ఇద్దరి రుణం నేను తీర్చుకోలేను.
   
ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేస్తున్నారు. బోర్ కొట్టడం లేదా?
ఫిష్ వెంకట్ ఎలాంటి పాత్రలకు సూటవుతాడో, ఏం చేస్తే బాగుంటాడో రచయితలకి, దర్శకులకి తెలుసు. వారి నమ్మకమే నాకు బలం. నేను చిన్నతనం నుంచీ చాలా కష్టాలు పడ్డాను. ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నాకు లభించిన పాత్రలే. అందుకే ఏ పాత్రనయినా చేస్తాను. రెమ్యునరేషన్ కూడా ఇంత కావాలి అని అడగను. ఎంత ఇస్తే అంత తీసుకుంటాను.
   
మిమ్మల్ని రౌడీ పాత్రల్లో చూసి మీ వాళ్లేమంటారు?
నేను రౌడీ గ్యాంగ్‌లో ఉన్నా చేసేది కామెడీయే కదా. వాళ్ల మధ్య ఉండి వాళ్లమీదే సెటైర్లు వేస్తుంటాను. అది చూసి నా భార్యలు, పిల్లలు నవ్వుతుంటారు.

మీరు భార్యలు అనే అన్నారా?
అవునండీ... మీరు విన్నది నిజమే. నాకు ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పాపకి పెళ్లి చేసేశాం. పెదబాబు యాదేష్  ‘వీడు తేడా’, ‘ప్రేమ ఒక మైకం’, ‘డి ఫర్ దోపిడీ’ చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు. రెండో బాబు సాయి పదో తరగతి చదువుతున్నాడు. తనని హీరోని చేయాలని నా కోరిక. మూడోవాడు ఇంకా చిన్నోడే. వాడి గురించి ఆలోచించడానికి చాలా టైముంది.

వాళ్లనీ మీ దారిలోనే నడిపిస్తున్నారా?
అవును. కానీ బయటివాళ్లెవరు ఇండస్ట్రీకి వస్తానన్నా వద్దంటాను.

ఎందుకని?
ఇక్కడ రోజూ రెండు వందల మంది వేషాల కోసం క్యూలో నిలబడతారు. ఓ పది మందికి మాత్రమే పని దొరుకుతుంది. మిగతా నూట తొంభై మందీ వెనుదిరగాల్సిందే. పని దొరికినా కంటిన్యుయస్‌గా ఉండదు. కొన్నాళ్లు ఖాళీగా ఉండాలి. వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రం. ఎలా బతుకుతారు? సినిమాల మీద ఆసక్తితో కండలు, జుట్లు పెంచుకుని వచ్చినంత మాత్రాన ఇక్కడ పిలిచి అవకాశాలెవరూ ఇచ్చేయరు. అదేదో నెలకు మూడు నాలుగు వేలు వచ్చే ఉద్యోగం చేసినా కుటుంబాన్ని పోషించుకోవచ్చు.
   
మీరిలా మాట్లాడ్డం ఆశ్చర్యంగా ఉంది...
 ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. అందరికీ నాకు దొరికినట్టు ఓ శ్రీహరి, ఓ వినాయక్ దొరకరు. అవకాశాలు దొరికేలోపు యేళ్లకేళ్లు గడిచిపోతాయి.

ఇండస్ట్రీ పట్ల అసంతృప్తి ఉన్నట్టుందే?
లేదు. నన్ను నిలబెట్టింది, బతికిస్తోంది ఈ పరిశ్రమే. కాకపోతే అందరికీ అంత అదృష్టం దక్కదు. అందుకే దీనిమీదే ఆశలు పెంచుకుని జీవితాన్ని పాడు చేసుకోవద్దంటున్నాను. కావాలంటే ఏదైనా పని చేసుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నించాలి. ఈ పరిశ్రమ గొప్పది. ఇక్కడ ఎంతమందికైనా చోటుంటుంది. కాకపోతే ఆ చోటు సంపాదించుకోవడం కాస్త కష్టం. అందరికీ నా అంత అదృష్టం ఉండదుగా!
  - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement