అరణ్యం: నెమలి కూనను ఏమంటారు? | what to say Peacock cup ? | Sakshi
Sakshi News home page

అరణ్యం: నెమలి కూనను ఏమంటారు?

Published Sun, Aug 11 2013 2:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM

అరణ్యం: నెమలి కూనను ఏమంటారు?

అరణ్యం: నెమలి కూనను ఏమంటారు?

   నెమళ్లలో మూడు రకాలున్నాయి. మొదటి రకం బ్లూ పీకాక్. శ్రీలంక, భారతదేశాల్లో ఎక్కువగా ఉంటాయివి. రెండో రకం గ్రీన్ పీకాక్. ఇవి ఎక్కువగా జావా, మయన్మార్ ప్రాంతాల్లో ఉంటాయి. ఇక మూడో రకమైన కాంగో పీకాక్‌లు ఆఫ్రికా వర్షారణ్యాల్లో ఉంటాయి!

నెమళ్లు అన్నిటినీ పీకాక్స్ అనేస్తాం. నిజానికి అలా అనకూడదు. మగవి మాత్రమే పీకాక్స్. ఆడవాటిని ‘పీహెన్స్’ అనాలి. అలాగే నెమలి పిల్లల్ని ‘పీ చిక్స్’ అనాలి. అన్నిటినీ కలిపి మాట్లాడాల్సి వస్తే ‘పీహౌల్’ అని వ్యవహరించాలి. అలాగే నెమళ్ల గుంపును పార్టీ అనిగానీ, ప్రైడ్ అనిగానీ అనాలి!

ఇవి వేగంగా పరుగెత్తలేవు. అందుకే శత్రువులు దాడి చేస్తారని అనుమానం రాగానే చెట్లెక్కేస్తాయి. ఆ భయంతోనే రాత్రిళ్లు చెట్లమీదే నిద్రపోతాయి!
     పింఛం అన్ని నెమళ్లకూ ఉంటుందని అనుకుంటారు చాలామంది. కానీ అది నిజం కాదు. కేవలం మగ నెమళ్లకే పింఛం ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే... నెమలి బరువులో అరవై శాతం దాని పింఛానిదే!
     ఆడ నెమళ్లు తమ జంటను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటాయి. పొడవు, దారుఢ్యం, పింఛంలోని రంగులను చూసి మరీ నచ్చినవాటిని ఎంపిక చేసుకుంటాయట!
     నెమళ్లు ఎంతో అందంగా ఉంటాయి కానీ వాటి అరుపు కర్ణకఠోరంగా ఉంటుంది. హఠాత్తుగా వింటే ఆ అరుపు స్త్రీ ఏడుపులా అనిపిస్తుంది!
     నెమళ్లు చాలా పిరికివి. పులులు, సింహాలే అక్కర్లేదు... పిల్లులు, కుక్కలకు కూడా జడిసిపోతాయి!
 
 కాకి తోక... పాము మెడ!
 డార్టర్... ఈ ఫొటోలో ఉన్న పక్షి పేరు. చూస్తేనే తెలిసిపోతోందిగా... పాములా గోచరిస్తున్న మెడే దీనికి ప్రత్యేక త అని! శరీరం కనిపించకుండా, వట్టి మెడే బయటకు కనబడితే... కచ్చితంగా దీన్ని పాము అనుకునే ప్రమాదం ఉంది. ఈ పక్షులు నాలుగు రకాలు. ఒక్కో రకం ఒక్కో ప్రాంతంలో కనిపిస్తాయి. అన్హింగా అనేవి ఆమెరికాలోను, అన్హింగా రుఫా అనేవి ఆఫ్రికాలోను, అన్హింగా నోవెహాలిండీ అనేవి ఆస్ట్రేలియాలోను కనిపించే డార్టర్ జాతులు. ఇక మనదేశంలో ఓరియెంటల్ డార్టర్లు ఉంటాయి. మెడతో పాటు ఈ పక్షికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే, సీజన్‌ని బట్టి దీని ఒంటి రంగులో మార్పు వస్తుంది. ఒక్కోసారి నల్లగాను, ఇంకోసారి ముదురు గోధుమవర్ణంలోను, మరికొన్నిసార్లు బూడిదరంగులోను... ఇలా ప్రకృతిలో వచ్చే మార్పుల కారణంగా దాని ఒంటి వర్ణం మార్పులు సంతరించుకుంటూ ఉంటుందట!
 
 మరువలేని నేస్తం... టోనీ!
 ఆమిర్‌ఖాన్ మేనల్లుడు, బాలీవుడ్ హీరో అయిన ఇమ్రాన్ ఖాన్‌కి జంతువులంటే కేవలం ప్రేమ కాదు... పిచ్చి! ఎక్కడ ఏ జంతువు దీనంగా రోడ్ల మీద కనిపించినా ఇంటికి తీసుకొచ్చేస్తారట ఇమ్రాన్. టోనీ అనే కుక్కని అలాగే తీసుకొచ్చారు. ఓరోజు రోడ్డుమీద గాయాలతో కనిపించిన టోనీని తీసుకొచ్చి, వైద్యం చేయించారు. అప్పట్నుంచీ అది ఆయన ప్రపంచమైపోయింది. క్షణం తీరిక దొరికినా దానితోనే గడిపేవారు. కానీ ఓరోజు  ఫుడ్ పాయిజన్ అయి హఠాత్తుగా మరణించింది టోనీ. ఆ విషయం వినగానే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేశారు ఇమ్రాన్. తన జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజు అదేనని ఇప్పటికీ చెబుతుంటారాయన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement