
కరివేపాకు సాగును దున్నివేసిన పొలం
కట్టుబడివారిపాలెం(చిలకలూరిపేటరూరల్): అన్ని ఆధారాలు ఉన్నా సర్వే నిర్వహించి ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేయాలని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అర్జీలు అందించినా ప్రయోజనం కలగలేదు. ఎటువంటి పత్రాలు లేకుండా మరొకరిపేరును సర్వేయర్ రికార్డుల్లో చేర్చారు. స్వార్జితంగా లభించిన భూమిలో కరివేపాకు సాగు చేసుకుంటున్న తరుణంలో పచ్చని పంటపొలాన్ని టీడీపీ నేతలు దున్నివేశారు. ప్రశ్నిస్తే మిమ్మల్ని సైతం పాతరేస్తామని హెచ్చరిస్తున్నారని తల్లికుమారుడు కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్యంతో మంచంలో ఉన్న తల్లి, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయలేక మూడేళ్ల నుంచి పడుతున్న కష్టాలు వెల్లడించారు.
అసలు విషయం ఇదీ..
తల్లీ కుమారుడైన భూలక్ష్మి, శ్రీమంతరావు పేర్కొన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని యడవల్లి రెవిన్యూ పరిధిలోని కట్టుబడివారిపాలెం గ్రామంలో చామకూరి భూలక్ష్మి భర్త చిన పుల్లయ్య మరణించటంతో అనారోగ్యంతో మంచంలో ఉంది. దివ్యాంగుడైన కుమారుడు శ్రీమంతరావు తమకు చెందిన సర్వే నెంబర్ 482–1ఎలోని 2 ఎకరాలు, 482–3లోని 0.53 ఎకరాలు, 447–బిలో 1.60 ఎకరాలు, 454–బిలో 1.70 ఎకరాలు సర్వేలు నిర్వహించి ఆన్‌లైన్‌లో 1బి రిజిస్టర్, అడంగల్ రికార్డుల్లో నమోదు చేయాలని 2015లో మండల సర్వేయర్‌కు అర్జీను అందించారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్‌లు, పట్టాదార్ పాస్‌పుస్తకాల నకలు కాపీలు జత చేశారు. నాటి నుంచి నేటి వరకు సర్వే నిర్వహించలేదు.
అనంతరం మండల తహసీల్దార్, డివిజన్ ఆర్డీవో, గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్, మండల లీగల్ సెల్ అధారిటీలకు అర్జీలు అందించారు. తనకు చెందిన భూమిలో కరివేపాకును సాగు చేసుకుంటూ దివ్యాంగుడిగా ఉండి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు. సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించకపోగా సర్వేనెంబర్ 482–1ఎలోని 1.50 ఎకరాలు, 447–బి1లోని 0.32 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చామకూర లక్ష్మీనారాయణకు ఎటువంటి ఆధారాలు లేకుండా పొజిషన్ సర్టిఫికెట్‌ను మంజూరు చేశారు. సర్వేయర్‌ను ప్రశ్నిస్తే మా ఇష్టం గట్టిగా మాట్లాడితే మిగిలిన భూమిని సైతం మరొకరి పేరుతో సర్టిఫికెట్‌లు మంజూరు చేసి రికార్డుల్లో నమోదు చేస్తామని తెలిపారన్నారు.
పచ్చని పంట పొలాన్ని దున్నేసిన టీడీపీ నేత
సంబంధిత భూమిలో కరివేపాకు సాగు చేసుకుంటున్న తరుణంలో టీడీపీ నాయకుడు లక్ష్మీనారాయణ ఆదివారం రొటేవేటర్‌తో ఉన్న ట్రాక్టర్‌ను తీసుకువచ్చి బలవంతంగా పంట పొలాన్ని దున్నివేశారు. పొలాన్ని దున్నివేయటమే కాకుండా అసభ్యకరంగా దూషించారని తల్లికుమారుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి సంబంధిత పొలాన్ని క్షేత్రస్ధాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లతో పేర్లు నమోదు చేయాలని కోరుతున్నారు. కరివేపాకు పొలాన్ని దున్నివేసి, తనకు నష్టాన్ని కలిగించటంతో సమస్యను పరిష్కరించాలని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై రూరల్ పోలీసులు కేసును విచారిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment