ఓ కప్ కాఫీతో గుండె ఆరోగ్యం పదిలం
ఎక్కువగా కాఫీ, టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంటారు. ఈ సంగతి అటుంచితే రోజూ ఓ కప్ కాఫీ తాగడం వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఓ కప్ కాఫీ తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుందని వెల్లడైంది. దీనివల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని పరిశోధనలో గుర్తించారు.
అమెరికా హర్ట్ అసోసియేషన్ సైంటిఫిక్ సమావేశంలో ఈ నివేదికను సమర్పించారు. 27 మంది పెద్దలపై ప్రయోగం చేశారు. కాఫిన్ కలిపిన కాఫీ తాగిన వారిలో 75 నిమిషాల వ్యవధిలో రక్తప్రసరణ 30 శాతం మెరుగైనట్టు గుర్తించారు. అలాగే కాఫిన్ కలపని కాఫీ తాగినవారిలో ఈ విధమైన మార్పు కనిపించలేదు. జపాన్లోని ఓకినావా యూనివర్సిటీ ఫార్మకాలజీ విభాగం ప్రొఫెసర్ మసాటో సుట్సుయ్ ఈ విషయాన్ని నివేదించారు. కాఫీ తాగే వారిలో గుండె ఎలా మెరుగ్గా పనిచేస్తుందో విశదీకరించారు. కాగా గతంలో కాఫీ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు కాలేయానికి ముప్పు ఏర్పడుతుందని పలు వైద్య నివేదికల్లో తేలింది.