Drink coffee
-
కాఫీకి ఏ పాపం తెలియదు..
లండన్: రోజుకి నాలుగు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె సంబంధ, మధుమేహ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని ఒక అధ్యయనంలో చదువుతాం. ఆ వెంటనే రోజూ ఎక్కువసార్లు కాఫీ తాగడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయని వేరే అధ్యయనం వెలువడుతుంది. ఒక్కోసారి వీటిలో ఏది నిజమో తేల్చుకోలేని సందిగ్ధస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా కాఫీకి సంబంధించిన మరో సరికొత్త అంశాన్ని వెల్లడించారు లండన్ శాస్త్రవేత్తలు. అసలు కాఫీ వల్ల మనకు వ్యాధులు రావడం,రాకపోవడం జరగదని వీరి తాజా అధ్యయనంలో తేలింది. మన శరీరంలోని రోగాలను కాఫీ ఏవిధంగానూ ప్రభావితం చేయలేదని కచ్చితంగా చెబుతున్నారు. మనలోని జన్యువులు కాఫీ ప్రభావానికి ఏ విధంగా లోనవుతాయన్న కోణంలో కోపెన్హాగన్ విశ్వవిద్యాలయం, జెన్టోఫ్టి ఆసుపత్రి వర్గాలు సంయుక్తంగా చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
ఓ కప్ కాఫీతో గుండె ఆరోగ్యం పదిలం
ఎక్కువగా కాఫీ, టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంటారు. ఈ సంగతి అటుంచితే రోజూ ఓ కప్ కాఫీ తాగడం వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఓ కప్ కాఫీ తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుందని వెల్లడైంది. దీనివల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని పరిశోధనలో గుర్తించారు. అమెరికా హర్ట్ అసోసియేషన్ సైంటిఫిక్ సమావేశంలో ఈ నివేదికను సమర్పించారు. 27 మంది పెద్దలపై ప్రయోగం చేశారు. కాఫిన్ కలిపిన కాఫీ తాగిన వారిలో 75 నిమిషాల వ్యవధిలో రక్తప్రసరణ 30 శాతం మెరుగైనట్టు గుర్తించారు. అలాగే కాఫిన్ కలపని కాఫీ తాగినవారిలో ఈ విధమైన మార్పు కనిపించలేదు. జపాన్లోని ఓకినావా యూనివర్సిటీ ఫార్మకాలజీ విభాగం ప్రొఫెసర్ మసాటో సుట్సుయ్ ఈ విషయాన్ని నివేదించారు. కాఫీ తాగే వారిలో గుండె ఎలా మెరుగ్గా పనిచేస్తుందో విశదీకరించారు. కాగా గతంలో కాఫీ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు కాలేయానికి ముప్పు ఏర్పడుతుందని పలు వైద్య నివేదికల్లో తేలింది.