కాఫీకి ఏ పాపం తెలియదు..
లండన్: రోజుకి నాలుగు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె సంబంధ, మధుమేహ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని ఒక అధ్యయనంలో చదువుతాం. ఆ వెంటనే రోజూ ఎక్కువసార్లు కాఫీ తాగడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయని వేరే అధ్యయనం వెలువడుతుంది. ఒక్కోసారి వీటిలో ఏది నిజమో తేల్చుకోలేని సందిగ్ధస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా కాఫీకి సంబంధించిన మరో సరికొత్త అంశాన్ని వెల్లడించారు లండన్ శాస్త్రవేత్తలు.
అసలు కాఫీ వల్ల మనకు వ్యాధులు రావడం,రాకపోవడం జరగదని వీరి తాజా అధ్యయనంలో తేలింది. మన శరీరంలోని రోగాలను కాఫీ ఏవిధంగానూ ప్రభావితం చేయలేదని కచ్చితంగా చెబుతున్నారు. మనలోని జన్యువులు కాఫీ ప్రభావానికి ఏ విధంగా లోనవుతాయన్న కోణంలో కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయం, జెన్టోఫ్టి ఆసుపత్రి వర్గాలు సంయుక్తంగా చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.