
ఆఫ్రికాలో పుట్టిన టిబి
ప్రాణాంతకవ్యాధిగా ముద్ర వేసుకున్న క్షయ (టీబీ-ట్యుబర్క్యూలోసిస్) వ్యాధి ఆఫ్రికాలో పుట్టినట్లు వెల్లడైంది. కొన్ని దశాబ్దాల కిందట చాలామంది ఈ వ్యాధిబారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి కారణమేంటని శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆఫ్రికాలో డెబ్బైవేల సంవత్సరాల క్రితం ఆటవికుల సమూహం ఒకటి ఉండేదట. వారే ఈ వ్యాధికి కారణమనే వాస్తవాన్ని శాస్త్రజ్ఞులు వెలికి తీశారు. అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల బృందం ఒక పరిశోధనలో ఈ అంశాన్ని వెల్లడించింది. పదివేల సంవత్సరాల క్రితం ఈ వ్యాధి జంతువుల ద్వారా మానవులకు సంక్రమించిందని ఇప్పటి వరకూ చేసిన పరిశోధనలు తెలిపాయి. మానవులకు, టీబీ వ్యాధికి చాలాకాలంగా అవినాభావ సంబంధం ఉందని నేచర్ జెనెటిక్స్ పత్రిక వెల్లడించింది. ఏటా మిలియన్ మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నట్లు కూడా ఇందులో తెలిపింది.
ఆఫ్రికాలో నియోలిథిక్ డెమోగ్రఫిక్ ట్రాన్‌సిషన్ (ఎన్‌డిటి) ద్వారా పది వేల సంవత్సరాల క్రితం ఈ వ్యాధి సంక్రమించిందని ఇంతకు ముందు పరిశోధనలు తెలియచేశాయి. అప్పట్లో జనాభా పెరుగుదలతో, వారి అవసరాలకు అనుగుణంగా వ్యవసాయం అభివృద్ధి చెందిందని, మానవజీవితంలో ప్రధాన పాత్ర పోషించిందని ఈ పరిశోధనం తెలియచేస్తోంది. భౌగోళిక అంశాలను, ఆనువంశికంగా వచ్చే అంశాలను మిళితం చేస్తూ మొత్తం 259 మంది నుంచి టీబీకి సంబంధించిన నమూనాలను సేకరించి, దాని పుట్టుపూర్వోత్తరాలను పరిశోధించి, ఈ వ్యాధి ఆఫ్రికాలో పుట్టిందని నిర్ధరించారు.
స్విట్జర్లాండ్‌కి చెందిన పబ్లిక్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న ప్రొఫెసర్ సెబాస్టియన్ గాగ్‌నుయెక్స్... ‘‘చాలా కాలం క్రితమే మానవుల ఉనికి, టీబీ ఉనికి ఒకసారే వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికాలో అరవై వేల సంవత్సరాల క్రితమే వీరి పుట్టుక ఆరంభమయ్యింది. ఎన్‌డిటీ సమయంలో టీబీ వ్యాధి ముందుగా మానవులలో ప్రారంభమై, క్రమేపీ జంతువులకు సంక్రమించింది. ఇది ప్రాణాంతక వ్యాధి అయినప్పుడు, కొద్దిమంది మాత్రమే మరణించి ఉండేవారు కాదు. ఇది పరిణామ క్రమం చెందుతున్న వ్యాధి. రోగుల సంఖ్యతో పాటు వైరస్ కూడా పెరగడం ప్రారంభమైంది’’ అని తెలిపారు. మానవాళిలో రకరకాల జాతుల మధ్య, 60 వేల సంవత్సరాలుగా ఈ వ్యాధి ఏ విధంగా పాతుకుపోయిందనే అంశం మీద ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.
మిగిలిన వ్యాధులలా కాకుండా టీబీ వ్యాధికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఏ లక్షణాలూ ముందుగానే బయటపడకుండా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ముందర తగ్గినట్టు అనిపించినా, మళ్లీ కొన్నాళ్లకి తిరగబెడుతుంది. టీబీ పెరుగుదల, తరుగుదల వంటివి ఏ విధంగా చోటుచేసుకుంటున్నాయి... అనే అంశం మీద పరిశోధన చేస్తున్నామని, పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ ఇనాకా కోమాస్ అన్నారు. టీబీ ప్రపంచవ్యాప్తంగా భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యాధి. 2011లో 1.4 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణించినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ-వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) తెలియచేసింది. ఈ వ్యాధి మానవులను ఏ విధంగా పీడిస్తోందో, మానవులు ఈ వ్యాధి ఒకేసారి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారనే విషయం కనుక శాస్త్రజ్ఞులు పరిశోధించగలిగితే, ఈ వ్యాధి మరింత బలపడకుండా తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది.
పాతోజెన్ బయాలజీ లెక్చరర్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో డయాగ్నసిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ రుత్ మెక్‌నెర్మీ, టీబీ కదలికలను కనిపెట్టడంలో ఒక అడుగు ముందుకు వేసి, ‘‘ఇప్పుడు వేలకొలదీ టీబీ క్రిములను సేకరించాం. రానున్న ఐదు సంవత్సరాలలో టీబీకి సంబంధించి ఎన్నో ఆసక్తిదాయకమైన విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది’’ అని సంబరంగా చెబుతున్నారు. పరిశోధనలో ఇది శుభపరిణామంగా భావించవచ్చు.