చింటూ ఆఫీసు వద్ద సీసీ పుటేజీల స్వాధీనం
సెల్‌ఫోన్ కాల్స్ జాబితా ఆధారంగా విచారణ
అదుపులో చింటూ సన్నిహితులు
అజ్ఞాతంలో మరికొందరు
చింటూ కాల్ డేటా విశ్లేషణలో పోలీసులు
మేయర్ దంపతుల జంట హత్య కేసు
చిత్తూరు : చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో దుండగులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన చంద్రశేఖర్ అలియాస్ చింటూకు కంప్యూటర్ పరిజ్ఞానం, సెల్‌ఫోన్లలో పలు యాప్స్‌పై బాగా పట్టున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అదనపు డీజీ ఠాకూర్ సైతం దీన్ని ధ్రువీకరించారు.
చింటూ కోసం ఇప్పటికే పది బృందాలు గాలిస్తుండగా, దుండగులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ స్థాయిలో వినియోగించుకున్నారో తెలుసుకోవడానికి కమ్యూనికేషన్స్, సైబర్ క్రైమ్ నిపుణులైన పోలీసు అధికారులు ఇప్పటికే కొంతవరకు కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పోలీస్ శాఖ పెదవి విప్పడం లేదు.
సీసీ ఫుటేజీలు స్వాధీనం
నగరంలోని గంగనపల్లె వద్ద ఉన్న తన కార్యాలయం వద్ద చింటూ నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని ఓ టీవీకి అనుసంధానం చేసి నిత్యం ఈ దారిలో ఏయే సమయంలో, ఎవరెవరు వస్తున్నారో తెలుసుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. అలాగే అతడి కార్యాలయానికి వచ్చే వారి వివరాలు సైతం స్టోరేజ్ రికార్డర్ రైటర్‌లో నిక్షిప్తం అయి ఉండటాన్ని పోలీసులు కనుగొని దానిని స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా కూడా పలువురినీ ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే చింటూ సెల్ నంబరుకు మూడు నెలలుగా వచ్చిన ఇన్‌కమింగ్ కాల్స్, ఔట్ గోయింగ్ కాల్స్ జాబితాను పోలీసులు తీసుకున్నారు. ఇందులో ప్రతీ కాల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
సన్నిహితులపై విచారణ
ఈ కేసులో చింటూకు సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో కొందరు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీళ్లకు హత్య ఘటనలో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరాా తీస్తున్నారు. అలాగే సంతపేటకు చెందిన ఓ వ్యక్తిని, గంగనపల్లెకు చెందిన ఇద్దరిని, ఎస్టేట్‌కు చెందిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. ప్రధానంగా సంతపేటకు చెందిన అధికార పార్టీ కార్పొరేటర్ భర్తను విచారణ చేయడానికి ప్రయత్నిస్తుండగా అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.