రాజధాని గేట్‌వే గన్నవరం!
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరానికి గన్నవరం ముఖద్వారం కాబోతోంది. గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద అమరావతి గేట్‌వే పేరుతో భారీ కట్టడాన్ని నిర్మించి అక్కడినుంచి రాజధానిలోని డౌన్‌టౌన్ వరకూ ఆరు వరుసల రహదారిని నిర్మించనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకురాగానే అమరావతి నగరం అద్భుతంగా ఉందనిపించేలా ఈ గేట్‌వేను నిర్మించాలని యోచిస్తున్నారు. సీడ్ కేపిటల్ ప్రణాళికలో సింగపూర్ ప్రభుత్వ సంస్థలు ఈ గేట్‌వే, రహదారి మధ్యలో ఐకానిక్ బ్రిడ్జి నమూనాలను ప్రతిపాదించాయి. ఇందుకోసం సీఆర్‌డీఏ అధికారులు వ్యూహరచన చేస్తున్నారు.
సీడ్ కేపిటల్ ప్రణాళిక ప్రకారం కృష్ణానదిపై మూడు బ్రిడ్జిలు నిర్మించాల్సివుంది. మూడింటినీ ఒకేసారి చేపట్టడం సాధ్యం కాదు కాబట్టి తొలుత విజయవాడ వైపు నుంచి రాజధానిలోకి ప్రవేశించే చోట ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. ఆ మేరకు కృష్ణానదిపై విజయవాడ శివారు గొల్లపూడి-ఇబ్రహీంపట్నం మధ్య నుంచి.. అవతలివైపు రాజధాని నగరంలోని తాళ్లాయపాలెం-లింగాయపాలెం సమీపం వరకూ దీన్ని నిర్మించాలని యోచన. కాగా బ్రిడ్జిని కచ్చితంగా ఎక్కడినుంచి ప్రారంభించి ఎక్కడివరకూ నిర్మించాలనే దానిపై సర్వే నిర్వహిస్తున్నారు. కాగా ఐకానిక్ బ్రిడ్జి నుంచి అమరావతి నగరంలోకి ప్రవేశించేచోట మరో గేట్‌వే టవర్‌ను నిర్మిస్తారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో మూడు రింగురోడ్లను ప్రతిపాదించారు. ఇవిగాక ఐదు, తొమ్మిదో నంబరు జాతీయ రహదారుల్ని అనుసంధానిస్తూ కృష్ణా-గుంటూరు జిల్లాలమధ్య పశ్చిమ బైపాస్ రహదారి నిర్మాణం చేపట్టాల్సివుంది. ఐకానిక్ బ్రిడ్జి-ఆరు వరుసల రహదారిని వీటిలో ఒకటిగా చేపడతారా లేదా విడిగా చేపడతారా అనేదానిపై స్పష్టత లేదు. సాధ్యమైనవరకూ ఇప్పుడున్న, ఇప్పటికే ప్రతిపాదించిన రోడ్లకు సంబంధం లేకుండా ఐకానిక్ బ్రిడ్జి ఉంటుందని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి.