Iconic bridge
-
Phu Quoc: వెహికిల్స్‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే ఇది... కిస్సింగ్ బ్రిడ్జి
వియత్నాంలో అది అనగనగా ఓ వంతెన. కానీ దాన్ని కట్టింది అన్ని వంతెనల మాదిరిగా అటూ ఇటూ దాటడానికి కాదు. ముద్దులు పెట్టుకోవడానికి! అవును. వినడానికే విచిత్రంగా ఉంది కదూ! దక్షిణ వియత్నాంలోని ఫూక్వోక్ ద్వీపం అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి. అక్కడి సన్‌సెట్ సిటీలో ఇటీవల నిర్మించిన 800 మీటర్ల పై చిలుకు పొడవైన బ్రిడ్జి అందరినీ ఎంతగానో అలరిస్తోంది. ఇది ముద్దుల బ్రిడ్జి కావడమే ఇందుకు కారణం. దీని డిజైన్‌ను ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ మార్కో కాసామోంటీ రూపొందించాడు. లగ్జరీ టూరిజం డెవలపర్ సంస్థ సన్ గ్రూప్ నిర్మించింది. ఆడమ్ సృష్టికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు మైకేలాంజిలో సిస్టిన్ చాపెల్‌లో సృజించిన ఫ్రెస్కో పెయింటింగ్ స్ఫూర్తితో దీని డిజైన్‌కు రూపకల్పన చేశారు. రెండు సగాలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ పెయింటింగ్‌లోని రెండు చూపుడు వేళ్ల మాదిరిగానే బ్రిడ్జి తాలూకు రెండు సగాలు కూడా పరస్పరం తాకవు. వాటి మధ్య 30 సెంటీమీటర్ల దూరముంటుంది. దూరంనుంచి చూస్తే ఆ రెండు కొనలూ ఒకదాన్నొకటి చుంబించుకుంటున్నట్టుగానే ఉండటం మరో విశేషం! ముద్దులాడాలనుకునే జంటలో ఒకరు ఆ సగం నుంచి, మరొకరు ఈ సగం మీద నుంచుని వీలైనంతగా ముందుకు వంగాలన్నమాట! ఆ మీదట పెదాలకు పని చెబుతూ తమ ప్రేమను వ్యక్తపరుచుకోవచ్చు. పెళ్లికి ప్రపోజ్ చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జి పేరు చౌ హోన్. దాని అర్థం కూడా ‘పెళ్లికి ప్రపోజ్ చేసుకోవడం’ కావడం మరో విశేషం. వారం క్రితం ప్రారంభించిన ఈ బ్రిడ్జి చూస్తుండగానే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. దాన్ని చూడటానికి, చెరోవైపు నుంచి రొమాంటిక్‌గా ముద్దులాడటానికి జంటలు భారీగా వస్తున్నాయట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.120 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి
సాక్షి, హైదరాబాద్: వంతెనపై నడుస్తుంటే రెండు వైపులా రకరకాల దుకాణాలు.. రారమ్మని ఆహ్వానిస్తూ కొనుగోలు చేయమంటున్న సరుకులు. కాస్త అలసిపోయినట్లు అనిపిస్తే సేద తీరేందుకు బెంచీలు. వీటితోపాటు అక్కడక్కడా పచ్చని చెట్లు.. వాటి కింద కూర్చునే ఏర్పాట్లు. బృందంగా వెళ్లే వారు వినోదాలు చేసుకోవాలనుకుంటే తగిన స్థలం.వీనుల విందు.. కళ్లకు ఆనందం కలిగించేలా వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు. ముషాయిరాలు తదితరమైన వాటికి ఎంతో సదుపాయం. షాపింగ్తోపాటే వ్యాహ్యాళి, మనసుకు ఆహ్లాదం. వీటన్నింటితో పాటు నట్టనడుమ నిలువెత్తు క్లాక్‌టవర్. నాలుగు దిక్కుల నుంచీ సమయాన్ని చూపించే గడియారాలు. ఇవీ నగరంలో చారిత్రక మూసీపై కొత్తగా నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జిపై ఉండే విశేషాలు. నగరంలో వివిధ ప్రాజెక్టులతో సరికొత్త అందాలు సృష్టించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం పాతబస్తీ, కొత్త సిటీ నడుమ మరో అద్భుతమైన వంతెనను అందుబాటులోకి తేనుంది. ఓవైపు నగర చారిత్రక, వారసత్వ సంపదలను పరిరక్షిస్తూనే మరోవైపు సరికొత్త పర్యాటక ఆకర్షణలను ఏర్పాటు చేస్తూ దీన్ని నిర్మించనుంది. వాహనాలకు ఎలాంటి అనుమతుల్లేకుండా కేవలం పాదచారుల కోసమే ఈ ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. పర్యాటకులను ఆకట్టుకునే ఈ ప్రాజెక్టుతో చార్మినార్ పాదచారుల పథకంలో భాగంగా ఉపాధి కోల్పోతున్న చిరు వ్యాపారులకు ఇక్కడ వ్యాపారావకాశం కల్పించనుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా చార్మినార్ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశంగా గుర్తించగా, చార్మినార్ వద్ద నుంచి తరలించే చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం ఈ ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనుంది. పాతబస్తీకి కొత్త సిటీకి వారధి చారిత్రక మూసీపై అటు సాలార్జంగ్ మ్యూజియం నుంచి ఇటు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ వైపు ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు. 200 మీటర్ల పొడవు, 72 మీటర్ల వెడల్పుతో ఉండే ఈ బ్రిడ్జిపై వివిధ వరుసల్లో 25*25 మీటర్ల సైజుతో చిరు వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటు చేస్తారు. చార్మినార్ పాదచారుల పథకంలో భాగంగా అక్కడి వ్యాపారులను ఇక్కడకు తరలిస్తారు. వర్షం వస్తే తల దాచుకునేందుకు మూడు ప్రాం తాల్లో షెల్టర్లుంటాయి. విదేశాల్లో మాదిరిగా షాపింగ్ చేసే వారి కోసం రిక్రియేషన్ జోన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాదాపు 200 మంది వీక్షించేలా ఏర్పాట్లుంటాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ బ్రిడ్జి అంచనా వ్యయం దాదాపు రూ.120 కోట్లు. తుది ప్రతిపాదనలు పూర్తయ్యాయని, ప్రభుత్వం ఓకే చేయాల్సి ఉం దని ఈ ప్రాజెక్టు పనులు చేపడుతున్న హైదరా బాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్) చీఫ్ ఇంజనీర్ మోహన్‌నాయక్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు పనులు మొదలయ్యాక ఏడాది పడుతుందన్నారు. ఈ ప్రాజెక్టుతో చార్మినార్ దగ్గరి వ్యాపారుల ఉపాధికి ఢోకా లేకపోవడమే కాక, మరింత వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉందని జీహెచ్ఎంసీ సౌత్‌జోన్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. నగర హెరిటేజ్‌కు, ఆధునికతలకు ఇది వారధి కానుందని జీహెచ్ఎంసీ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. మరో పాలికా బజార్..! ఢిల్లీ కనాట్ ప్లేస్ ఇన్నర్, ఔటర్ సర్కిళ్ల మధ్య అండర్‌గ్రౌండ్‌లో పాలికా బజార్ ఉంది. అక్కడ దాదాపు 400 దుకాణాలున్నాయి. ఏ సమయంలో చూసినా అక్కడ దాదాపు 15వేల మంది ఉంటారు. ఢిల్లీకి వచ్చే పర్యాటకులు, ముఖ్యంగా విదేశీ పర్యాటకులు పాలికాబజార్ను సందర్శించకుండా పోరు. అక్కడి పాలికాబజార్ భూగర్భంలో ఉంటే , ఇక్కడి ‘పాలికాబజార్’భూమిపైన వెలిసే వంతెనపై రానుంది. -
కాకినాడలో ఐకానిక్ వంతెన
♦ సీఎం చంద్రబాబు హామీ ♦ నిరుద్యోగ భృతిని త్వరలో ప్రారంభిస్తా ♦ చనిపోతే రూ. 2 లక్షలు ఇస్తా ♦ పెద్దకర్మ రోజున సంతాప లేఖ పంపిస్తా ♦ ప్రసంగం ముగిస్తూ మళ్లీ మళ్లీ ప్రారంభం ∙ ♦ తనను నమ్మాలంటూ అభ్యర్థన సాక్షి, కాకినాడ : కాకినాడ జగన్నాథపురంలోని ఉప్పుటేరు వద్ద ఐకానిక్ వంతెన నిర్మిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఆదివారం జగన్నాథపురం వెంకటేశ్వరస్వామి దేవాలయం సెంటర్లో ప్రజలనుద్ధేశించి సీఎం ప్రసంగించారు. జగన్నాథపురాన్ని సుందరంగా చేస్తానని హామీ ఇచ్చారు. సింగపూర్, దుబాయ్ దేశాల్లోలాగా జగన్నాథపురం ఉప్పుటేరుపై ఐకానిక్ వంతెన నిర్మాస్తానని, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఉప్పటేరుపై త్వరలో రింగురోడ్డు వస్తుందన్నారు. కాకినాడ ప్రజలు విదేశాలకు రాజమహేంద్రవరం నుంచే వెళ్లేలా విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నామని, రాజానగరం నుంచి కాకినాడకు 45 నిమిషాల్లో చేరుకునేలా రోడ్డు నిర్మిస్తామన్నారు. మత్స్యకారుల జీవితాల్లో మార్పు, వెలుగు తెస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఆదివారం హ్యాపీ సండే పేరుతో ప్రజలు పనులను ఆపివేసి ఆనందంగా ఉండేలా చేశానని పేర్కొన్నారు. పందుల బెడద, కుక్కల నిర్మూలనకు ఇంజెక్షన్లు చేయించానని తెలిపారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించేలా తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకూ నెలకు రూ.2 వేల చొప్పున ఇచ్చేలా నిరుద్యోగ భృతిని త్వరలో ప్రారంభిస్తానని తెలిపారు. జగన్నాథపురంలో పేదలకు తక్కువ ధరకే ఆహారం అందిచేందుకు త్వరలో అన్న క్యాంటిన్లు ప్రారంభిస్తానని తెలిపారు. చనిపోతే రూ.2 లక్షలు ఇస్తాం.. ఇకపై ఎవరైనా 50 ఏళ్లు లోపు సహజంగా చనిపోతే చంద్రన్న బీమా పథకం ద్వారా రూ. 2 లక్షలు పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదే 60 ఏళ్లు దాటిన వారు చనిపోతే ఇప్పటిలాగే రూ.30 వేలు ఇస్తామని చెప్పారు. పెద్దకర్మ రోజునే వారి ఖాతాలో డబ్బులు వేసి, సంతాప లేఖ కూడా పంపిస్తానని సీఎం స్పష్టం చేశారు. టెక్నాలజీ ద్వారా సముద్రంలో చేపలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి మత్స్యకారుల వేటకు సహాయం అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నన్ను నమ్మండి.. ఓట్లు వేయండి... జగన్నాథపురం సభకు మధ్యాహ్నం 3:30 గంటలకు వచ్చిన సీఎం సాయంత్రం 4:45 నిమిషాల వరకు ఉన్నారు. గంటకు పైగా మాట్లాడిన సీఎం చివరి పదిహేను నిమిషాల్లో ఆరుసార్లు ప్రసంగం ముగిస్తూ తిరిగి మాట్లాడడం ప్రారంభించారు. పదే పదే తనను నమ్మాలని అడుగుతూ టీడీపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ప్రతిసారీ వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలు గుప్పిస్తూ టీడీపీకి ఓట్లు వేయాలని కోరారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. మీ రుణం తీర్చుకుంటానని, మళ్లీ కాకినాడకు వస్తానని తన మామ ఎన్టీ రామారావు అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. ఎన్టీ రామారావు అమర్ రహే అంటూ సభికులతో పలికించారు. -
రాజధాని గేట్‌వే గన్నవరం!
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరానికి గన్నవరం ముఖద్వారం కాబోతోంది. గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద అమరావతి గేట్‌వే పేరుతో భారీ కట్టడాన్ని నిర్మించి అక్కడినుంచి రాజధానిలోని డౌన్‌టౌన్ వరకూ ఆరు వరుసల రహదారిని నిర్మించనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకురాగానే అమరావతి నగరం అద్భుతంగా ఉందనిపించేలా ఈ గేట్‌వేను నిర్మించాలని యోచిస్తున్నారు. సీడ్ కేపిటల్ ప్రణాళికలో సింగపూర్ ప్రభుత్వ సంస్థలు ఈ గేట్‌వే, రహదారి మధ్యలో ఐకానిక్ బ్రిడ్జి నమూనాలను ప్రతిపాదించాయి. ఇందుకోసం సీఆర్డీఏ అధికారులు వ్యూహరచన చేస్తున్నారు. సీడ్ కేపిటల్ ప్రణాళిక ప్రకారం కృష్ణానదిపై మూడు బ్రిడ్జిలు నిర్మించాల్సివుంది. మూడింటినీ ఒకేసారి చేపట్టడం సాధ్యం కాదు కాబట్టి తొలుత విజయవాడ వైపు నుంచి రాజధానిలోకి ప్రవేశించే చోట ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. ఆ మేరకు కృష్ణానదిపై విజయవాడ శివారు గొల్లపూడి-ఇబ్రహీంపట్నం మధ్య నుంచి.. అవతలివైపు రాజధాని నగరంలోని తాళ్లాయపాలెం-లింగాయపాలెం సమీపం వరకూ దీన్ని నిర్మించాలని యోచన. కాగా బ్రిడ్జిని కచ్చితంగా ఎక్కడినుంచి ప్రారంభించి ఎక్కడివరకూ నిర్మించాలనే దానిపై సర్వే నిర్వహిస్తున్నారు. కాగా ఐకానిక్ బ్రిడ్జి నుంచి అమరావతి నగరంలోకి ప్రవేశించేచోట మరో గేట్‌వే టవర్‌ను నిర్మిస్తారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో మూడు రింగురోడ్లను ప్రతిపాదించారు. ఇవిగాక ఐదు, తొమ్మిదో నంబరు జాతీయ రహదారుల్ని అనుసంధానిస్తూ కృష్ణా-గుంటూరు జిల్లాలమధ్య పశ్చిమ బైపాస్ రహదారి నిర్మాణం చేపట్టాల్సివుంది. ఐకానిక్ బ్రిడ్జి-ఆరు వరుసల రహదారిని వీటిలో ఒకటిగా చేపడతారా లేదా విడిగా చేపడతారా అనేదానిపై స్పష్టత లేదు. సాధ్యమైనవరకూ ఇప్పుడున్న, ఇప్పటికే ప్రతిపాదించిన రోడ్లకు సంబంధం లేకుండా ఐకానిక్ బ్రిడ్జి ఉంటుందని సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి.