Phu Quoc: వెహికిల్స్‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే ఇది... కిస్సింగ్‌ బ్రిడ్జి | Kiss Bridge: Kiss Bridge New Tourism Symbol In Southern Phu Quoc - Sakshi
Sakshi News home page

Phu Quoc Kiss Bridge: వెహికిల్స్‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే ఇది... కిస్సింగ్‌ బ్రిడ్జి

Published Thu, Dec 28 2023 3:48 AM | Last Updated on Thu, Dec 28 2023 1:05 PM

Kiss Bridge: Kiss Bridge new tourism symbol in southern Phu Quoc - Sakshi

వియత్నాంలో అది అనగనగా ఓ వంతెన. కానీ దాన్ని కట్టింది అన్ని వంతెనల మాదిరిగా అటూ ఇటూ దాటడానికి కాదు. ముద్దులు పెట్టుకోవడానికి! అవును. వినడానికే విచిత్రంగా ఉంది కదూ! దక్షిణ వియత్నాంలోని ఫూక్వోక్‌ ద్వీపం అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి. అక్కడి సన్‌సెట్‌ సిటీలో ఇటీవల నిర్మించిన 800 మీటర్ల పై చిలుకు పొడవైన బ్రిడ్జి అందరినీ ఎంతగానో అలరిస్తోంది.

ఇది ముద్దుల బ్రిడ్జి కావడమే ఇందుకు కారణం.  దీని డిజైన్‌ను ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్‌ మార్కో కాసామోంటీ రూపొందించాడు. లగ్జరీ టూరిజం డెవలపర్‌ సంస్థ సన్‌ గ్రూప్‌ నిర్మించింది. ఆడమ్‌ సృష్టికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు మైకేలాంజిలో సిస్టిన్‌ చాపెల్‌లో సృజించిన ఫ్రెస్కో పెయింటింగ్‌ స్ఫూర్తితో దీని డిజైన్‌కు రూపకల్పన చేశారు. రెండు సగాలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది.

ఆ పెయింటింగ్‌లోని రెండు చూపుడు వేళ్ల మాదిరిగానే బ్రిడ్జి తాలూకు రెండు సగాలు కూడా పరస్పరం తాకవు. వాటి మధ్య 30 సెంటీమీటర్ల దూరముంటుంది. దూరంనుంచి చూస్తే ఆ రెండు కొనలూ ఒకదాన్నొకటి చుంబించుకుంటున్నట్టుగానే ఉండటం మరో విశేషం! ముద్దులాడాలనుకునే జంటలో ఒకరు ఆ సగం నుంచి, మరొకరు ఈ సగం మీద నుంచుని వీలైనంతగా ముందుకు వంగాలన్నమాట!

ఆ మీదట పెదాలకు పని చెబుతూ తమ ప్రేమను వ్యక్తపరుచుకోవచ్చు. పెళ్లికి  ప్రపోజ్‌ చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జి పేరు చౌ హోన్‌. దాని అర్థం కూడా ‘పెళ్లికి ప్రపోజ్‌ చేసుకోవడం’ కావడం మరో విశేషం. వారం క్రితం ప్రారంభించిన ఈ బ్రిడ్జి చూస్తుండగానే ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారింది. దాన్ని చూడటానికి, చెరోవైపు నుంచి రొమాంటిక్‌గా ముద్దులాడటానికి జంటలు భారీగా వస్తున్నాయట!

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement