కాకినాడలో ఐకానిక్ వంతెన
♦ సీఎం చంద్రబాబు హామీ
♦ నిరుద్యోగ భృతిని త్వరలో ప్రారంభిస్తా
♦ చనిపోతే రూ. 2 లక్షలు ఇస్తా
♦ పెద్దకర్మ రోజున సంతాప లేఖ పంపిస్తా
♦ ప్రసంగం ముగిస్తూ మళ్లీ మళ్లీ ప్రారంభం ∙
♦ తనను నమ్మాలంటూ అభ్యర్థన
సాక్షి, కాకినాడ : కాకినాడ జగన్నాథపురంలోని ఉప్పుటేరు వద్ద ఐకానిక్ వంతెన నిర్మిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఆదివారం జగన్నాథపురం వెంకటేశ్వరస్వామి దేవాలయం సెంటర్‌లో ప్రజలనుద్ధేశించి సీఎం ప్రసంగించారు. జగన్నాథపురాన్ని సుందరంగా చేస్తానని హామీ ఇచ్చారు. సింగపూర్, దుబాయ్ దేశాల్లోలాగా జగన్నాథపురం ఉప్పుటేరుపై ఐకానిక్ వంతెన నిర్మాస్తానని, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఉప్పటేరుపై త్వరలో రింగురోడ్డు వస్తుందన్నారు. కాకినాడ ప్రజలు విదేశాలకు రాజమహేంద్రవరం నుంచే వెళ్లేలా విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నామని, రాజానగరం నుంచి కాకినాడకు 45 నిమిషాల్లో చేరుకునేలా రోడ్డు నిర్మిస్తామన్నారు.
మత్స్యకారుల జీవితాల్లో మార్పు, వెలుగు తెస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఆదివారం హ్యాపీ సండే పేరుతో ప్రజలు పనులను ఆపివేసి ఆనందంగా ఉండేలా చేశానని పేర్కొన్నారు. పందుల బెడద, కుక్కల నిర్మూలనకు ఇంజెక్షన్లు చేయించానని తెలిపారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించేలా తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకూ నెలకు రూ.2 వేల చొప్పున ఇచ్చేలా నిరుద్యోగ భృతిని త్వరలో ప్రారంభిస్తానని తెలిపారు. జగన్నాథపురంలో పేదలకు తక్కువ ధరకే ఆహారం అందిచేందుకు త్వరలో అన్న క్యాంటిన్లు ప్రారంభిస్తానని తెలిపారు.
చనిపోతే రూ.2 లక్షలు ఇస్తాం..
ఇకపై ఎవరైనా 50 ఏళ్లు లోపు సహజంగా చనిపోతే చంద్రన్న బీమా పథకం ద్వారా రూ. 2 లక్షలు పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదే 60 ఏళ్లు దాటిన వారు చనిపోతే ఇప్పటిలాగే రూ.30 వేలు ఇస్తామని చెప్పారు. పెద్దకర్మ రోజునే వారి ఖాతాలో డబ్బులు వేసి, సంతాప లేఖ కూడా పంపిస్తానని సీఎం స్పష్టం చేశారు. టెక్నాలజీ ద్వారా సముద్రంలో చేపలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి మత్స్యకారుల వేటకు సహాయం అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
నన్ను నమ్మండి.. ఓట్లు వేయండి...
జగన్నాథపురం సభకు మధ్యాహ్నం 3:30 గంటలకు వచ్చిన సీఎం సాయంత్రం 4:45 నిమిషాల వరకు ఉన్నారు. గంటకు పైగా మాట్లాడిన సీఎం చివరి పదిహేను నిమిషాల్లో ఆరుసార్లు ప్రసంగం ముగిస్తూ తిరిగి మాట్లాడడం ప్రారంభించారు. పదే పదే తనను నమ్మాలని అడుగుతూ టీడీపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ప్రతిసారీ వైఎస్సార్‌సీపీ నేతలపై ఆరోపణలు గుప్పిస్తూ టీడీపీకి ఓట్లు వేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. మీ రుణం తీర్చుకుంటానని, మళ్లీ కాకినాడకు వస్తానని తన మామ ఎన్టీ రామారావు అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. ఎన్టీ రామారావు అమర్ రహే అంటూ సభికులతో పలికించారు.