'పుష్కర ఏర్పాట్లు అగమ్యగోచరం'
కాళేశ్వరం: త్రివేణి సంగమమైన కాళేశ్వర పుణ్య క్షేత్రంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు అగమ్యగోచరంగా ఉన్నాయని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద విమర్శించారు. బుధవారం ఆమె కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. లక్షలాది మంది భక్తులు వచ్చే క్షేత్రంలో పుష్కరాల కోసం కనీస ఏర్పాట్లు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఘాట్‌ల వద్ద కనీస సౌకర్యాలు లేవని, ఎండవేడిమి పెరగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పుష్కరాల్లో ఇంకా 10 రోజులు మిగిలి ఉన్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకుని కనీస వసతులు కల్పించాలని కోరారు.