
3 రోజుల పాటు భారీ వర్షాలు
- వాతావరణ శాఖ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్ప హైదరాబాద్ వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలో రుతుపవనాలు ఊపందుకున్నాయని వెల్లడించింది. దీంతో 3 రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు.
కాగా, ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా పేరూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైం ది. గూడూరు, మిర్యాలగూడలో 8 సెం.మీ., వెంకటాపురం, ఖమ్మం, కొణిజర్లల్లో 6 సెం. మీ., పాలకుర్తి, సారంగాపూర్, కూనవరం, గాంధారి, దోమకొండ, నిర్మల్, మణుగూరులో 5 సెం.మీ. చొప్పుననమోదైంది. సిర్పూర్(టి), ఇబ్రహీంపట్నం, పినపాక, కొత్తగూడెం, మేడ్చల్, కొల్హాపూర్, జనగాం, ఏటూరునాగారం, నారాయణఖేడ్‌లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
వాగుదాటినా.. ప్రాణం నిలవలే..
బెజ్జూర్: ఆదిలాబాద్ జిల్లాలో రహదారి కష్టాలకు ఈ ఫొటో నిదర్శనం.. వానొచ్చినా.. వరదొచ్చినా.. వాగులు ఉప్పొంగితే ప్రజల ప్రాణాలకు ముప్పొచ్చినట్లే.. జిల్లాలోని బెజ్జూరు మండలంలోని కుశ్నపెల్లికి చెందిన నికాడి గౌరుబాయి(45), శ్రీరామ పద్మ(35) మంగళవారం పొలం పనులకు వెళ్లారు. సాయంత్రం చిన్నపాటి వర్షం పడుతుండగా ఇంటిదారి పట్టారు. దారిలో పిడుగుపడడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు , గ్రామస్తులు వారిని కాపాడాలనే ఉద్దేశంతో ఎడ్లబండిపై ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో కుశ్నపల్లి పెద్దవాగు వచ్చింది. బ్రిడ్జి, రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కష్టపడి బండిని వాగు దాటించారు. వారిని బెజ్జూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులూ అందుబాటులో లేకుండా పోయారు. పరీక్షించిన ఆర్‌ఎంపీ వారు చనిపోయినట్లు ధ్రువీకరించారు.