నెల్లూరు : నెల్లూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. దీంతో అధికారులు వెంటనే స్పందించి... లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నై - విజయవాడ మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్ట్లో నీటిమట్టం 67 టీఎంసీలకు చేరింది. సూళ్లురుపేటలో కాళంగి నది ఉగ్ర రూపం దాల్చింది.
జిల్లాలోని గూడూరు వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. అలాగే జిల్లాలోని కండలేరు, కుక్కుటేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తిప్పకుంటపాలెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గూడూరు మండలంలోని కైవల్యానది పొంగి ప్రవహిస్తుంది. ఆత్మకూరు, చమడపాలెం, జీఎస్ కండ్రిగ, రామలింగాపురం, విండూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.