మొసలితో ముద్దూ ముచ్చట..
ఈ కాలంలో ఉద్యోగం దొరకడమంటే మాటలా? ఎన్ని పరీక్షలు రాయాలి? తర్వాత గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఇలాంటివి ఎన్ని ఎదుర్కోవాలి? అయితే, చైనాలోని ఓ కంపెనీ మాత్రం ఇవన్నీ ఎందుకు.. సింపుల్‌గా మొసలిని ముద్దెట్టుకోండి చాలు అని చెబుతోంది. అంతేకాదు.. బుధవారం గువాంగ్‌జౌలో మహిళా సిబ్బంది ఎంపిక కోసం చిన్నపాటి మొసలిని రోడ్డుపైకి దించింది. దీన్ని ముద్దెట్టుకున్న మగువులు మొదటి రౌండ్ పాసైపోయినట్లేనని.. నేరుగా ఇంటర్వ్యూకు వెళ్లిపోవచ్చని చెప్పింది.
దీంతో కొందరు అమ్మాయిలు ఇలా మొసలితో ముద్దూముచ్చట్ల కార్యక్రమానికి దిగారు. పైగా.. ముద్దు పెట్టుకున్నవారికి సదరు కంపెనీ వారు ప్రోత్సాహకం కింద రూ.10 వేలు కూడా ఇచ్చారు. ఇదంతా ఎందుకని కంపెనీ వారిని ప్రశ్నిస్తే.. తమ సిబ్బంది ధైర్యాన్ని పరీక్షించేందుకే అని చెప్పారు. ఇంకో విషయం.. ఈ కంపెనీ అమ్మేవి కూడా మొసలి నుంచి తయారుచేసిన ఆరోగ్య ఉత్పత్తులేనట!