- కార్మికుల వేతనాలపై నిర్ణయం మున్సిపాలిటీలదే
- సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం
- 3 శ్లాబుల్లో వేతనాలు.. సీలింగ్ ఖరారుకే సర్కారు పరిమితం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయాధికారాన్ని మున్సిపాలిటీలకే వదిలేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలవారీగా కార్మికులకు పెంచాల్సిన వేతనాలపై సీలింగ్‌ను మాత్రం ప్రభుత్వమే నిర్ణయించనుంది. సీలింగ్ గరిష్ట అవధికి మించకుండా, కనిష్ట అవధికి తగ్గకుండా వేతనాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని మున్సిపాలిటీల పాలకవర్గాలకే సర్కారు కట్టబెట్టే అవకాశాలున్నాయి. పురపాలక శాఖ ఉన్నతాధికారులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలో 67 నగర, పురపాలికలు ఉన్నాయి. ఇందులో దాదాపు 30 వరకూ చిన్న, మధ్యతరహా పురపాలికలు తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాయి. కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీలు ప్రస్తుతం వేతనాలనూ సక్రమంగా చెల్లించలేకపోతున్నాయి. వరంగల్, కరీంనగర్ వంటి నగరాలు, పట్టణాలు మినహా ఇతర మున్సిపాలిటీల పరిస్థితి బాగాలేదు. ఆస్తి, ఇతర పన్నులు, లెసైన్స్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం నామమాత్రంగా ఉంటే, ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయి. కార్మికుల వేతనాలు పెంచాలంటే.. ఆస్తి పన్నుల పెంపు తప్పా మరో దారి లేదని పురపాలక శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో పురపాలికల ఆర్థిక స్థితిగతులపై తెప్పించుకున్న వాస్తవిక నివేదిక ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేసింది.
వేతనాల పెంపు డిమాండ్‌తో మున్సిపల్ కార్మికులు 40 రోజుల పాటు సమ్మె చేసినా.. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేకపోయింది. ఎట్టకేలకు సమ్మె విరమించడంతో వేతనాల విషయంపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం తాత్కాలిక కార్మికులకు మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో రూ.8,300, నగర పంచాయతీల్లో రూ.7,300 వేతనాన్ని చెల్లిస్తున్నారు.
పురపాలికల స్థాయిని బట్టి ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఒకే వేతనాలు ఉండే అవకాశాల్లేవు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వేతనాల పెంపు కోసం 3 శ్లాబులను నిర్ణయించి సీలింగ్ విధించాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నా యి. ఈ శ్లాబుల సీలింగ్ నగర పంచాయతీలకు రూ.8 వేల నుంచి 9 వేలు, మున్సిపాలిటీలకు రూ.9 వేల నుంచి రూ.10 వేలు, కార్పొరేషన్లకు రూ.10 వేల నుంచి రూ.11 వేలు ఉండొచ్చని అధికారుల్లో చర్చ సాగుతోంది. ఈ సీలింగ్‌లోపు ఆయా పురపాలికలే వేతనాలు నిర్ణయించుకోవాలి. పారి శుధ్య కార్మికుల వేతనాలు పెంచే అధికారం ప్రభుత్వానికి లేదని, మున్సిపాలిటీలే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సీఎం కేసీఆర్ పేర్కొనడం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది.
స్థానిక సంస్థలకే నిర్ణయాధికారం!
Published Sun, Aug 16 2015 5:12 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM
Advertisement