ఈడ్చి పారేశారు..
సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిని భగ్నం చేసిన పోలీసులు
సాక్షి, విజయవాడ బ్యూరో: కడుపుమండి కదం తొక్కిన మున్సిపల్ కార్మికులపై ఖాకీలు క్రౌర్యం ప్రదర్శించారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాలన్న ప్రయత్నాన్ని భగ్నంచేసి దొరికినవారిని దొరికినట్టు వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. మహిళలనే కనికరం చూపకుండా పిడిగుద్దులు గుద్దుతూ ఈడ్చిపారేశారు.
పోలీసుల ప్రతాపానికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, బొచ్చు సుబ్బలక్ష్మి మరో ఎనిమిదిమందికి గాయాలయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వేలాదిమంది మున్సిపల్ కార్మికులు శుక్రవారం విజయవాడకు తరలివచ్చి సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లీలామహల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వస్తున్న కార్మికుల్ని, జేఏసీ నేతలపై పోలీసులు ఒక్కసారిగా దాడిచేశారు. వేలమంది కార్మికులను అరెస్టు చేసి వన్‌టౌన్, ఇబ్రహీంపట్నం, భవానీపురం, కృష్ణాలంక, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.
జేఏసీ నేతలు, కార్మికులు అక్కడ కూడా ధర్నాలు, రాస్తారోకోలను కొనసాగించారు. మున్సిపల్ కార్మిక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర నేతలు ఎంఏ గఫూర్, జి.ఓబులేసు, కె.ఉమామహేశ్వరరావు, సీహెచ్.బాబూరావు, వి.ఉమామహేశ్వరరావులు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆరుబయట నేలపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. కుమారి అనే పారిశుధ్య కార్మికురాలు సొమ్మసిల్లి పడిపోవడంతో 108అంబులెన్స్ సిబ్బంది వచ్చి చికిత్స అందించారు.
జేఏసీ నేతలపై చంద్రబాబు కన్నెర్ర..
ముఖ్యమంత్రితో స్థానిక హోటల్‌లో మున్సిపల్ కార్మిక, ఉద్యోగ జేఏసీ నేతలు జరిపిన చర్చలు ఫలించలేదు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి పీఆర్సీ వర్తించదని సీఎం తేల్చిచెప్పారు. తెలంగాణ వాళ్లు చేస్తే మేము చేయాలని ఉందా? అని చిరాకు ప్రదర్శించారు. తెలంగాణ సీఎంతో తనకు పోలికేమిటని ప్రశ్నించారు.
9వ పీఆర్సీ సందర్బంగా ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనం రూ.6,700ఇచ్చిన విషయాన్ని జేఏసీ నేతలు సీఎం దృష్టికి తెచ్చారు. అతితక్కువ పట్టణ జనాభా కోసం ఆదాయమంతా ఖర్చుచేయాలా? అంటూ సీఎం వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎటువంటి హామీ ఇవ్వకుండానే జేఏసీ నేతల్ని బయటకు పంపేశారు. దీంతో సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.
‘ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది’
శాంతియుత ఉద్యమం చేస్తున్న మున్సిపల్ కార్మికులపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ,సీపీఐ నేత రామకృష్ణ ధ్వజమెత్తారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆందోళన కొనసాగించిన జేఏసీ నేతలు, కార్మికులను వారు పరామర్శించి సంఘీభావం ప్రకటించారు.
కార్మికులపై లాఠీచార్జి దారుణం: వైఎస్సార్‌సీపీ
సాక్షి, హైదరాబాద్: దుర్భర పరిస్థితుల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను సానుభూతితో పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై లాఠీచార్జి చేయించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కార్మికులకు మద్దతుగా నిల్చిన రాజకీయ నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరింది. పది రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్న పట్టించుకోవడంలేదని ఆక్షేపించింది.
వారు దళితులనే పట్టించుకోవడంలేదు
* ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మికుల్లో ఎక్కువ శాతం దళితులు ఉన్నందునే వారి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. శుక్రవారం ఇందిర భవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, కొండ్రు మురళీ మోహన్‌లు విలేకర్లతో మాట్లాడారు. కనీస వేతనాల కోసం ఆందోళన చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం సరికాదన్నారు. మున్సిపల్ సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించేందుకు నిధులు లేవంటూ పురపాలక శాఖ మంత్రి నారాయణ చేసిన ప్రకటనను వారు తీవ్రంగా ఖండించారు.