సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోపాటు, చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు అదనపు నిధులు ఇవ్వాలని నీటి పారుదల శాఖ.. ఆర్థిక శాఖను కోరింది. పాలమూరు ప్రాజెక్టు భూసేకరణ వేగవంతానికి ప్రత్యేకంగా రూ.100 కోట్లు, మిషన్‌కాకతీయకు రూ.142 కోట్లు కేటాయించాలని నీటిపారుదల శాఖ విన్నవించింది.అయితే, పాలమూరు నిధుల విషయంలో సానుకూలంగా స్పందించిన ఆర్థిక శాఖ, మిషన్ కాకతీయకు సంబంధించి మరోమారు భేటీయై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
నీటిపారుదల శాఖకు సంబంధించి ఆర్థికశాఖలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు, రావాల్సిన నిధులపై బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షకు ఆయా శాఖల మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావుతో పాటు కార్యదర్శులు ప్రదీప్‌చంద్ర, ఎస్‌కే జోషి, అధికారులు హాజరయ్యారు.
మిషన్ కాకతీయ కోసం 94 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఔట్‌సోర్సింగ్ కింద నియమించే ఫైలు ఆర్థిక శాఖ పరిధిలో పెండింగ్‌లో ఉందని సమీక్షలో దృష్టికి తేగా, దాన్ని త్వరలోనే క్లియర్ చేస్తామని ఆర్ధిక శాఖ అధికారులు హామీ ఇచ్చారు. భూసేకరణ సందర్భంగా బాధితులకు నగదు బదిలీ విషయంలో ఉన్న ఆటంకంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
అవార్డ్ అయిన నిర్వాసితులకు ఒకేమారు చెల్లించే విధానం గతంలో ఉందని, దాన్ని మార్చి దశలవారీగా చేయాలని కోరగా అందుకు ఆర్థిక శాఖ అధికారులు అంగీకరించారు. భూ నిర్వాసితులకు బ్యాంకు ఖాతాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇరు శాఖలు అవగాహనకు వచ్చాయి.
‘మిషన్’ బిల్లులకు కొర్రీలు
చెరువుల పునరుద్ధరణ బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. పునరుద్ధరణ పనులు చేపట్టిన 6,500 చెరువుల్లో ఇప్పటికే 80 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మొత్తంగా 5.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర పూడికను తరలించారు. సుమారు రూ.1,000 కోట్ల మేర పనులు ఇప్పటి వరకు పూర్తయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుపై అధికారులు కొర్రీలు పెడుతున్నారు.
క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఆధారంగా కాంట్రాక్టర్లు పీఏఓ అధికారులను సమర్పిస్తున్నా సాంకేతిక కారణాలు, అదనపు ధ్రువపత్రాలు కోరుతూ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో బిల్లులన్నీ తిరిగొస్తున్నాయి. ఇప్పటివరకు 150 చెరువులకు సంబంధించి రూ.30 కోట్ల విలువైన బిల్లులను మాత్రమే చెల్లించారు. ఈ అంశాన్ని సైతం ఆర్ధిక శాఖ దృష్టికి తీసుకెళ్లిన హరీశ్‌రావు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని బిల్లులు చెల్లించాలని కోరినట్టు తెలిసింది. దీనికి ఆర్థిక శాఖ కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది.
‘పాలమూరు’ భూసేకరణకు అదనపు నిధులు
Published Thu, Jul 16 2015 4:07 AM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM
Advertisement
Advertisement