హెరాల్డ్ కేసులో నేడు కోర్టుకు సోనియా, రాహుల్
బెయిల్ కోరే అవకాశం
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ శనివారం పాటియాలా హౌస్ జిల్లా కోర్టుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో ఎస్పీజీ, ఢిల్లీ పోలీసులతో భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. భద్రతా ఏర్పాట్లను ఇంటెలిజెన్స్ బ్యూరో పరిశీలించింది. కోర్టు ప్రాంగణంలో అదనంగా 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పలు అంచెల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ అంశంపై పోలీసు అధికారులు న్యాయమూర్తితో సమావేశమయ్యారని కోర్టు వర్గాలు తెలిపాయి. కాగా, కేసులో తమకు బెయిల్ ఇవ్వాల్సిందిగా సోనియా, రాహుల్ కోర్టును కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కాంగ్రెస్ తాజాగా సంకేతాలిచ్చింది. ‘బెయిల్‌తోపాటు చట్టపరమైన మార్గాలు, అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నాం. కోర్టు విచారణలో పార్టీ ఏమాత్రం జోక్యం చేసుకోబోదు. అందుకే ఎవరూ కోర్టుకు రావొద్దని కార్యకర్తలకు సూచించాం’ అని సోనియా ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. దీనికి అంత ప్రాముఖ్యం ఇవ్వొద్దని పార్టీ భావిస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. అధినేత కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులను ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను కూడా వారు ఖండించారు.