టైం స్లాట్ దర్శనానికే టీటీడీ మొగ్గు
తిరుమల: శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో గంటల తరబడి ఎదురుచూసే విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) క్రమంగా స్వస్తి పలుకుతోంది. రూ.300 టికెట్ల తరహాలోనే కాలిబాట భక్తులకు కూడా ప్రత్యేక దర్శనం కోసం టైం స్లాట్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. భక్తులకు కేటాయించిన సమయం ప్రకారం స్వామివారిని దర్శించుకోవచ్చు. 2017 అర్థ సంవత్సరం లెక్కల ప్రకారం.. రోజూ 80 వేల మంది శ్రీవారిని దర్శించు కుంటున్నారు.
ఇందులో రూ. 300 టికెట్ (టైం స్లాట్ విధానంలో) ద్వారా రోజుకు 15 వేల నుంచి 25 వేల మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఇదే విధానా న్ని ఈ నెల 17 నుంచి కాలిబాట భక్తులకూ వర్తింపజేసింది. అలిపిరి మార్గంలో రోజుకు 14 వేల టికెట్లు, శ్రీవారి మెట్టు మార్గంలో మరో 6 వేల టికెట్లు ఇస్తున్నారు. ఆ టికెట్లపై ఉన్న సమయం ప్రకారం భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.