గిరిజనాభ్యుదయ సంస్థ కార్యదర్శి వివరణ
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా స్టూవర్ట్‌పురం గ్రామం ప్రస్తుతం పూర్తిగా మారిపోయిందని గిరిజనాభ్యుదయ సంస్థ కార్యదర్శి అన్నపు సమర్పణరావు పేర్కొన్నారు. తాను పుట్టిపెరిగిన ఆ గ్రామంలో లండన్ సాల్వేషన్ ఆర్మీతో పాటు సంస్కార్ సంస్థల కృషి ఫలితంగా గణనీయమైన మార్పులు వచ్చాయని ఆయన తెలిపారు. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన ‘కిక్.. కమలాకర్’ వార్తపై సమర్పణరావు ఆ గ్రామం తరఫున సోమవారం వివరణ ఇచ్చారు. ప్రస్తుతం స్టూవర్ట్‌పురం గ్రామంలో 90 శాతానికి పైగా విద్యావంతులు ఉన్నారని, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్నత స్థాయిలకు చేరుకున్నారని తెలిపారు.
అయితే ఇప్పటికీ కొందరు పోలీసులు గ్రామంలో ఉన్న వారంతా నేరచరితులే అన్నట్లు వ్యవహరిస్తున్నారని సమర్పణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైఖరిలో పూర్తిస్థాయి మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. స్టూవర్ట్‌పురంలో ఇప్పుడున్న పరిస్థితులపై మీడియా సైతం దృష్టిపెట్టాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎలాంటి పిక్‌పాకెటింగ్, దొంగల బడులు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం గ్రామస్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తే స్టూవర్ట్‌పురం అభివృద్ధి పథంలో మరింత ముందుకు వెళ్తుందని సమర్పణరావు వివరించారు.