గుక్కెడు నీటికీ గండం!
తెలంగాణ, ఏపీలో తాగునీటికి కటకట
* అవసరాలు 20 టీఎంసీలుకాగా లభ్యత జలాలు 10 టీఎంసీల్లోపే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గుక్కెడు తాగునీటికీ కటకట ఏర్పడింది! తొలకరిలో ఊరించిన వర్షాలు తర్వాత ముఖం చాటేయడంతో పరిస్థితులు ఎండాకాలాన్ని తలపిస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ జంటనగరాలు, నల్లగొండతోపాటు ఏపీలోని రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఒంగోలు జిల్లాలకు కృష్ణా జలాలే ఆధారం.
ఈ ఏడాది చినుకు పడకపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలశయాలు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా చినుకు రాలకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. రెండు ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించడం అటుంచి, తాగునీటి అవసరాలకూ సరిపోయేంత నీటి లభ్యత కూడా లేకపోవడంతో గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కడం ఎలా అని ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. రెండు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం వినియోగార్హమైన జలాల లభ్యత 9.5టీఎంసీలకు మించి లేవని, వాటినే పొదుపుగా వినియోగించుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు భావిస్తున్నాయి.
ప్రస్తుతం తాగునీటి అవసరాలను ఎన్నిరోజుల పాటు తీర్చగలమని కసరత్తు చేస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లో తాగునీటికి తక్షణం 20 టీఎంసీలు కావాలని అధికారులు చెబుతున్నారు. చినుకు రాలితే పర్వాలేదు.. లేదంటే కనీసం ఆగస్టు ఆఖరువరకైనా తాగునీటి అవసరాల నుంచి గట్టెక్కాలని, ఆ మేరకు ప్రణాళిక రూపొందించి, దానికి అనుగుణంగా నీటిని విడుదల చేయాలనే యోచన ఇరు రాష్ట్రాల సాగునీటిశాఖ అధికారుల్లో ఉంది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను ఈ వారంలో జరిగే బోర్డు సమావేశంలో ముందు పెట్టి తేల్చుకోవాలని నిర్ణయించారు.
లభ్యత గోరంత..అవసరం కొండంత..
తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్ పరిధిలో అసలు వర్షాలే కురవని కారణంగా శ్రీశైలం, సాగర్‌లోకి ఈ ఏడాది చుక్కనీరు చేరలేదు. దీంతో ప్రస్తుతం సాగర్‌లో నీటినిల్వ 590 అడుగులకుగానూ 510.9 అడుగులకు పడిపోగా, శ్రీశైలంలో 885 అడుగులకుగానూ 802.7కు పడిపోయింది. సాగర్ కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా ఈ ఎత్తులో లభ్యత జలాలు కేవలం 1.5 టీఎంసీలే. శ్రీశైలంలో ఇప్పటికే 834 అడుగుల కనీస మట్టాలను దాటి నీటిని వాడేసుకున్నారు. ఇందులో 785 అడుగుల వరకు నీటిని వాడుకునే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఈ స్థాయి వరకు నీటిని వాడుకున్నా 7.96 టీఎంసీలకు మించి నీరు అందుబాటులో లేదు. మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో ఉన్న 9.5టీఎంసీల నీటినే ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు వాడుకోవాల్సి ఉంది. కృష్ణా డెల్టా అవసరాలకు 12 టీఎంసీల మేర నీరు అవసరమని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్... తెలంగాణను సంప్రదించగా, తమ ప్రాంతంలో నల్లగొండ, హైదరాబాద్ జంట నగరాల అవసరాలకు సైతం మరో 8-10 టీఎంసీల మేర నీరు కావాలని చెబుతోంది.
అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలతో అవసరాలు తీరేవి కాని నేపథ్యంలో ఇరు రాష్ట్రాలూ బోర్డును సంప్రదించాయి. సాగర్‌లో 510 అడుగుల మట్టాన్ని కాపాడాలని హైకోర్టు ఆదేశాలున్నాయి. ఈ ఆదేశాలను పాటించి 510 అడుగుల దిగువకు నీటిని వాడరాదని హైదరాబాద్ జలమండలి ఇటీవల తెలంగాణ నీటిపారుదలశాఖకు లేఖ రాసింది. ఇరు రాష్ట్రాల అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసేలా ఇరు రాష్ట్రాలు బోర్డును కోరేందుకు సమాయాత్తమవుతున్నాయి.
ఎగువన 108 టీఎంసీలు నిండితేనే దిగువకు..
గత నెలలో కురిసిన భారీ వర్షాలకు ఎగువ కర్ణాటకలో ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తినా క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టికి వరద పూర్తిగా నిలిచిపోగా, తుంగభద్రలో 8,181 క్యూసెక్కుల వరద ఉంది. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌లో 36 టీఎంసీలు, ఆల్మట్టిలో 65 టీఎంసీల, నారాయణపూర్‌లో మరో 7 టీఎంసీల మేర లోటు ఉంది. ఇవన్నీ నిండుకున్నాకే దిగువ శ్రీశైలం, జూరాలకు నీరు చేరే అవకాశం ఉంది.