శ్రీశైలం నుంచి నీళ్లిస్తేనే
సాగర్ కుడి కాలువకు నీళ్లిస్తాం
కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
4 టీఎంసీల నీటి విడుదలపై మెలిక
మరో వివాదానికి తెరతీసినట్లే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువకు నాలుగు టీఎంసీలు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మెలిక పెట్టింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేస్తేనే సాగర్ కుడి కాలువకు నీళ్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కు లేఖ రాసింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 802.7 (డెడ్ స్టోరేజీ) అడుగుల మట్టంలో 30.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. డెడ్ స్టోరేజీ కారణంగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు లేవు. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల వినియోగంపై ఈ నెల 20న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా సాగర్ కుడి కాలువకు తాగునీటి అవసరాలకు 8, కృష్ణా పుష్కరాలకు 4, సాగు, తాగునీటి అవసరాలకు ఎడమ కాలువకు 4.. మొత్తం 16 టీఎంసీల నీటిని తక్షణమే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది.
అదే సమయంలో హైదరాబాద్ తాగునీటి అవసరాలు, ఇతరత్రా అవసరాల నిమిత్తం మొత్తం 7 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆ మేరకు నీటì విడుదల సాధ్యం కాదని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ అన్నారు. ఇరు రాష్ట్రాల నీటిపారుదల కార్యదర్శులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని.. అందువల్ల సాగర్ కుడి కాలువకు తక్షణమే 4 టీఎంసీలు విడుదల చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఈనెల 22న కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఆ మేరకు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఈనెల 25న కృష్ణా బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి జవాబుగానే టీ సర్కార్ మంగళవారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.
శ్రీశైలం ప్రస్తుత నీటిమట్టం 802.7 అడుగులే..
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. గరిష్టంగా 215.807 టీఎంసీలను నిల్వ చేయొచ్చు. కనీసం 854 (మినిమం డ్రా డౌన్ లెవల్) అడుగుల మట్టం ఉంటేనే నీటిని విడుదల చేయాలి. అంతకన్నా తక్కువ ఉంటే చేయకూడదు. కానీ 1996లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎండీడీఎల్‌ను 834 అడుగులకు (జీవో 69) తగ్గించింది. దీనిపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో 2004లో ప్రభుత్వం ఎండీడీఎల్‌ను 854 అడుగులకు పునరుద్ధరించింది.
అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో గతేడాది 790 అడుగుల వరకు నీటిని వాడుకునేలా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. కానీ 786 అడుగుల వరకు నీటిని వినియోగించుకున్నాయి. దీని వల్ల రాయలసీమ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 874 అడుగుల నీటిమట్టం ఉంటేనే దిగువకు నీటిని విడుదల చేయాలని సీమ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు నీళ్లందించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో ప్రస్తుతం 802.7 అడుగుల నీటిమట్టమే ఉంది. అయినా నీటి విడుదలకు ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే, గతేడాది తరహాలోనే తెలంగాణకు విద్యుదుత్పత్తి చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లవుతుందని నిపుణులు అంటున్నారు.