హైదరాబాద్: తెలంగాణలోని స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారంతో ముగిసింది. నాలుగు జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరో వైపు ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో ఉన్న ప్రతిపక్ష, స్వతంత్ర సభ్యులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది.
కరీంనగర్ నుంచి నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్‌రావు, వరంగల్ నుంచి కొండా మురళి, ఆదిలాబాద్ నుంచి పురాణం సతీష్ కుమార్, మెదక్ నుంచి భూపాల్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి భూపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 27 పోలింగ్ జరగనుంది. 30 వతేదీ ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.
కాగా ఎన్నికలు జరుగుతున్న నాలుగు జిల్లాల్లోనే ఎన్నికల కోడ్ వర్తిస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. క్యాంప్ రాజకీయాలకు పాల్పడితే ఒప్పుకోమని ఆయన హెచ్చరించారు. ఒకే బ్యాలెట్ తో పోలింగ్ జరుగుతుందని తెలిపారు.